బుక్ మై షో.. సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఎవరి జోరు ఎంత?
గత 24 గంటల్లో బుక్ మై షోలో జరిగిన టికెట్ సేల్స్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మ్యాజిక్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది.
By: M Prashanth | 14 Jan 2026 1:52 PM ISTసంక్రాంతి పండుగ అంటేనే థియేటర్ల దగ్గర అసలైన హడావుడి కనిపిస్తుంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది. పెద్ద హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ తమ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. థియేటర్లలో రద్దీ ఎలా ఉన్నా.. ఆన్లైన్ బుకింగ్స్ చూస్తే ఏ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో క్లియర్ గా అర్థమైపోతుంది. ముఖ్యంగా లేటెస్ట్ ట్రెండ్ ప్రకారం బుక్ మై షో డేటా ఇప్పుడు సినిమాల సక్సెస్ కు అద్దం పడుతోంది.
పండుగ సెలవులు ప్రారంభమవడంతో ప్రేక్షకులు ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్స్ తో పాటు విభిన్నమైన కథలతో వస్తున్న సినిమాల వల్ల ఆడియన్స్ కు బోలెడన్ని ఆప్షన్స్ దొరికాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా క్లియర్ గా డామినేట్ చేస్తోంది. మిగిలిన సినిమాలు కూడా తమ స్థాయిలో పర్వాలేదనిపిస్తున్నాయి.
గత 24 గంటల్లో బుక్ మై షోలో జరిగిన టికెట్ సేల్స్ చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి మ్యాజిక్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా ఏకంగా 4.06 లక్షల కంటే ఎక్కువ టికెట్లను అమ్ముడుపోవడంతో టాప్ లో నిలిచింది. పండుగ సీజన్ లో బాస్ సినిమా వస్తే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ఈ నంబర్స్ మరోసారి ప్రూవ్ చేస్తున్నాయి. అనిల్ రావిపూడి కామెడీ, చిరంజీవి వింటేజ్ మేనరిజమ్స్ ఆడియన్స్ కు ఫుల్ గా కనెక్ట్ అయ్యాయి.
ఇక ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా కూడా నిలకడగా బుకింగ్స్ రాబడుతోంది. గత 24 గంటల్లో ఈ సినిమా 74 వేల పైచిలుకు టికెట్ల సేల్స్ నమోదు చేసింది. దీనితో పాటు 'ధురంధర్', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాలు కూడా దాదాపు 50 వేల టికెట్ల రేంజ్ లో సేల్స్ తో తమ ఉనికిని చాటుకుంటున్నాయి. రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి BMW' కూడా 50 వేల మార్కును టచ్ చేస్తూ పోటీలో కొనసాగుతోంది.
తమిళ స్టార్ శివకార్తికేయన్ 'పరాశక్తి' సినిమా కూడా మంచి బుకింగ్స్ నే రాబడుతోంది. దాదాపు 46 వేల టికెట్లు గత 24 గంటల్లో అమ్ముడయ్యాయి. ఇక హాలీవుడ్ సెన్సేషన్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' బుకింగ్స్ ప్రస్తుతానికి తక్కువగా ఉన్నా.. ముందు ముందు పెరిగే ఛాన్స్ ఉంది. ఈ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ ఎవరనేది దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది.
గత 24 గంటల్లో బుక్ మై షోలో అమ్ముడైన టిక్కెట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
మన శంకర వరప్రసాద్ గారు: 4,06,890 టికెట్లు
ది రాజా సాబ్: 74,940 టికెట్లు
ధురంధర్: 53,610 టికెట్లు
అనగనగా ఒక రాజు: 51,530 టికెట్లు
రవితేజ BMW: 50,440 టికెట్లు
శివ కార్తికేయన్ పరాశక్తి: 46,020 టికెట్లు
అవతార్: ఫైర్ అండ్ యాష్: 15,780 టికెట్లు
