సంక్రాంతి సీజన్.. ఆ రెండూ వచ్చుంటే అంతే సంగతి!
అయితే ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలతోపాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.
By: M Prashanth | 15 Jan 2026 11:33 AM IST2026 సంక్రాంతి బాక్సాఫీస్ సీజన్ టాలీవుడ్ కు ఊహించని సవాళ్లను తెచ్చిపెట్టిందని చెప్పాలి. సాధారణంగా పొంగల్ ఫెస్టివల్ విండోలో మూడు లేదా నాలుగు సినిమాలకు మించి ఎప్పుడూ అవకాశం ఉండదు. కానీ ఈసారి కేవలం వారం రోజుల్లో ఐదు తెలుగు స్ట్రయిట్ సినిమాలు విడుదల కావడంతో థియేటర్ల విషయంలో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. పండుగ సీజన్ కావడంతో ప్రేక్షకుల డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ స్క్రీన్లు మాత్రం లేవు.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల కొరత ప్రధాన సమస్యగా మారింది. అన్ని సినిమాల డిస్ట్రిబ్యూటర్లు ఒకేసారి ఎక్కువ స్క్రీన్లు, ఎక్కువ షోలు కోరడంతో పరిస్థితి మరింత కష్టంగా మారింది. పండుగ సీజన్ ను పూర్తిగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి సినిమా ఎక్స్ ట్రా షోల కోసం ప్రయత్నించింది. అయితే ముందే కొన్ని చిత్రాలు ఎక్కువ స్క్రీన్లను ముందే బ్లాక్ చేసుకోవడంతో ఇబ్బంది వచ్చింది.
అయితే ఈసారి సంక్రాంతికి ఐదు తెలుగు చిత్రాలతోపాటు రెండు డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి. కోలీవుడ్ హీరోలు విజయ్, శివకార్తికేయన్ నటించిన జన నాయగన్, పరాశక్తి చిత్రాలు కూడా విడుదల కావాల్సి ఉంది. కానీ జన నాయగన్ సెన్సార్ సమస్యల వల్ల పూర్తిగా వాయిదా పడింది. పరాశక్తి మూవీ తమిళ వెర్షన్ విడుదల అయినా.. తెలుగులో మాత్రం రిలీజ్ అవ్వలేదు.
ఐదు సినిమాలకే థియేటర్స్ పరిస్థితి ఇలా ఉంటే, డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలై ఉంటే పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉండేదో ఊహించుకోవచ్చు. లక్కీగా జన నాయకుడు, పరాశక్తి చిత్రాలు వేర్వేరు కారణాలతో వాయిదా పడటంతో సంక్రాంతి రేసు మరింత గందరగోళంగా మారకుండా తప్పించుకుంది. లేకుంటే ఎలా ఉండేదనేది ఇప్పటికే అందరికీ క్లారిటీ కూడా వచ్చేసిందనే చెప్పాలి.
అయితే సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాల డిస్ట్రిబ్యూటర్లు అదనపు స్క్రీన్ల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎక్కువ సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ట్రేడ్ సర్కిళ్లు, బయ్యర్లు అందరూ దీనిని పెద్ద తలనొప్పిగా భావిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతికి ఫస్ట్ వచ్చిన ది రాజా సాబ్ మూవీ టాక్ మిక్స్ డ్ గా ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల స్క్రీన్స్ తగ్గడం లేదు.
ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ ఉన్నప్పటికీ మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి సరైన స్థాయిలో థియేటర్లు దక్కడం లేదు. నార్మల్ షోలు దొరకక, తెల్లవారుజామున ఒంటి గంట షోలను ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు చిత్రాలకు డీసెంట్ రిపోర్ట్స్ వచ్చినా కావాల్సినన్ని స్క్రీన్లు దక్కకపోవడం వల్ల వసూళ్లు రావడం లేదు. ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి పరిస్థితి కూడా అంతేలా ఉంది!
