Begin typing your search above and press return to search.

సంక్రాంతి చిత్రాలు.. అన్నీ తక్కువ రేట్లతోనేనా?

సినీ సంక్రాంతి మొదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీతో స్టార్ట్ అయింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  M Prashanth   |   10 Jan 2026 12:38 AM IST
సంక్రాంతి చిత్రాలు.. అన్నీ తక్కువ రేట్లతోనేనా?
X

సినీ సంక్రాంతి మొదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీతో స్టార్ట్ అయింది. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ మూవీ.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. అయితే టాక్ విషయం పక్కన పెడితే.. ఆ సినిమా టికెట్ రేట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. అది కూడా తెలంగాణలోనే.

నిజానికి భారీ ఎత్తున రేట్ల పెంపు కోసం రాజా సాబ్ మేకర్స్.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల సంప్రదించారు. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదంటూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం.. గతంలో ఇచ్చిన తీర్పును ఆ చిత్రాల వరకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాజా సాబ్ కు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది.

కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యంగా అనుమతులు వచ్చాయి. గురువారం రాత్రి ప్రీమియర్స్ వేస్తామని ముందు చెప్పినా.. జీవో రాకపోవడం వల్ల వేయలేదు. ఆ తర్వాత తక్కువ మొత్తంలో టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. దీంతో సర్కార్ మెమో ఆధారంగా ఆ ధరలకే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసిన మేకర్స్.. సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఆ మెమోను హైకోర్టు తాజాగా కొట్టివేసింది.

నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ పిటిషన్‌ వేయగా, విచారణ చేపట్టిన హైకోర్టు మెమోను కొట్టేసింది. అదే సమయంలో ప్రభుత్వంపై ఫుల్ గా ఫైర్ అయింది. తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని క్వశ్చన్ చేసింది. ధరలు పెంచబోమని మంత్రి ప్రకటించారని, అయినా మెమోలు ఎందుకు ఇస్తున్నారంటూ మండిపడింది.

ఇప్పటికే ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు ఆలోచన మారడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ ప్రశ్నించింది. దీంతో రాజా సాబ్ మేకర్స్ కు గట్టి షాక్ తగిలింది. నేటి రాత్రి షోల నుంచే రాజా సాబ్ టికెట్ రేట్లు తెలంగాణలో మామూలుగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో మిగతా సంక్రాంతి చిత్రాలపై కూడా జోరుగా చర్చ సాగుతోంది.

నిజానికి.. సంక్రాంతికి రాజా సాబ్ తోపాటు మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు సినిమాలు కూడా షెడ్యూల్ అయ్యాయి. ఆ సినిమాల్లో కొన్నింటికి ధరలు పెంచేందుకు మేకర్స్ ప్రభుత్వాన్ని సంప్రదించేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇప్పుడు రాజా సాబ్ మోమోను హైకోర్టు కొట్టేయడంతో, మరే సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం కష్టం. కాబట్టి మిగతా చిత్రాలు కూడా సాధారణ ధరలతోనే విడుదలవుతాయేమో.