నాలుగు నెలలు ముందే మొదలైన సంక్రాంతి సందడి!
టాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి బరి కోసం ఏకంగా నాలుగు నెలల ముందే ప్రమోషన్స్ హోరెత్తుతున్నాయి.
By: Srikanth Kontham | 22 Aug 2026 4:00 AM ISTటాలీవుడ్‌లో ప్రతిష్టాత్మకంగా భావించే సంక్రాంతి బరి కోసం ఏకంగా నాలుగు నెలల ముందే ప్రమోషన్స్ హోరెత్తుతున్నాయి. పండగ రేసులో ఎవరెవరు నిలుస్తారనే దానిపై ట్రేడ్ వర్గాల్లో స్పష్టత రావడంతో మేకర్స్ సినిమాల అప్‌డేట్‌లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. సాధారణంగా పండగకు నెల రోజుల ముందు ప్రారంభమయ్యే హడావుడి ఈసారి చాలా ముందుగానే షురూ కావడంతో సినిమా సర్కిల్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సంక్రాంతి రేసులో విక్టరీ వెంకటేష్ - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి అదరగొట్టడానికి సిద్ధమైంది.
నందమూరి కళ్యాణ్ రామ్ కూడా జతకడుతున్న భారీ మల్టీస్టారర్‌కు 'జనవరి 12 విడుదల' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసారు. మేకర్స్ ఒకేసారీ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. బావ బామ్మర్ది కాన్సెప్ట్‌తో వస్తున్న ఫుల్ లెంత్ ఎంటర్‌టైనర్ పై ప్రేక్షకుల్లో అంచనాలు తారాస్థాయికి చేరుతున్నాయి. సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా 'సంబరాల ఏటి గట్టు' కూడా జనవరి 12నే బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.
అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో తేజ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి - మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కలయికలో తెరకెక్కుతోన్న 'మెగా 158' ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కూడా పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. `వాల్తేరు వీరయ్య` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇద్దరి కాంబో రిపీట్ అవ్వడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇలా స్టార్ హీరోలంతా ముందే తమ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రకటనలు ఇస్తుండటంతో వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ఇప్పటి వరకూ ఎన్నడూ లేనివిధంగా రసవత్తరంగా మారుతుందని భావిస్తున్నారంతా. కంటెంట్ ఏ స్థాయిలో ఉన్నా? ముందుగానే అంచనాలను క్రియేట్ చేయడంలో టాలీవుడ్ మేకర్స్ అనుసరిస్తున్న ఈ సరికొత్త వ్యూహం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
అయితే ఈ మధ్యలో వినాయక చవితి.. దసరా ..దీపావళి అంటూ మరికొన్ని పండగలు కూడా ఉన్నాయి. కానీ దర్శక, హీరోలు సంక్రాంతి మీద దృష్టి పెట్టినంతగా ఈ సీజన్లపై ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. రిలీజ్ కు కేవలం సంక్రాంతి ఒక్కటే టార్గెట్ కాకుండా ప్రతీ పండక్కి ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
