2026 సంక్రాంతిలో సిక్స్ ఫైట్స్.. ఎవరైనా తగ్గుతారా?
సంక్రాంతి.. టాలీవుడ్ కు అసలైన సీజన్ అదేనని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
By: M Prashanth | 20 Oct 2025 1:35 PM ISTసంక్రాంతి.. టాలీవుడ్ కు అసలైన సీజన్ అదేనని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఏడాది మొత్తంలో ఎక్కువ పోటీ ఉండేది ఆ ఫెస్టివల్ కు మాత్రమే. ఆ సమయంలో చాలా సినిమాలు ఆడేందుకు స్పేస్ ఉంటుంది. ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఫుల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దీంతో ఏటా మూడు నాలుగు సినిమాలు విడుదలవడం సాధారణ విషయమే.
ఆ మూవీలన్ని బాక్సాఫీస్ వద్ద గట్టిగా పోటీ పడతాయి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి మాత్రం కాంపిటీషన్ పీక్స్ లో ఉండనుందని తెలుస్తోంది. హీరోల మధ్య పోటీ మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఎందుకంటే ఏకంగా ఆరు సినిమాలు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో ఇప్పటికే ఐదు ఫిక్స్ అవ్వగా.. మరొకటి కూడా దాదాపు ఖరారే.
నిజానికి.. 2026 సంక్రాంతికి మొదట్లో పోటీ తక్కువగానే ఉన్నట్లు అనిపించింది. కానీ ఇప్పుడు ఎవరూ ఊహించని రేంజ్ కు చేరింది. మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమాలతో మొదలైన రేసులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో ఇప్పటికే చేరారు.
ఆయనతోపాటు కోలీవుడ్ ప్రముఖ హీరో దళపతి విజయ్.. జన నాయగన్ సినిమాతో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్.. నారి నారి నడుమ మురారి మూవీతో సంక్రాంతికి వస్తున్నట్లు దీపావళి కానుకగా సోషల్ మీడియాలో తాజాగా అనౌన్స్ చేశారు. సంప్రదాయ పంచెకట్టులో ఉన్న తన న్యూ లుక్ ను రివీల్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
అలా సంక్రాంతి రేసులో చిరంజీవి, నవీన్ పోలిశెట్టి, ప్రభాస్, విజయ్, శర్వానంద్ చేరగా.. మాస్ మహారాజా రవితేజ కూడా పొంగల్ కే రానున్నట్లు తెలుస్తోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సినిమా కూడా సంక్రాంతి పండుగకే రిలీజ్ అవుతుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. కానీ ఆ తర్వాత ఎలాంటి ప్రకటన చేయలేదు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరికొద్ది రోజుల్లో సంక్రాంతి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. దీంతో ఈసారి పొంగల్ కు ఎన్నడూ లేనంతగా ఆరు సినిమాలు విడుదల అవ్వనున్నాయి. కానీ అదే జరిగితే థియేటర్స్ పరంగా మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వసూళ్లు కూడా డివైడ్ అవుతాయి. కాబట్టి చివరి నిమిషంలో ఎవరైనా రేసు నుంచి వైదొలుగుతారేమో వేచి చూడాలి.
