2026 సంక్రాంతి.. నెవ్వర్ బిఫోర్ అనేలా పోటీ!
పండగకు సెలవలుంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ సినిమాలకు వెళ్లాలనుకుంటారనే కారణంతో ఎక్కువ మంది దర్శకనిర్మాతలు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Aug 2025 9:00 PM ISTప్రస్తుత కాలంలో సినిమాలకు రిలీజ్ డేట్స్ అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. సినిమాలకు మంచి సీజన్ అంటే సంక్రాంతి, దసరా, దీపావళి, సమ్మర్ హాలిడేస్. అందులో అందరూ ఎక్కువగా టార్గెట్ చేసే సీజన్ అంటే సంక్రాంతినే. పండగకు సెలవలుంటాయి కాబట్టి ఫ్యామిలీతో కలిసి ఆడియన్స్ సినిమాలకు వెళ్లాలనుకుంటారనే కారణంతో ఎక్కువ మంది దర్శకనిర్మాతలు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ఉంటారు.
అయితే వచ్చే ఏడాది సంక్రాంతి అంటే 2026 సంక్రాంతికి గట్టి పోటీనే ఉండేట్టు కనిపిస్తుంది. అందరి కంటే ముందుగా సంక్రాంతికి కర్ఛీఫ్ వేసుకున్న మొదటి సినిమా మెగా157. ఆ తర్వాత రవితేజ అనార్కలి మరియు నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు. ముందు ఈ మూడు సినిమాలే వస్తాయనుకున్నారు కానీ రోజులు గడిచే కొద్దీ ఒక్కో సినిమా సంక్రాంతి రేసులోకి యాడ్ అవుతుంది.
అందులో భాగంగానే డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ప్రభాస్ ది రాజా సాబ్ ను సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుందని నిర్మాతలు ఆలోచిస్తున్నారట. దాంతో పాటూ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌ను కూడా సంక్రాంతికి దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న అఖండ2 కూడా సంక్రాంతికి వస్తుందంటున్నారు.
అఖండ2ను ఆరు నూరైనా నురు నూట పదహారైనా సెప్టెంబర్ 25కే రిలీజ్ చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసేది లేదని మేకర్స్ చెప్తున్నారు కానీ ఏదైనా కారణాల వల్ల ఒకవేళ వాయిదా పడితే అఖండ2 కూడా సంక్రాంతికే షిఫ్టవుతుంది. దీంతో పాటూ కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ ఆఖరి సినిమాగా వస్తోన్న జన నాయగన్, శివ కార్తికేయన్ సినిమా ఒకటి రిలీజ్ కానుంది. అంటే మొత్తం 8 సినిమాలు.
సంక్రాంతికి ఇంకా నాలుగు నెలలున్న నేపథ్యంలో మరికొన్ని సినిమాలు రేసులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందులో కొన్ని సినిమాలు కూడా రిలీజ్ డేట్ మారే అవకాశం లేకపోలేదు. ఎలాగైనా సరే ఈసారి సంక్రాంతికి ఎంత లేదన్నా ఐదారు సినిమాలు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అదే నిజమైతే పొంగల్ సినిమాలకు మామూలు క్లాష్ ఉండదనేది ఖాయం. అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాలే కావడంతో ఒకేసారి రిలీజైతే ఆయా సినిమాల ఓపెనింగ్స్ పై కూడా ఆ ప్రభావం చూపే అవకాశముంది. మరి పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకుని ఆయా చిత్ర నిర్మాతలేమైనా మనసు మార్చుకుంటారేమో చూడాలి.
