Begin typing your search above and press return to search.

స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ విన‌సొంపుగా!

అచ్చ‌మైన స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ తో సినిమాలు వ‌చ్చి చాలా కాల‌మ‌వుతుంది. క‌థ‌లు మార‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టు ర‌క‌ర‌కాల టైటిల్స్ పుట్టుకొస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   2 Dec 2025 6:33 PM IST
స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ విన‌సొంపుగా!
X

అచ్చ‌మైన స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ తో సినిమాలు వ‌చ్చి చాలా కాల‌మ‌వుతుంది. క‌థ‌లు మార‌డంతో? అందుకు త‌గ్గ‌ట్టు ర‌క‌ర‌కాల టైటిల్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఎక్కువ‌గా ఇంగ్లీష్ టైటిల్సే హైలైట్ అవుతున్నాయి. ఒక‌ప్పుడు హీరో ఇమేజ్ ఆధారంగా కూడా టైటిల్స్ నిర్ణ‌యించేవారు. కానీ ఇప్పుడా స‌న్నివేశం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. హీరో ఇమేజ్ కంటే ప్రేక్ష‌కులు క‌థ‌కే పెద్ద పీట వేస్తున్నారు. దీంతో వీలైనంత వ‌ర‌కూ టైటిల్ క్యాచీగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈక్ర‌మంలో తెలుగు ప‌దాల‌తో కూడిన టైటిల్స్ దూర‌మ‌వుతున్నాయి.

మెగాస్టార్ అస‌లు పేరుతో:

అయితే ఈ సంక్రాంతి కి రిలీజ్ అవుతున్న కొన్ని సినిమాల టైటిల్స్ మాత్రం స్వ‌చ్ఛ‌మైన తెలుగు టైటిల్స్ గా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో 157వ సినిమా తెరెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు `మ‌న శంక‌రవ‌ర‌ప్ర‌సాద్ గారు` అనే టైటిల్ నిర్ణ‌యించారు. ఇది ప‌క్కా కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. క‌థ‌కి..టైటిల్కి సంబంధం ఏంటో తెలియ‌దు గానీ...ఇది మాత్రం చిరంజీవి వాస్త‌వ పేరు. దీంతో ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అన్న‌య్య పేరునే టైటిల్ గా పెట్ట‌డం అంటే అనీల్ పెద్ద సాహ‌సం చేసిన‌ట్లే.

రాజా పుల్ ఖుషీగా:

సినిమా ప‌క్కాగా హిట్ బొమ్మ అనిపించుకోక‌పోతే విమ‌ర్శ‌లు ఎదుర్కోక త‌ప్ప‌దు. ర‌వితేజ సినిమా టైటిల్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న ఇమేజ్ కు త‌గ్గ‌ట్టు టైటిల్స్ కూడా అంతే మాస్ గా ఉంటాయి. `ధ‌మాకా`, `మాస్ జాత‌ర` గ‌త సినిమాల టైటిల్స్. కానీ కిషోర్ తిరుమ‌ల మాత్రం అత‌డిని కుటుంబ‌రావుగా చూపిస్తున్నాడు. అందుకే `భ‌ర్త‌మ‌హాశ‌యుల‌కు` అనే ప‌క్కా తెలుగు టైటిల్ పెట్టాడు. అందులో ఎక్క‌డా మాస్ యాంగిల్ లేదు. ఎంతో స్వ‌చ్ఛంగా ఉంది. టైటిల్ విష‌యంలో ర‌వితేజ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు.

అదీ గురూజీకి మాత్ర‌మే చెల్లింది:

అలాగే యంగ్ హీరో శర్వానంద్ క‌థానాయకుడిగా రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వ‌తంలో ఇద్ద‌రు హీరోయిన్ల ముద్దుల బావ‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమాకు `నారీ నారీ న‌డుమ మురారీ` అనే టైటిల్ పెట్టాడు. ప‌క్కా ఫ్యామిలీ ఎంట‌ర్ టైనింగ్ క‌థ కావ‌డంతో? టైటిల్ పర్పెక్ట్ గా యాప్ట్ అయింది. మ‌రో యంగ్ హీరో న‌వీన్ పోలిశెట్టి మారి తెర‌కెక్కిస్తోన్న చిత్రానికి `అన‌గ‌న‌గా ఒక రాజు` అనే టైటిల్ నిర్ణ‌యించారు. ఇది ఫ్యామిలీ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్. అలాగే వెంక‌టేష్ హీరోగా త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తోన్న చిత్రానికి `బంధుమిత్రుల అభినంద‌న‌ల‌తో` అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ ఏ సినిమా చేసినా ఆ టైటిల్స్ లో తెలుగు ద‌నం ఉట్టి ప‌డుతుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు.