సంక్రాంతి బరిలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్న హీరోలు వీళ్లే!
ఒక్క టాలీవుడ్ నుంచే కాదు అటు కోలీవుడ్ నుంచి కూడా హీరోలు ఈ పోటీకి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. మరి ఇప్పటికే సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
By: Madhu Reddy | 18 Sept 2025 1:00 PM ISTఎప్పటిలాగే వచ్చే సంక్రాంతికి కూడా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సంక్రాంతి స్లాట్ ను కూడా బుక్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.. సాధారణంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద పండుగ సంక్రాంతి అనే చెప్పాలి. ముఖ్యంగా స్టార్ హీరోలను మొదలుకొని చిన్న హీరోల వరకు అలాగే పక్క రాష్ట్రాల హీరోలు కూడా ఈ సంక్రాంతికి తెలుగులో తమ సినిమాలను విడుదల చేయాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినిమా సక్సెస్ అయినా.. డిజాస్టర్ గా నిలిచినా.. కచ్చితంగా కొంతవరకు లాభ పడొచ్చు అనే కారణంతోనే సినిమాలు రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తారు.
అందుకే సంక్రాంతి సెలవులను క్యాష్ చేసుకోవాలని పోటీ పడడానికి కూడా సిద్ధపడతారు. అందులో భాగంగానే కథ కంటెంట్ ఉంటే ఎలాంటి పోటీనైనా తట్టుకొని నిలబడవచ్చు అని ఇప్పటికే పలు చిత్రాలు నిరూపించిన విషయం తెలిసిందే. హనుమాన్,సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సత్తా చాటాయి కూడా.. ఇక వచ్చే ఏడాది మంచి కథ, కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడానికి ఏకంగా నలుగురు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు. ఒక్క టాలీవుడ్ నుంచే కాదు అటు కోలీవుడ్ నుంచి కూడా హీరోలు ఈ పోటీకి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. మరి ఇప్పటికే సంక్రాంతి స్లాట్ బుక్ చేసుకున్న ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు'..
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు'. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి అలాగే ఆయన కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలోకి దిగడానికి ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. జనవరి 12 2026న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో వెంకటేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు.
రవితేజ #RT 76 మూవీ..
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ 76వ చిత్రంగా #RT 76 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. దసరా సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం.
బాలకృష్ణ అఖండ 2: తాండవం..
'అఖండ' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ.. ఇప్పుడు 'అఖండ 2: తాండవం' అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ OG సినిమాకు పోటీగా విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చినా.. కొన్ని కారణాలవల్ల ఈ సినిమాను వచ్చే యేడాది సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు.
ప్రభాస్ ది రాజా సాబ్..
మారుతి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై చేస్తున్న సినిమా 'ది రాజా సాబ్'. ప్రభాస్ కెరియర్ లో తొలిసారి హారర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేస్తూ విడుదల తేదీ ప్రకటించారు.
నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు..
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. జనవరి 14 2026న సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.
విజయ్ దళపతి జన నాయగన్..
ఇకపోతే వచ్చే యేడాది సంక్రాంతికి తెలుగు హీరోలు మాత్రమే కాకుండా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి కూడా తన చివరి సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. 'జననాయకుడు' అనే టైటిల్ తో తెలుగులో కూడా సినిమాను విడుదల చేయబోతున్నారు. మరి ఈ ఐదు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ అందుకుంటాయో చూడాలి.
