చేదు నిజాలు: జ్యోతిష్యుని జోస్యం -విషాదకర అంతం!
సహజ నటనతో, వైవిధ్యమైన పాత్రలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు సంజీవ్ కుమార్ జీవితం ఎప్పటికీ విషాద గాథగానే మిగిలిపోయింది.
By: Srikanth Kontham | 30 July 2026 1:03 PM ISTసహజ నటనతో, వైవిధ్యమైన పాత్రలతో సుస్థిర స్థానం సంపాదించుకున్న లెజెండరీ నటుడు సంజీవ్ కుమార్ జీవితం ఎప్పటికీ విషాద గాథగానే మిగిలిపోయింది. వయసుతో సంబంధం లేకుండా వృద్ధ పాత్రల్లో సైతం లీనమై నటించి మెప్పించిన ఆయన నిజ జీవితంలో మాత్రం త్వరగానే కన్నుమూశారు. 47 ఏళ్ల వయసులోనే హార్ట్ ఎటాక్‌తో మరణించడం అప్పట్లో పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. సంజీవ్ ఆకస్మిక మరణం వెనుక ఉన్న కొన్ని ఆసక్తికర విషయాలు .. అంతిమ క్షణాలు .. జీవిత అలవాట్ల గురించి ప్రముఖ నటుడు సచిన్ పిలగాంకర్ ఇటీవలి కాలంలో పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
సంజీవ్ కుమార్ కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే ఆయన జీవితం గురించి ఓ భయానక జోస్యం ప్రచారంలో ఉండేది. ఓ ప్రముఖ హస్తసాముద్రిక నిపుణుడు సంజీవ్ కుమార్‌ను కలిసిప్పుడు ఆయన ఎక్కువ కాలం బతకరని, ముసలితనాన్ని చూడకుండానే చిన్న వయసులోనే మరణిస్తారని జోస్యం చెప్పారట. ఈ విషయాన్ని దివంగత నటి తబుస్సుమ్‌తో పాటు పలువురు సన్నిహితులు గతంలో పంచుకున్నారు. ఆ భయమేమో కానీ సంజీవ్ కుమార్ తన కెరీర్‌లో యవ్వనంలోనే ముసలి పాత్రలు (షోలే, మౌసమ్, త్రిశూల్ వంటి చిత్రాల్లో) వేయడానికి ఆసక్తి చూపేవారని, తెరపై అయినా ఆ వయసును అనుభవించాలనే కోరికతోనే అలాంటి పాత్రలను ఎంచుకున్నారని చెబుతుంటారు.
అయితే వ్యక్తిగత జీవితంలో సంజీవ్ అలవాట్లు మాత్రం ఆరోగ్యానికి తీవ్రంగా నష్టం చేకూర్చాయని సహచర నటులు వెల్లడిస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడితో పాటు రాత్రి వేళల్లో అధికంగా మద్యం సేవించడం, ఆలస్యంగా భోజనాలు చేయడం వంటి చెడు అలవాట్లు ఆరోగ్యాన్ని క్రమంగా క్షీణింపజేసాయని అంటారు. కుటుంబ సభ్యుల ఇళ్లలో నాన్-వెజ్ వంటకాలు తినడానికి నిబంధనలు ఉండటంతో ప్రత్యేకంగా ఒక అపార్ట్‌మెంట్ తీసుకుని మిత్రులతో కలిసి రాత్రి పూట పార్టీలు చేసుకునేవారని సచిన్ పిలగాంకర్ గుర్తు చేసుకున్నారు. ఈ అనారోగ్యకరమైన జీవన శైలినే ఆయన అకస్మిక గుండెపోటుకు దారితీసిందని చెబుతుంటారు.
ఘటన జరిగిన రోజు ఉదయం తనను కలవమని సంజీవ్ కుమార్ కోరినప్పటికీ పనుల వల్ల మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్లేసరికి సంజీవ్ ప్రాణాలు కోల్పోయి ఉన్నారు. అప్పటికే సంజీవ్ గదిలో అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన సచిన్ వెంటనే వైద్యులను పిలిపించినప్పటికీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. రాత్రి ఆలస్యంగా ఇంటికి రావడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపించినా ఆయన విశ్రాంతి తీసుకోకుండా పని చేయడం విషాదాన్ని మరింత పెంచింది.
ఎంతో మందికి నటనలో పాఠాలు నేర్పిన గొప్ప నటుడు ఆరోగ్యం విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకో లేకపోవడం అభిమానులను ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. జ్యోతిష్యుడు చెప్పిన జోస్యం నిజమైందో లేక ఆయన అనారోగ్యకరమైన జీవన శైలి బలి తీసుకుందో కానీ లెజెండరీ నటుడి అంతం మాత్రం అత్యంత దయనీయంగా ముగిసింది. చిత్ర పరిశ్రమలో అగ్రగామిగా వెలుగొందిన ఒక నటుడు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం భారతీయ సినిమాకు తీరని లోటు.
