Begin typing your search above and press return to search.

ప‌దే ప‌దే రీషూట్లతో క్రేజీ సినిమాని కిల్ చేసిన డైరెక్ట‌ర్?

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం `లవ్ అండ్ వార్` గురించి ప్రస్తుతం ఫిలిం స‌ర్కిల్స్ లో ఒక షాకింగ్ వార్త హల్‌చల్ చేస్తోంది.

By:  Sivaji Kontham   |   12 March 2026 7:00 AM IST
ప‌దే ప‌దే రీషూట్లతో క్రేజీ సినిమాని కిల్ చేసిన డైరెక్ట‌ర్?
X

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం `లవ్ అండ్ వార్` గురించి ప్రస్తుతం ఫిలిం స‌ర్కిల్స్ లో ఒక షాకింగ్ వార్త హల్‌చల్ చేస్తోంది. భారీ తారాగణం, అంతకు మించిన బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు రీషూట్ల కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతోంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కేవలం కొన్ని కీలక సన్నివేశాలను సరిదిద్దడానికి.. తిరిగి చిత్రీకరించడానికే ఏకంగా 100 కోట్ల రూపాయల అదనపు బడ్జెట్ ఖర్చవుతోందని వస్తున్న వార్తలు ఇండస్ట్రీని విస్మయానికి గురిచేస్తున్నాయి.

ఈ పరిణామాలకు ప్రధాన కారణం దర్శకుడు భన్సాలీలోని `హై పర్ఫెక్షనిజం` అని విశ్లేషకులు భావిస్తున్నారు. భన్సాలీ అంటేనే ప్రతి ఫ్రేమ్‌ను ఒక అద్భుతంలా తీర్చిదిద్దే క‌ళాత్మ‌క‌ దర్శకుడు. అయితే `లవ్ అండ్ వార్` విషయంలో కొన్ని ముఖ్యమైన సీన్లు ఆయన ఆశించిన స్థాయిలో రాకపోవడంతో రాజీ పడకుండా పదే పదే రీషూట్లు చేస్తున్నారట. దర్శకుడి ఈ అతి జాగ్రత్తే ఇప్పుడు సినిమా పాలిట శాపంగా మారిందని.. సినిమా రిలీజ్ డిలే చేస్తూ ఒక రకంగా `కిల్` చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

రీషూట్ల కారణంగా ఈ సినిమా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యం కావడం అదనపు పనులు పెరగడంతో విడుదల తేదీ విషయంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. జాతీయ మీడియాల‌ కథనాల ప్రకారం.. సినిమా విడుదల నిరవధికంగా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు కూడా ఇప్పటివరకు కొత్త విడుదల తేదీపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో అటు అభిమానుల్లో, ఇటు ట్రేడ్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.

ముగ్గురు అగ్ర తారలు రణబీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా పరిస్థితి ఇలా అవ్వడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒకవైపు భారీ క్రేజ్ ఉన్న హీరోలు, మరోవైపు టాప్ హీరోయిన్ ఉన్నా కానీ.. కేవలం మేకింగ్ విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల ప్రాజెక్ట్ గాడి తప్పినట్లు కనిపిస్తోంది. భన్సాలీ మార్క్ గ్రాండియారిటీ కోసం చేస్తున్న ప్రయత్నం కాస్తా ఇప్పుడు బడ్జెట్ భారంతో స‌మ‌స్య‌గా మారింద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

భన్సాలీ కెరీర్‌లోనే `లవ్ అండ్ వార్` అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవనుంది. కేవలం కథా పరంగానే కాకుండా.. ఇందులో ఉండే గ్రాండ్ ఏరియల్ యాక్షన్ సన్నివేశాలు.. భారీత‌నం నిండిన‌ విజువల్ ఎఫెక్ట్స్ (VFX) సినిమా స్థాయిని పెంచనున్నాయి. ఈ విజువల్స్ పర్ఫెక్ట్‌గా రావడం కోసమే దర్శకుడు రీషూట్లపై మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ గ్రాండియారిటీ ఐడియా సినిమాకు ప్లస్ అవుతుందా లేక పెరిగిన బడ్జెట్ భారంగా మారుతుందా అనేది వేచి చూడాలి.

మొత్తానికి `లవ్ అండ్ వార్` చుట్టూ ఈ పరిణామాలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. వందల కోట్ల బడ్జెట్, ఏళ్ల తరబడి శ్రమ.. వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాయో తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ రీషూట్లు తో ఆలస్యం సినిమాపై నెగెటివ్ ప్రభావాన్ని చూపేలా ఉన్నాయి. పర్ఫెక్షన్ కోసం చేసే పోరాటం చివరకు విజయాన్ని అందిస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి.