స్టార్ డైరెక్టర్ పై చీటింగ్ కేసు.. అలా మోసం చేశారని ఫిర్యాదు!
లవ్ అండ్ వార్ మూవీకి తనను లైన్ ప్రొడ్యూసర్ గా నియమించుకున్నట్లు రాజ్ మాథుర్ ఫిర్యాదులో పొందుపరిచారు. తన వద్ద అధికారిక ఒప్పందం లేదని, మెయిల్ ద్వారా ఉందని తెలిపారు.
By: M Prashanth | 3 Sept 2025 5:59 PM ISTప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా భన్సాలీ వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదవ్వగా.. చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. భన్సాలీ అప్ కమింగ్ మూవీ లవ్ అండ్ వార్ కు గాను లైన్ ప్రొడ్యూసర్ గా నియమించుకున్నారని, డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని ఫిర్యాదు అందింది.
అంతేకాదు దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఫిర్యాదులో ఉంది. దీంతో రాజస్థాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బికనీర్ జిల్లా బిచ్వాల్ పోలీస్ స్టేషన్ లో భన్సాలీపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జోధ్ పూర్ కు చెందిన రాధా ఫిల్మ్స్ సీఈఓ ప్రతీక్ రాజ్ మాథుర్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
లవ్ అండ్ వార్ మూవీకి తనను లైన్ ప్రొడ్యూసర్ గా నియమించుకున్నట్లు రాజ్ మాథుర్ ఫిర్యాదులో పొందుపరిచారు. తన వద్ద అధికారిక ఒప్పందం లేదని, మెయిల్ ద్వారా ఉందని తెలిపారు. గవర్నమెంట్ పర్మిషన్లు, భద్రతా ఏర్పాట్లు వంటి కీలకమైన పనులు లవ్ అండ్ వార్ సినిమాకు సంబంధించి తానే మొత్తం చూసుకున్నట్లు ఆయన తెలిపారు.
ఆ తర్వాత తనను తొలగించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఇవ్వాల్సిన పారితోషికం చెల్లించలేదని అన్నారు. అదే సమయంలో తనతో దురుసుగా ప్రవర్తించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బికనీర్ లోని ఓ హోటల్ లో భన్సాలీ, ఆయన ప్రొడక్షన్ మేనేజర్లు ఉత్కర్ష్ బాలి, అర్వింద్ గిల్ తనను తీవ్ర పదజాలంతో దూషించారని ప్రతీక్ మాథుర్ ఆరోపించారు.
అంతేకాదు.. భవిష్యత్తులో తన కంపెనీకి ఎలాంటి అవకాశాలు రాకుండా అడ్డుకుంటామని బెదిరించారని ఆయన తెలిపారు. నమ్మకద్రోహం, చీటింగ్ కింద ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే మాథుర్ పై అన్ని పక్షాల వాదనలు పరిశీలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
కాగా.. లవ్ అండ్ వార్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల బికనీర్ లోని జునాగఢ్ కోట వంటి ప్రదేశాల్లో షూటింగ్ ను నిర్వహించారు మేకర్స్. డిసెంబర్ లో సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇంతలో సంజయ్ లీలా భన్సాలీపై కేసు నమోదైంది. చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.
