Begin typing your search above and press return to search.

30వేల కోట్ల ఆస్తి కొట్టేయ‌డానికి ప్రియా క‌పూర్ ప్లాన్?

సోనా గ్రూప్ వ్యవస్థాపకుడు సురీందర్ కపూర్ భార్యగా, ఆ కంపెనీల్లో మెజారిటీ వాటా తనకే చెందుతుందని రాణి కపూర్ వాదిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   22 Jan 2026 7:00 AM IST
30వేల కోట్ల ఆస్తి కొట్టేయ‌డానికి ప్రియా క‌పూర్ ప్లాన్?
X

న‌టుడు, పారిశ్రామిక వేత్త‌ సంజయ్ కపూర్ ఆక‌స్మిక‌ మరణంతో దాదాపు 30,000 కోట్ల ఆస్తి వివాదం మరింత ముదిరింది. సంజయ్ కపూర్ తల్లి 80 ఏళ్ల రాణి కపూర్, తన కోడలు ప్రియా స‌చ్ దేవ్ కపూర్‌పై ఢిల్లీ హైకోర్టులో తాజా సివిల్ సూట్ దాఖలు చేశారు. ఈ వివాదం ఆరంభ స‌మ‌యంలోనే రాణీ క‌పూర్ కోడ‌లిపై తీవ్ర‌మైన ఫిర్యాదులు చేసారు. ఆస్తిలో త‌న వాటా త‌న‌కు ఇవ్వ‌కుండా రోడ్డుకు గెంటేసింద‌ని ప్రియా క‌పూర్ పై రాణీ ఆరోపించారు.

ఈ వివాదానికి సంబంధించిన‌ పూర్తి వివరాల్లోకి వెళితే... రాణి కపూర్ తన పిటిషన్‌లో `రాణి కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్` (RK ఫ్యామిలీ ట్రస్ట్) ను ఒక మోసపూరితమైన‌ద‌ని ఆరోపించారు. ఈ ట్రస్ట్ డాక్యుమెంట్లపై ఉన్న తన సంతకాలు ఫోర్జరీ చేసార‌ని ఆమె ఆరోపించారు. తన అనుమతి లేకుండా తనకున్న ఆస్తులన్నింటినీ ఈ ట్రస్ట్‌లోకి అక్రమంగా మళ్లించారని పేర్కొన్నారు. 2017లో తనకు స్ట్రోక్ వచ్చినప్పుడు, తాను శారీరకంగా, మానసిక బలహీనంగా ఉన్న సమయంలో ప్రియా కపూర్ -సంజయ్ కపూర్ తనను మోసం చేసి ఈ పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని ఆమె ఆరోపించారు. దీంతో 30వేల కోట్ల ఆస్తి వివాదం మ‌రింత ముదిరింది.

సోనా గ్రూప్ వ్యవస్థాపకుడు సురీందర్ కపూర్ భార్యగా, ఆ కంపెనీల్లో మెజారిటీ వాటా తనకే చెందుతుందని రాణి కపూర్ వాదిస్తున్నారు. సంజయ్ కపూర్ మరణించిన 13 రోజుల సంతాప దినాల్లోనే, ప్రియా కపూర్ కంపెనీ డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ పదవులను హడావిడిగా దక్కించుకున్నారని ఆమె ఆరోపించారు. తన ఇమెయిల్ హ్యాక్ అయ్యిందని అబద్ధం చెప్పి, కంపెనీ సమాచారం తనకు అందకుండా ప్రియా కపూర్ అడ్డుకున్నారని రాణి కపూర్ పేర్కొన్నారు.

ఈ కేసులో రాణి కపూర్ తన కోడలు ప్రియాతో పాటు మరో 23 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఇందులో కరిష్మా కపూర్ పిల్లలు (సమైరా, కియాన్) కూడా ఉన్నారు. సంజయ్ కపూర్ రాసినట్లుగా చెబుతున్న ఒక `విల్లు` కూడా ఫేక్ అని రాణి కపూర్ వాదిస్తున్నారు. ఆ విల్లు ప్రకారం ఆస్తులన్నీ ప్రియా కపూర్‌కే చెందుతాయి. ఇది తనను నిరుపేదను చేసే కుట్ర అని రాణీ క‌పూర్ ఆందోళ‌న చెందుతున్నారు.

ఢిల్లీ హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి, ఆస్తుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. ఒకవైపు కరిష్మా కపూర్ పిల్లలు తమ తండ్రి ఆస్తిలో వాటా కోరుతుండగా, మరోవైపు సంజయ్ కపూర్ సోదరి మందిరా కపూర్ కూడా ప్రియా కపూర్‌పై విమర్శలు చేస్తున్నారు. దీనికి ప్రతిగా ప్రియా కపూర్ మందిరపై పరువు నష్టం దావా వేశారు.

అంతిమంగా ఈ అక్రమ ట్రస్ట్‌ను రద్దు చేసి, తన భర్త సురీందర్ కపూర్ తనకు సంక్రమింపజేసిన ఆస్తులను తిరిగి తనకు అప్పగించాలని రాణీక‌పూర్ కోర్టును కోరుతున్నారు. సంజ‌య్ క‌పూర్ బాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాత‌, న‌టుడు. వ్యాపార రంగంలో దిగ్గ‌జం. అత‌డికి మూడు పెళ్లిళ్లు. ప్ర‌స్తుతం మూడో భార్య ప్రియా స‌చ్ దేవ్ తో సాహ‌చ‌ర్యంలో ఉన్న స‌మ‌యంలోనే లండ‌న్ లో పోలో ఆడుతూ ఊహించ‌ని దుస్థితి కార‌ణంగా మ‌ర‌ణించాడు. ఊపిరితిత్తుల్లోకి ఈగ దూరిన త‌ర్వాత శ్వాస ఆడ‌ని స్థితిలో అత‌డు గుండెపోటుతో మ‌ర‌ణించార‌ని వైద్యులు ధృవీక‌రించారు.