కరిష్మా కపూర్ వారసులకు వేల కోట్ల ఆస్తులు ఛాన్సుందా?
ఈ కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండో భార్య కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్ కపూర్ మళ్ళీ వివాహం చేసుకున్నాడు.
By: Sivaji Kontham | 11 Sept 2025 2:05 PM ISTబ్రిటన్ లో పోలో ఆడుతూ మరణించిన బిజినెస్ మేన్ సంజయ్ కపూర్ ఆస్తుల గురించి కుటుంబ వాటా దారులు కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుత భార్య ప్రియా సచ్ దేవ్ కపూర్ వీలునామాను దాచి పెట్టి ఉంచారని అతడి రెండవ భార్య కరిష్మా, ఆమె ఇద్దరు పిల్లలు ఆరోపిస్తున్నారు. తండ్రి నుంచి తన పిల్లలకు చెందాల్సిన ఐదో వంతు వాటా ఇవ్వాల్సిందేనని దిల్లీ హైకోర్టులో పోరాడుతున్నారు కరిష్మా.
సంజయ్ కపూర్ కి చెందిన దాదాపు 30,000 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన ఈ వివాదం అంతకంతకు ముదురుతోంది. తాజా కథనాల ప్రకారం.. కరిష్మా తన పిల్లలకు పెద్ద వాటా కోరుతున్నారు. కానీ ప్రియా కపూర్ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కోర్టు విచారణలో కరిష్మా పిల్లలకు పెద్ద వాటా దక్కుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని న్యాయబృందం పేర్కొన్నట్టు కథనాలొస్తున్నాయి. ఇరువైపులా వాదోపవాదాలను పరిశీలించిన తర్వాత కరిష్మా పిల్లలకు తండ్రి నుంచి దఖలు పడిన దాదాపు రూ.14 కోట్ల విలువైన బాండ్లను పొందవచ్చని తెలుస్తోంది. అయితే ఆర్కే ట్రస్ట్ నుంచి దాదాపు 1900కోట్లు కరిష్మా పిల్లలకు అందిందని ప్రియా కపూర్ వివరణ ఇవ్వడం కూడా హెడ్ లైన్స్ లోకొచ్చింది.
ఈ కేసు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండో భార్య కరిష్మాకు విడాకులు ఇచ్చిన తర్వాత సంజయ్ కపూర్ మళ్ళీ వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం మూడో భార్య ప్రియా సచ్ దేవ్ తో ఉండగానే అతడు మరణించాడు. అందువల్ల ప్రియా మొత్తం ఆస్తిని తన పరం చేసుకుంటోందని అతడి రెండో భార్య, తల్లి కూడా ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్ తనకు కొడుకు ఆస్తి నుంచి ఎటువంటి వాటా అందలేదని, తనను రోడ్డుకు ఈడ్చారని పిటిషన్ వేయడంతో దీనిపైనా కోర్టులో ఏకకాలంలో విచారిస్తున్నారు.
అయితే తాజా వివాదంలో కరీనా కపూర్ కోరుకున్నట్టు 30,000 కోట్ల ఆస్తుల నుంచి ఐదో వంతు వాటా దక్కేందుకు అవకాశం లేదని న్యాయవర్గాలు పేర్కొన్నట్టు గుసగుస వినిపిస్తోంది. కోర్టుకు ఇంకా ప్రియా కపూర్ వీలునామా గురించి, స్థిర చరాస్తుల గురించి వివరాల్ని అందించలేదు. తదుపరి విచారణ అక్టోబర్ 9న జరగనుంది. అలాగే సంజయ్ కపూర్ ఎలాంటి విల్లును రాయలేదని కూడా కోర్టు పేర్కొన్నట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతానికి ఈ కేసు ఇంకా గజిబిజీగా ఉంది. దాని పూర్తి విచారణ తర్వాతే ఎవరికి ఎంత వాటా వెళుతుంది? అసలు కరిష్మా వారసులకు సంజయ్ నుంచి రావాల్సినది ఉందా లేదా? అతడి తల్లికి చెందాల్సిన వాటా ఎంత? అన్నది తేల్తుంది. కపూర్ కుటుంబానికి చెందిన ఆర్కే ట్రస్ట్ వేల కోట్ల సామ్రాజ్యంలో ఆస్తుల వివాదం రచ్చకెక్కడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
