కార్మికుల పొట్ట కొట్టొద్దు: రణ్‌వీర్‌పై నిషేధాన్ని తీవ్రంగా తప్పుపట్టిన ప్రముఖ దర్శకుడు!
సినీ పరిశ్రమలో ఇటువంటి నాన్-కోఆపరేషన్ లేదా పరోక్ష నిషేధాల సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతుండటంపైనా సంజయ్ గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
By: Sivaji Kontham | 27 May 2026 8:45 AM ISTభారతీయ చలనచిత్ర పరిశ్రమలో నటీనటులు, నిర్మాతల మధ్య తలెత్తే వివాదాలు చివరకు సామాన్య కార్మికుల ఉపాధిని దెబ్బతీసేలా మారడంపై ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. `డాన్ 3` చిత్ర వివాదానికి సంబంధించి నటుడు రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్.డబ్ల్యూ.ఐ.సి.ఇ) విధించిన నాన్-కోఆపరేషన్ (సహాయ నిరాకరణ) ఆదేశాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ రకమైన నిషేధాలు చిత్ర పరిశ్రమపై ఆధారపడి బతికే వేలాది మంది రోజువారీ కూలీల, కార్మికుల పొట్ట కొట్టడమేనంటూ ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా సినీ సంఘాల తీరును ఎండగట్టారు.
సంజయ్ గుప్తా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందిస్తూ... ఎఫ్‌డబ్ల్యూఐసీఈ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత దురదృష్టకరమని అభివర్ణించారు. ఒక పెద్ద సినిమా ఆగిపోతే లేదా ఆలస్యమైతే నష్టపోయేది కేవలం సదరు స్టార్ హీరో మాత్రమే కాదని.. ఆ ప్రాజెక్ట్ నమ్ముకుని జీవనం సాగించే లైట్ బాయ్స్, సెట్ వర్కర్లు, జూనియర్ ఆర్టిస్టులు, స్పాట్ బాయ్స్ వంటి కిందిస్థాయి సిబ్బంది అని ఆయన గుర్తుచేశారు. ఒక నటుడి ప్రవర్తన నచ్చకపోతే చట్టపరంగా లేదా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇలా ఏకపక్షంగా సహాయ నిరాకరణ ప్రకటించి మొత్తం సినిమాను ఇరకాటంలో పెట్టడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.
సినీ పరిశ్రమలో ఇటువంటి నాన్-కోఆపరేషన్ లేదా పరోక్ష నిషేధాల సంస్కృతి రోజురోజుకూ పెరిగిపోతుండటంపైనా సంజయ్ గుప్తా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతలు కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులను ప్లాన్ చేస్తారని.. ఇలాంటి తరుణంలో ఫిల్మ్ బాడీలు జారీ చేసే ఇటువంటి ఆదేశాల వల్ల షూటింగ్‌లు నిలిచిపోయి ప్రొడక్షన్ హౌస్‌లు భారీగా నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమను రక్షించాల్సిన సంఘాలే ఇలా కార్మికుల జీవనోపాధిని ప్రమాదంలోకి నెట్టడం విచారకరమని.. ఈ విధమైన ధోరణి వల్ల బాలీవుడ్ వ్యాపార వాతావరణం దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
రణ్‌వీర్ సింగ్, ఫరాన్ అక్తర్ ల మధ్య `డాన్ 3` సినిమాకు సంబంధించిన ఒప్పందాల ఉల్లంఘనల నేపథ్యంలోనే ఎఫ్‌డబ్ల్యూఐసీఈ ఈ వివాదంలోకి జోక్యం చేసుకుంది. అయితే సంజయ్ గుప్తా వాదన ప్రకారం.. ఇలాంటి వృత్తిపరమైన విభేదాలను పరిష్కరించడానికి అసోసియేషన్లు ఒక మధ్యవర్తిగా వ్యవహరించాలి. అంతేకాకుండా.. ఇరు వర్గాలను కూర్చోబెట్టి సామరస్యపూర్వకంగా సమస్యను ముగించే ప్రయత్నం చేయాలి. అంతేకానీ నేరుగా షూటింగ్‌లను అడ్డుకునేలా లేదా నటులతో సహకరించవద్దని ఆదేశాలు ఇవ్వడం వల్ల చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ తప్పుతుందని.. ఇది భవిష్యత్తులో మరిన్ని సంక్షోభాలకు దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు.
గుప్తా వ్యాఖ్యలు రకరకాల సందేహాలను లేవనెత్తాయి. స్టార్ల ఇగోలు లేదా సంఘాల ఆధిపత్య పోరులో సామాన్య సినీ కార్మికుడు బలిపశువు కాకూడదనే ఆయన ఆవేదనను పలువురు నిర్మాతలు కూడా సమర్థిస్తున్నారు. చట్టపరమైన పరిమితులను గౌరవిస్తూ.. ఎవరి జీవన ఉపాధికి భంగం కలగకుండా వివాదాలను పరిష్కరించుకోవడమే పరిశ్రమ మనుగడకు శ్రేయస్కరమని ఈ ఘటన ఇండస్ట్రీకి ఒక బలమైన సందేశాన్ని ఇచ్చింది. ఇకనైనా సినీ సంఘాలు తమ పంథాను మార్చుకుంటాయో లేదో చూడాలి.
