Begin typing your search above and press return to search.
టాప్ ప్లేస్ లో సంజయ్.. ఇది మామూలు రికార్డు కాదేమో!
భారతీయ సినీ చరిత్రలో ఒకప్పుడు రూ.100 కోట్ల క్లబ్ చేరడం అంటే గొప్ప విజయంగా భావించేవారు.
By: M Prashanth | 10 April 2026 2:00 PM ISTభారతీయ సినీ చరిత్రలో ఒకప్పుడు రూ.100 కోట్ల క్లబ్ చేరడం అంటే గొప్ప విజయంగా భావించేవారు. అమీర్ ఖాన్ నటించిన గజినితో ట్రెండ్ మొదలై చాలా కాలం కొనసాగింది. అయితే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోయాయి. రూ.1000 కోట్ల క్లబ్ అనే మైల్ స్టోన్ ఏర్పడి, ప్రపంచానికి ఇండియన్ సినిమాల స్థాయి చాటి చెప్పింది.
ప్రస్తుతం ఆ రూ.1000 కోట్ల క్లబ్ లో పలు సినిమాలు చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ క్లబ్ లో అత్యధిక సార్లు భాగమైన నటుడు ఎవరో తెలుసా? సీనియర్ యాక్టర్ సంజయ్ దత్. హీరోగా మాత్రమే కాకుండా విలన్, సహాయ పాత్రలు, గెస్ట్ రోల్స్ తో ఆయన సాధించిన ఆ ఘనత విశేషంగా నిలిచింది.
ఇటీవల విడుదలైన భారీ సినిమాల్లో సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్: చాప్టర్ 2 సినిమాలో అధీర పాత్రతో ఆయన మొదటిసారి రూ.1000 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు. ఆ రోల్ లో ఆయన యాక్టింగ్ విపరీతంగా ఆకట్టుకుంది. లంగ్ క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలో కూడా డబ్బింగ్ పూర్తి చేయడం ఆయన డెడికేషన్ ను చూపించింది.
తర్వాత షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించినప్పటికీ, సంజయ్ దత్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గుర్తింపు పొందారు. కొద్దిసేపు మాత్రమే కనిపించినా.. కథలో మంచి ప్రభావం చూపించారు. ఇక రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో వచ్చిన ధురంధర్ సిరీస్ సినిమాలు సంజయ్ దత్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచాయి.
ఆ రెండు భాగాల్లోనూ ఆయన అస్లాం చౌదరి అనే ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆయన యాక్టింగ్ సినిమాల విజయానికి ప్రధాన బలంగా మారింది. ఆ రెండు సినిమాలు కూడా రూ.1000 కోట్ల మార్క్ ను దాటడంతో, సంజయ్ దత్ నాలుగు సార్లు ఆ క్లబ్ లో చోటు సంపాదించారు.
ఈ నేపథ్యంలో సంజయ్ దత్ సాధించిన ఘనత ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం రూ.1000 కోట్ల క్లబ్ లో ఉన్న సినిమాల్లో దాదాపు 40 శాతం చిత్రాల్లో ఆయన భాగమవడం విశేషం. హీరోలు కాకుండా ఒక నటుడు ఈ రేంజ్ లో ప్రభావం చూపడం అరుదైన విషయం. ఇక ఆ జాబితాలో దీపికా పదుకొణె మూడు సినిమాలతో రెండో స్థానంలో నిలిచారు. అలాగే ప్రభాస్, షారుక్ ఖాన్, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోలు కూడా రెండేసి రూ.1000 కోట్ల సినిమాలతో కొనసాగుతున్నారు. సంజయ్ కూడా వారి సరసన ఉండగా.. ధురంధర్ సిరీస్ చిత్రాలతో టాప్ ప్లేస్ సంపాదించుకున్నారు.
