జైలులోనే సీక్వెల్ ఆలోచనతో రగిలిపోయిన సీనియర్ !
బాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలలో `ఖల్ నాయక్`ది ప్రత్యేక స్థానం. ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలు బాలీవుడ్ కి కొత్తేం కాదు. ఎన్నో మాఫియా చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసాయి.
By: Srikanth Kontham | 25 April 2026 7:49 PM ISTబాలీవుడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలలో `ఖల్ నాయక్`ది ప్రత్యేక స్థానం. ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలు బాలీవుడ్ కి కొత్తేం కాదు. ఎన్నో మాఫియా చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. కానీ `ఖల్ నాయక్` మాత్రం ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ గానే నిలిచింది. మూడు దశాబ్దాల క్రితం సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అదే క్లాసిక్ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ రాబోతోందని సంజయ్ దత్ ప్రకటించడంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా సందడి మొదలైంది. ఈ సీక్వెల్ గురించిన వార్త కేవలం ప్రకటనకే పరిమితం కాలేదు.
దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? ఈ సీక్వెల్ ఐడియా సంజయ్ దత్‌కు జైలులో ఉన్నప్పుడు వచ్చిందట. జీవితంలోని అత్యంత కఠినమైన కాలంలో జైలు గదుల మధ్య గడుపుతోన్న సమయంలో బల్లూ పాత్రను మళ్ళీ వెండి తెరపైకి ఎలా తీసుకురావాలనే ఆలోచన కలిగింది. ఆ ఏకాంతంలో పుట్టిన ఆలోచనలకు ఇప్పుడు కథా రూపం దాల్చిందని తెలిపారు. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలవబోతోందని సంజూ బాబా ఎంతో ఉద్వేగంతో వెల్లడించారు.
ఒరిజినల్ `ఖల్ నాయక్` లో బల్లూ పాత్రలో సంజయ్ దత్ నటన, స్టైల్ ఆ కాలంలో ఒక ట్రెండ్ సెట్టర్. `నాయక్ నహీ ఖల్ నాయక్ హూ మై` అంటూ ఆయన చెప్పిన డైలాగులు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. సీక్వెల్‌లో కూడా అదే పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో మరింత పరిణతి చెందిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన కనిపించబోతున్నారు. వయసు పెరిగినా ఆ కళ్లలోని ఇంటెన్సిటీ ఏమాత్రం తగ్గలేదని ఈ చిత్రంతో మరోసారి విశ్వరూపం చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.
ఒరిజినల్ డైరెక్టర్ సుభాష్ ఘాయ్‌తో కలిసి సంజయ్ దత్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు చర్చలు జరుపుతు న్నారు. కథకు సంబంధించిన ప్రాథమిక చర్చలు ముగిసాయి. త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుత తరం ప్రేక్షకులకు నచ్చేలా భారీ స్థాయిలో యాక్షన్ ఎలిమెంట్స్ , ఎమోషన్స్‌ను ఈ సీక్వెల్ లో జోడించబోతున్నారు. ప్రస్తుతం సంజయ్ దత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో బిజీగా ఉన్నారు. సౌత్ సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పిస్తూనే మరోవైపు సొంత సినిమాలను ప్లాన్ చేసు కుంటున్నారు. `ఖల్ నాయక్` సీక్వెల్ అనేది ఒక సినిమా మాత్రమే కాదు. అది ఆయన వ్యక్తిగత జీవితానికి , సినీ ప్రస్థానానికి ఒక నిదర్శనం. జైలులో తాను అనుభవించిన వేదనను, అక్కడి నుండి నేర్చుకున్న పాఠాలను కూడా కథలో అంతర్లీనంగా చూపించే అవకాశం లేపోలేదు. ఎందుకంటే ఇది జైలు గదుల నుంచి పుట్టిన కథ కాబట్టి ఛాన్స్ ఉంది.
