జైలు జీవితం చాలా పాఠాలు నేర్పిందన్న స్టార్ హీరో
తాను చేయని తప్పుకు ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్.
By: Sivaji Kontham | 4 Dec 2025 4:00 AM ISTతాను చేయని తప్పుకు ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించానని ఆవేదన వ్యక్తం చేసారు బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్. తాను తప్పు చేసినట్టు నిరూపించలేకపోయారని, ఈ కేసు విచారణకు కోర్టులకు 25 ఏళ్లు ఎందుకు పట్టిందో ఇప్పటికీ తనకు అర్థం కాలేదని అన్నారు. ఈ జైలు జీవితం తనను బాధ పెట్టలేదని, తన తల్లిదండ్రులను కోల్పోయినందుకు చాలా బాధ పడ్డానని తెలిపాడు దత్.
సంజూ జీవితంలో అత్యంత క్లిష్టమైన దశ ఇది. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నాడనే అరోపణలపై పోలీసులు సంజయ్ దత్ పై టాడా కేసును బుక్ చేసారు. అల్లర్ల సమయంలో దత్ కుటుంబానికి బెదిరింపులు ఎదురయ్యాయని, దాంతో అతడు ఆయుధాలను సమకూర్చుకున్నాడని కూడా కథనాలొచ్చాయి. అయితే ఈ కేసులో తన తండ్రిని, సోదరీమణులను బెదిరిస్తున్నారని పోలీసులు చెప్పారని, తన దగ్గర తుపాకీ ఉందని వాదించినా కానీ దేనినీ నిరూపించలేకపోయారని సంజయ్ దత్ అన్నారు. అసలు ఈ కేసును విచారించడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టిందో ఇప్పటికీ అర్థం కాలేదని అన్నారు.
జైలు జీవితాన్ని చాలా గౌరవంగా నిర్వహించానని, జైలులో ఉన్నప్పుడే చాలా పాఠాలు నేర్చుకున్నానని కూడా దత్ తెలిపారు. ``ఆధ్యాత్మికంగా ఉన్నాను. చట్టాలకు సంబంధించిన చాలా పుస్తకాలను చదివాను. మత గ్రంథాలు చదవడం, ధ్యానం చేయడం, చట్టాన్ని అధ్యయనం చేయడంలోనే ఎక్కువ సమయం గడిపా``నని దత్ అన్నారు. కేసును వేగవంతం చేయాలని కోర్టును పదే పదే అభ్యర్థించానని సంజూ చెప్పారు. చాలా మంది తప్పు చేయకుండా జైలులో మగ్గేవారిని చూసాను. అందువల్ల నా కేసును త్వరగా క్లోజ్ చేయమని అభ్యర్థించానని సంజయ్ దత్ తెలిపారు.
అసలు జైలు జీవితం ఎలా గడిచింది? అనే ప్రశ్నకు కపిల్ శర్మ షోలో సంజయ్ దత్ ఇలా చెప్పారు. నేను అక్కడ జీతం సంపాదించాను... తర్వాత రేడియో YCP అనే రేడియో స్టేషన్‌ను కూడా ప్రారంభించాను! ఈ షో కోసం స్క్రిప్ట్‌లు రాయడానికి ఇతర ఖైదీలు సహాయం చేశారని కూడా దత్ వెల్లడించారు. జైలు లోపల ఒక చిన్న థియేటర్ ఆర్టిస్టుల గ్రూపును కూడా ఏర్పాటు చేశానని తెలిపారు. నేను దర్శకుడిని అయితే నా నటులు అంతా హత్య చేసిన దోషులు! అని అన్నారు.
నిజానికి సంజయ్ దత్ ఐదేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపాడు. తన శిక్షాకాలం పూర్తయిన తర్వాత 2016లో విడుదలయ్యాడు. దత్ రియల్ లైఫ్ ఎలా సాగిందో చెబుతూ రాజ్‌కుమార్ హిరాణీ `సంజూ` అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించాడు.
