ప్రశాంతత లేదు అంటూ దేశాన్ని తూలనాడాడా? స్టార్ హీరో ఉద్ధేశం?
భారతదేశంలో ప్రశాంతత కరువైందా? ప్రజలు మనుపటిలా హాయిగా జీవించడం లేదా? అంటే అవుననే అర్థం వచ్చేలా ప్రముఖ హిందీ హీరో చేసిన కామెంట్ ఇప్పుడు యావత్ దేశంలో చర్చనీయాంశమైంది.
By: Sivaji Kontham | 4 Oct 2026 9:00 PM ISTభారతదేశంలో ప్రశాంతత కరువైందా? ప్రజలు మనుపటిలా హాయిగా జీవించడం లేదా? అంటే అవుననే అర్థం వచ్చేలా ప్రముఖ హిందీ హీరో చేసిన కామెంట్ ఇప్పుడు యావత్ దేశంలో చర్చనీయాంశమైంది. ఆయన విదేశాలకు వెళ్లిన ప్రధానిని టార్గెట్ చేసారంటూ ఇప్పుడు మీడియాలు అల్లుతున్న కథనాలు వేడెక్కిస్తున్నాయి.
బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ నిర్వహిస్తున్న `శేఖర్ టునైట్` టాక్ షోలో పాల్గొన్న ఆయన దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో భారతదేశంలో తాను అనుభవించిన మానసిక ప్రశాంతత ఇప్పుడు కనిపించడం లేదని.. మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఆ నిశ్చింతను కోల్పోయినట్లు ఆయన పేర్కొన్నారు. ఒక సీనియర్ నటుడిగా దేశంపై ఆయన వ్యక్తపరిచిన ఈ అభిప్రాయాలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
అదే సమయంలో దేశ ప్రజల గొప్పదనాన్ని, వారి విశాల హృదయాన్ని సంజయ్ దత్ ప్రత్యేకంగా ప్రశంసించారు. భారత ప్రజలు ఎంతో దయార్ద్ర హృదయులని..ఎవరినైనా ఎంతో ఆప్యాయంగా ఆదరించే గొప్ప ఆతిథ్య సంస్కృతి మన సొంతమని కొనియాడారు. సమాజంలో గతంలో వెల్లివిరిసిన పరస్పర సామరస్యం, ఆనాటి ప్రశాంత వాతావరణం మళ్లీ తిరిగి రావాలని తాను శివజీని ప్రార్థిస్తున్నట్లు ఆయన భావోద్వేగంగా వెల్లడించారు.
గాంధీ జయంతి ప్రత్యేక కార్యక్రమంగా ప్రసారమైన ఈ షోలో సంజయ్ దత్ తన మోస్ట్ పాపులర్ స్క్రీన్ క్యారెక్టర్ `మున్నాభాయ్` రూపంలో కనిపించి అలరించారు. శేఖర్ సుమన్ కోరిక మేరకు ఐదు నిమిషాల పాటు భారతదేశానికి ప్రధాని అయితే దేశాన్ని ఎలా ఉద్దేశిస్తారో ఆయన సరదాగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా తాను విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి విదేశాలకు వెళ్లకుండా దేశంలోనే ప్రజల మధ్య ఉంటానని.. లేకపోతే ప్రజలకు, ప్రధానికి మధ్య అనుబంధం ఎలా ఏర్పడుతుందని వ్యాఖ్యానించారు.
సంజయ్ దత్ మున్నాభాయ్ గెటప్‌లో చెప్పిన ఈ డైలాగ్‌లను పలు మీడియా సంస్థలు దేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలను ఉద్దేశించి చేసిన వ్యంగ్యాస్త్రాలుగా విశ్లేషించాయి. మున్నాభాయ్ మేనరిజంలో మాట్లాడుతూనే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను `ట్రంప్ మాము` అంటూ సంబోధించి.ఆయన టారిఫ్‌లపై స్పందిస్తూ అమెరికాకు గాంధీగిరి నేర్పించడానికి వెళ్తానని సరదాగా జోకులు పేల్చారు. హింసను వీడి ప్రేమతోనే శాంతి సాధ్యమవుతుందని మున్నాభాయ్ స్టైల్‌లో ఆయన సందేశం ఇచ్చారు.
ఈ షోలో సంజయ్ దత్ ఇలా కనిపించడం ద్వారా ఎంతో కాలంగా నలుగుతున్న `మున్నాభాయ్ 3` సినిమా రాకపై అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. 2016లోనే సీక్వెల్ ప్రకటన వచ్చినా పట్టాలెక్కని ఈ ప్రాజెక్ట్‌పై ఈ తాజా అప్పియరెన్స్ ద్వారా మరోసారి చర్చ మొదలైంది. ప్రస్తుతం సంజయ్ దత్ `ఖల్ నాయక్ రిటర్న్స్` వంటి క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా సంజూ భాయ్ ప్రశాంతత గురించి చేసిన వ్యాఖ్యలు -పొలిటికల్ సెటైర్లు మాత్రం ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
