Begin typing your search above and press return to search.

అంతా స్క్రిప్టెడ్ .. త‌ప్పుగా అర్థం చేసుకున్నారు: మున్నాభాయ్ వివ‌ర‌ణ‌

పెద్ద‌ తెరపై రఫ్‌ అండ్‌ టఫ్‌ పాత్రలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సంజయ్ దత్ (సజ్జూ బాబా) మాస్‌ ఇమేజ్ ఎప్పుడూ ప్రత్యేకమే.

By:  Sivaji Kontham   |   6 Oct 2026 9:42 PM IST
అంతా స్క్రిప్టెడ్ .. త‌ప్పుగా అర్థం చేసుకున్నారు: మున్నాభాయ్ వివ‌ర‌ణ‌
X

పెద్ద‌ తెరపై రఫ్‌ అండ్‌ టఫ్‌ పాత్రలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసే సంజయ్ దత్ (సజ్జూ బాబా) మాస్‌ ఇమేజ్ ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే తెరవెనుక వ్యక్తిగత జీవితం, వివాదాలు, జైలు ప్రయాణం వంటి మలుపులు ఎన్నోసార్లు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. తాజాగా గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు, యాంకర్ శేఖర్ సుమన్ హోస్ట్ చేసిన `శేఖర్ టునైట్` టాక్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి సెలబ్రిటీల రాజకీయ, సామాజిక స్పృహపై పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ఒక పబ్లిక్ వేదిక‌పై దేశంలోని ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ.. తనకు ఇప్పుడు దేశంలో ఆనాటి ప్రశాంతత కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేయడం మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

ఈ షోలో సంజయ్ దత్ కేవలం దేశ శాంతిభద్రతల గురించే కాకుండా తన కల్ట్ క్లాసిక్ `మున్నాభాయ్` పాత్రను రాజకీయ వ్యంగ్యానికి అస్త్రంగా మలచడం విశేషం. మహాత్మా గాంధీ బోధించిన పాపుల‌ర్ మూడు కోతుల సిద్ధాంతాన్ని (చెడు చూడకు, వినకు, మాట్లాడకు) ప్రస్తావిస్తూనే నేటి సమాజంలో తప్పు జరుగుతుంటే దాన్ని ప్రశ్నించి సరిదిద్దేందుకు ఒక `నాలుగో కోతి` కూడా తప్పనిసరిగా కావాలనే కోణంలో ఆయన మాట్లాడారు. ఐదు నిమిషాలు దేశ ప్రధానిగా అవకాశం వస్తే తాను చేపట్టే సంస్కరణలంటూ అత‌డు చెప్పిన తీరు రాజకీయంగా లోతైన అంతరార్థాలను వెతికేందుకు దారి తీసింది. వ్యవస్థలోని లోపాలను, పౌరుల బాధ్యతలను ఒక సినిమా హీరో తనదైన శైలిలో ప్రశ్నించిన తీరు సాధారణ ప్రజలను సైతం ఆలోచింపజేసేలా చేసింది.

అయితే సెలబ్రిటీలు ఇలాంటి సున్నితమైన అంశాలపై ఓపెన్‌గా మాట్లాడినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే రియాక్షన్లు ఎలా ఉంటాయో ఈ ఉదంతం మరోసారి నిరూపించింది. ఆయన మాటలను కొందరు సామాజిక బాధ్యతగా స్వాగతిస్తే.. మరికొందరు విమర్శనాస్త్రాలు సంధించారు. సందర్భానుసారం కాకుండా ఆయన వ్యాఖ్యలను వక్రీకరించి వైరల్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఏ ఒక్కరి మనోభావాలను గాయపరిచే ఉద్దేశం తనకు లేదని... దేశంపై తనకు ఉన్న మమకారంతోనే ఆ మాటలన్నానని సంజయ్ దత్ గ్రహించి వెంటనే దానిపై క్లియ‌ర్ క‌ట్ గా వివ‌ర‌ణ ఇచ్చారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా.. అలాగే ఒక ప్రత్యేక వీడియో ప్రకటన ద్వారా ఆయన వరుసగా రెండుసార్లు స్పష్టతనివ్వడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ వివాదం తాలూకు వేడి చల్లారకముందే ముంబై విమానాశ్రయంలో సంజయ్ దత్ నల్లటి దుస్తుల్లో కనిపించిన దృశ్యాలు నెట్టింట రచ్చకెక్కాయి. సెలబ్రిటీల సాధారణ ఎయిర్‌పోర్ట్ లుక్స్ మామూలే అయినా కానీ.. ప్రస్తుత కాంట్రవర్సీ నేపథ్యంలో ఆ వీడియో సోషల్ మీడియాలో అత్యధికంగా ట్రెండ్ కావడం గమనార్హం. వివాదాలు చుట్టుముట్టిన ప్రతిసారీ సంజయ్ దత్ తనదైన మేన‌రిజంతో వాటిని ఎదుర్కొనే తీరు అభిమానులను ఆకర్షిస్తుంటుంది. ఈసారి కూడా ఆయన ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్లిన తీరు మీడియా కంట పడిన వైనం నెటిజన్లలో రకరకాల ఊహాగానాలకు తెరతీసింది.

మొత్తానికి, `శేఖర్ టునైట్` వేదికగా సంజయ్ దత్ వేసిన ఒక చిన్న మాటల విత్తనం దేశవ్యాప్తంగా పెద్ద చర్చా వేదికను సృష్టించిందని చెప్పవచ్చు. తెరపై సంజీవనిలా నవ్వులు పంచే మున్నాభాయ్.. రియల్ లైఫ్‌లో మాత్రం సమాజంలోని లోపాలను నిలదీసే ఒక సామాజిక గళంగా మారడానికి ప్రయత్నించడం హర్షణీయమే అయినా ప్రస్తుత డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ప్రతీ మాట ఎలా వక్రీకరించబడుతుందో ఈ ఉదంతం హెచ్చరికలా నిలిచింది. ఏదేమైనా, వివాదాలు, వివరణలు, ఎయిర్‌పోర్ట్ వైరల్ వీడియోల సుడిగుండంలో సంజయ్ దత్ మరోసారి సోషల్ మీడియా ట్రెండ్స్‌లో హాట్ టాపిక్‌గా నిలవడం ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించింది.

దుర‌ద‌శృష్ట వ‌శాత్తూ త‌ప్పుగా అర్థం చేసుకున్నార‌ట‌:

శేఖర్ సుమన్ టాక్ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పందిస్తూ తాజాగా ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఎవరి మనోభావాలను, ఏ వర్గాన్ని లేదా సంస్థను కించపరిచే ఉద్దేశం తనకెప్పుడూ లేదని స్పష్టం చేసిన ఆయన ఆ షోలో తాను మాట్లాడిన మాటలు కేవలం సరదాగా, హాస్యభరితంగా ఉద్దేశించిన స్క్రిప్టెడ్ సంభాషణలో భాగమని వివరించారు. `మున్నాభాయ్` సినిమాల్లోని `గాంధీగిరి` స్ఫూర్తితో ప్రేమ, ఆప్యాయత, ఐక్యతను చాటేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని కానీ దురదృష్టవశాత్తు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తాను కనుక ప్రధానమంత్రి అయితే విదేశాల్లో ఎక్కువ కాలం గడపనని.. దేశంలో సోదరభావాన్ని పెంపొందిస్తానని.. తన ఫొటోలకు బదులుగా ప్రతీచోటా మహాత్మా గాంధీ చిత్రాలనే ఉంచుతానని ఆ షోలో మున్నాభాయ్ శైలిలో తాను చెప్పిన విషయాలను దత్ మరోసారి గుర్తుచేశారు.