4నెలలు డిప్రెషన్‌లో.. 45రోజులు గదిలోనే.. 20 ఏజ్‌లో సానియా మిర్జా భయానక అనుభవం!
ప్రతి ఒక్కరి కెరీర్- లైఫ్ జర్నీలో అనేక మలుపులు ఉంటాయి. అలాంటి ఓ రెండు మలుపులు టెన్నిస్ స్టార్ సానియా జీవితంలోను ఉన్నాయి.
By: Sivaji Kontham | 20 Jan 2026 10:00 AM ISTప్రతి ఒక్కరి కెరీర్- లైఫ్ జర్నీలో అనేక మలుపులు ఉంటాయి. అలాంటి ఓ రెండు మలుపులు టెన్నిస్ స్టార్ సానియా జీవితంలోను ఉన్నాయి. ఇటీవల తన భర్త నుంచి విడాకులు తీసుకోవడం ఒక పెద్ద మలుపుగా భావిస్తే, అంతకుముందు సానియా మీర్జా తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన సమయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా 2008లో ఆట స్థలంలో గాయం తనను తీవ్రంగా మానసిక కుంగుబాటులోకి (డిప్రెషన్) లోకి తీసుకెళ్లందని చెప్పారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సానియా మీర్జా మణికట్టుకు తీవ్రమైన గాయమైంది. కేవలం 20 ఏళ్ల వయసులో తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆ గాయం మానసికంగా గందరగోళానికి దారి తీసింది. ఆ గాయం ఎంత దారుణంగా ఉందంటే..? కనీసం తల దువ్వుకోవడానికి, ఫోన్ ఎత్తడానికి కూడా వీలు లేని స్థితి. ఆ బాధాకరమైన పరిస్థితిలో ఒలింపిక్స్ నుండి మధ్యలోనే తప్పుకోవాల్సి రావడం మరింత తీవ్రంగా కలిచివేసింది.
గాయం అయిన తర్వాత సుమారు 3 నుండి 4 నెలల పాటు డిప్రెషన్‌లో ఉన్నట్లు సానియా తెలిపారు. సుమారు నెలన్నర రోజుల పాటు తన గది నుండి బయటకు రాలేదు. కనీసం భోజనం చేయడానికి కూడా బయటకు రావడానికి ఇష్టపడేవారు కాదని తెలిపారు. ఏ కారణం లేకుండానే ఏడుపు వచ్చేది.. అంతా బాగుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా కన్నీళ్లు ఆగేవి కాదు! అని టెన్నిస్ క్వీన్ సానియా తన అనుభవాన్ని వివరించారు. ఆ వయసులో తన కుటుంబానికి, దేశానికి అన్యాయం చేశాననే భావన సానియాను మరింత కుంగదీసింది.
ఈ కష్టకాలం నుండి బయటపడటానికి తన కుటుంబం ఎంతో అండగా నిలిచింది. మానసిక ఆరోగ్యం కోసం సరైన చికిత్స తీసుకోవడం వల్ల సానియా తిరిగి కోలుకుంది. ఆ ఇబ్బంది తర్వాత సింగిల్స్ కంటే డబుల్స్‌పై దృష్టి సారించి 6 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలిచి ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్నారు సానియా.
``క్రీడాకారులు రోబోలు కాదు.. వారు కూడా మనుషులే. మనసు బాలేనప్పుడు ఆ విషయం గురించి మాట్లాడటంలో తప్పు లేదు`` అని సానియా యువ క్రీడాకారులకు ధైర్యం చెప్పారు. ఇటీవల జెమీమా రోడ్రిగ్స్ (క్రికెటర్) కూడా తన మానసిక ఆందోళన గురించి మాట్లాడటాన్ని సానియా అభినందించారు. సానియా మీర్జా తన ఆత్మకథ `ఏస్ ఎగైనిస్ట్ ఆడ్స్`లో ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలను రివీల్ చేసారు.
