సోషల్ మీడియా ఫాలోవర్స్ డిసైడ్ చేస్తున్నారు.. నటి ఆవేదన!
ఈరోజుల్లో నటనా ప్రతిభ కంటే గొప్ప కొలమానం ఏదైనా ఉందా? అంటే అది కచ్ఛితంగా ``సోషల్ మీడియా ఫాలోయింగ్`` అని విశ్లేషిస్తున్నారు.
By: Sivaji Kontham | 28 Oct 2025 9:07 AM ISTఈరోజుల్లో నటనా ప్రతిభ కంటే గొప్ప కొలమానం ఏదైనా ఉందా? అంటే అది కచ్ఛితంగా ``సోషల్ మీడియా ఫాలోయింగ్`` అని విశ్లేషిస్తున్నారు. ఒకరు నటించాల్సిన పని లేదు.. సోషల్ మీడియాల్లో సోసోగా నటిస్తే చాలు.. అక్కడ ఫాలోవర్స్ ని పెంచుకోగలిగితే అది అవకాశాల్ని మరింత మెరుగుపరుస్తుంది.
ఇది ఊహించని కొత్త పరిణామం. ఈ పరిణామంతో అసలు కళతో సంబంధం లేని ఎందరో కళాకారులు అవుతున్నారు. నిజానికి ఇవి ఒకప్పటి రోజులు కావు.. భానుప్రియ, శ్రీదేవిలా కళ్లతోనే కోటి భావాలు పలికించనక్కర్లేదు.. ఇప్పుడు కేవలం సోషల్ మీడియాల్లో విప్పుకుని తిరిగితే చాలు... అందాల ఆరబోతతో ఫాలోవర్లను పెంచుకోవచ్చు అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి వారికే ఇప్పుడు వినోద పరిశ్రమలో అవకాశాలు పెరుగుతున్నాయనే ఆవేదన కొందరు రియల్ టైమ్ కళాకారుల్లో వ్యక్తమవుతోంది.
ప్రతిభావంతురాలైన నటి సంధ్య మృదుల్ ఇందుకు అతీతం కాదు. వినోద పరిశ్రమలో సోషల్ మీడియా ఉనికికి పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి సంధ్య తాజా ఇంటర్వ్యూలో మాట్లాడారు. తనకు ఆన్‌లైన్‌లో తక్కువ మంది ఫాలోవర్లు ఉండటం వల్ల అవకాశాలు రావడం లేదని సంధ్య తన నిరాశను వ్యక్తం చేశారు.
ఇదో తరహా కొత్త పరిస్థితి. ఫాలోవర్లు లేకపోతే పని రానట్టేనా? అని సంధ్య ప్రశ్నించారు. నాకు పని ఇవ్వకపోతే నేను ఎలా ఫేమస్ అవుతాను? నేను ఫేమస్ కాకపోతే మరింత ఫేమస్ ఎలా అవుతాను? నాకు ఫాలోవర్లు లేకపోతే, నేను ఎలా ఫేమస్ అవుతాను ? నేను అడుగుతున్నది మీకు అర్థమైందా? ఇది సరియైనదా? అని తన ఆవేదనను వ్యక్తం చేసింది.
సంధ్య పరిస్థితి మాత్రమే కాదు.. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా లేని చాలా మంది ప్రతిభావంతుల పరిస్థితి ఇదే. సంధ్య ఒక ఉదాహరణ మాత్రమే. ఇది చాలా అన్యాయమని పలువురు నెటిజనులు సంధ్యకు మద్ధతుగా నిలిచారు.
``చాలా మంది ప్రతిభావంతులైనా కానీ ఇది విచారకరమైన వాస్తవం.. ఇప్పుడు ప్రతిభ గురించి ఎవరూ పట్టించుకోరు!! మీ నైపుణ్యాన్ని పూర్తిగా ప్రేమిస్తున్నాను`` అని ఒక అభిమాని అన్నారు. ``ఇది ఎంత విచారకరం ....ప్రేక్షకులు ఈ సమయంలో కళాకారులను విఫలమయ్యేలా చేసారు!`` అని మరొకరు అన్నారు. ఇందులో చాలా నిజం ఉన్నా ఇదొక్కటే మార్గం! అని ఒకరు వ్యాఖ్యానించారు.
సంధ్య నటనా కెరీర్ ని పరిశీలిస్తే.. ఈ భామ సినిమాలకు మారడానికి ముందు 1990లలో `స్వాభిమాన్`తో బుల్లితెర నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. సాథియా (2002), పేజీ 3 (2005), హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లోని పాత్రలకు ప్రశంసలు అందుకుంది. లిమిటెడ్ (2007), యాంగ్రీ ఇండియన్ గాడెసెస్ (2015) షోలతోను ఆకట్టుకుంది. చివరిగా 2023 వెబ్ సిరీస్ `తాజ్: డివైడెడ్ బై బ్లడ్`లో కనిపించింది. దీనిలో ఆమె క్వీన్ జోధా బాయి పాత్రను పోషించింది.
