దిల్ దియా: బట్టలు లేకుండా హీరో.. క్రాంతి మాధవ్ బోల్డ్ అటెంప్ట్
ఈ పోస్టర్ లో బట్టలు లేకుండా సోఫాలో కూర్చున్న హీరో చైతన్య రావు దీనంగా సినిమా చూస్తున్నట్లు అనిపిస్తోంది. తెలుగు సినిమా పోస్టర్లపై ఇలాంటి బోల్డ్ నెస్ చాలా అరుదు.
By: M Prashanth | 3 Jan 2026 1:12 PM IST'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' లాంటి క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు క్రాంతి మాధవ్, 'వరల్డ్ ఫేమస్ లవర్' తర్వాత చాలా కాలం పాటు సైలెంట్ అయ్యారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, ఆయన తదుపరి సినిమా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇన్నాళ్లకు ఎవరూ ఊహించని విధంగా 'దిల్ దియా' అనే టైటిల్ తో, ఒక షాకింగ్ ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ పోస్టర్ లో బట్టలు లేకుండా సోఫాలో కూర్చున్న హీరో చైతన్య రావు దీనంగా సినిమా చూస్తున్నట్లు అనిపిస్తోంది. తెలుగు సినిమా పోస్టర్లపై ఇలాంటి బోల్డ్ నెస్ చాలా అరుదు. 'A Naked Truth' (ఒక నగ్న సత్యం) అనే క్యాప్షన్ కు న్యాయం చేస్తూ, పాత్ర మానసిక స్థితిని, తెగింపును ఈ లుక్ ద్వారా సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది.
అయితే ఈ పోస్టర్ లో చాలామంది గమనించని, కానీ సినిమా లవర్స్ కు వెంటనే కనెక్ట్ అయ్యే మరో ఆసక్తికరమైన అంశం బ్యాక్ గ్రౌండ్ లో ఉంది. హీరో వెనుక ఉన్న ప్రొజెక్టర్ స్క్రీన్ మీద ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు మార్టిన్ స్కోర్సెస్ కు సంబంధించిన వైరల్ మీమ్ "Absolute Cinema" కనిపిస్తోంది. సాధారణంగా సోషల్ మీడియాలో ఏదైనా అద్భుతమైన సినిమాను పొగడడానికి వాడే ఈ మీమ్ ను, డైరెక్టర్ ఏకంగా తన సినిమా పోస్టర్ లోనే వాడారంటే ఆయన కాన్ఫిడెన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాను తీయబోయేది ఒక మామూలు సినిమా కాదని, ఇదొక స్వచ్ఛమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అని క్రాంతి మాధవ్ చెప్తున్నారు. ఈ పోస్టర్ ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా రిలీజ్ చేయించి.. సందీప్ వంగా సినిమాల్లో ఉండే రా ఎమోషన్స్, బోల్డ్ కంటెంట్ ఈ సినిమాలో కూడా పుష్కలంగా ఉంటాయని దీని ద్వారా హింట్ ఇచ్చినట్లయింది. ప్రేమ, సాన్నిహిత్యం, వైఫల్యం, ఆత్మగౌరవం లాంటి అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
క్రాంతి మాధవ్ గత చిత్రాలను గమనిస్తే, ఆయనలో మంచి సెన్సిబిలిటీస్ ఉన్నాయి. అయితే ఈసారి ఆయన రూట్ మార్చి, బాక్సాఫీస్ గ్రామర్ ని మార్చేస్తాను అని స్టేట్మెంట్ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒకపక్క శర్వానంద్ తో క్లాస్ సినిమా తీసిన ఆయనే, ఇప్పుడు ఇంత బోల్డ్ కంటెంట్ తో వస్తున్నారంటే, ఈ గ్యాప్ లో ఆయన కథనం మీద ఎంత గట్టిగా కసరత్తు చేశారో ఊహించవచ్చు. 2026 సమ్మర్ లో రాబోతున్న ఈ సినిమా, కేవలం పోస్టర్ తోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. చూస్తుంటే 'దిల్ దియా' ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ కాదని, ఏదో బలమైన ఇంపాక్ట్ ఇచ్చే కల్ట్ సినిమా అవుతుందనిపిస్తోంది. మరి క్రాంతి మాధవ్ ఈ 'నేకెడ్ ట్రూత్' తో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.
