Begin typing your search above and press return to search.

ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా ఢోకా లేదంటున్న వంగా.. స్పిరిట్ పై ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి?

టాలీవుడ్‌లో భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   26 Aug 2026 3:06 PM IST
ఎన్ని పెద్ద సినిమాలొచ్చినా ఢోకా లేదంటున్న వంగా.. స్పిరిట్ పై ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి?
X

టాలీవుడ్‌లో భారీ సినిమాల రిలీజ్ డేట్స్ ఎప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఒక స్టార్ హీరో సినిమా తర్వాత కొద్ది వారాల వ్యవధిలో మరో భారీ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తే, థియేటర్ల విషయంలోనే కాదు, బాక్సాఫీస్ పరంగా కూడా ఆ పోటీ ఎలా ఉంటుందన్న డిస్క‌ష‌న్ మొదలవుతుంది. ఇప్పుడు 2027లో రానున్న ప్రభాస్ స్పిరిట్, మహేష్ బాబు- ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వార‌ణాసి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ రెండు సినిమాల మధ్య ఉన్న గ్యాప్‌పై డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ ఇంట్రెస్టింగ్ గా మారాయి.

రీసెంట్ గా మీడియా ముందుకొచ్చిన సందీప్ రెడ్డి వంగాను.. స్పిరిట్, వార‌ణాసి సినిమాల మధ్య దాదాపు 37 రోజుల గ్యాప్ సరిపోతుందా అని మీడియా వ‌ర్గాలు ప్రశ్నించాయి. దీనికి ఆయన ఎలాంటి సందేహం లేకుండా 37 రోజుల గ్యాప్ సరిపోతుందని స్పష్టం చేశారు. అంతేకాదు, వార‌ణాసి సినిమా స్పిరిట్ కంటే పెద్దదని కూడా స్వయంగా వ్యాఖ్యానించారు. ఈ ఒక్క మాట ఇప్పుడు రెండు సినిమాల రిలీజ్‌పై జరుగుతున్న డిస్క‌ష‌న్‌కు మరో కోణాన్ని జోడించింది.

సాధారణంగా భారీ స్టార్ సినిమాలు దగ్గరగా రిలీజ‌వుతున్న‌ప్పుడు.. ఒక సినిమా మరో సినిమాకు నష్టం కలిగించే అవకాశం ఉందా, రిలీజ్ డేట్ మార్చుకోవాల్సిన అవసరం వస్తుందా అనే ప్రశ్నలు వినిపిస్తుంటాయి. కానీ వంగా రియాక్ష‌న్ లో మాత్రం అలాంటి ఆందోళన కనిపించలేదు. 37 రోజులు అంటే నెలకు పైగా టైమ్ ఉండ‌టంతో, స్పిరిట్ తన థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని వార‌ణాసికు మార్గం సుగమం చేసేంత టైమ్ ఉంటుందనే నమ్మకంతో ఉన్నట్టుగా ఆయన మాటలు సూచిస్తున్నాయి.

ఇక పదేపదే ఇదే ప్రశ్న రావడంతో వంగా సరదాగా స్పందిస్తూ.. మీరు స్పిరిట్ వాయిదా వేసి వారణాసికి దారి ఇవ్వాలని కోరుకుంటున్నట్టుందని చమత్కరించారు. దీంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా సరదాగా మారిపోయింది. అయితే వంగా చెప్పిన స‌మాధానం వెనుక కూడా స్పిరిట్ విష‌యంలో త‌న‌కున్న కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు వార‌ణాసి సినిమా మ‌రింత పెద్ద మూవీ అని అంగీక‌రిస్తూనే, మరోవైపు తన సినిమాకు 37 రోజుల గ్యాప్ చాలంటూ వంగా చెప్పడం ఆసక్తికరంగా మారింది. అంటే వంగా చెప్పిన ఆ టైమ్ లోపు స్పిరిట్ లాంగ్ ర‌న్ లో భారీ క‌లెక్ష‌న్లు అందుకుంటుంద‌నే కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది. దీంతో 2027లో మార్చి నుంచి ఏప్రిల్ వరకు కొనసాగే ఈ భారీ సినిమా సీజన్‌లో స్పిరిట్ ఎలాంటి ప్రభావం చూపనుందనే డిస్క‌ష‌న్ ఇప్పటి నుంచే మొదలైంది.