సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా
తన సినిమాల్లోని హింసపై గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్న వంగా, ఈసారి మాత్రం నిజజీవిత ఘటనను తన సినిమాతో లింక్ చేయడంపై ఘాటుగా స్పందించారు.
By: M Prashanth | 4 Nov 2026 2:42 PM ISTఏదైనా పెద్ద నేరం జరిగినప్పుడు దానికి సినిమాల ప్రభావమే కారణమంటూ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. ఇటీవల ఏపీలోని రాప్తాడు పాఠశాలలో ఓ విద్యార్థినిపై జరిగిన దాడి ఘటనను కొందరు 'యానిమల్' సినిమాతో ముడిపెడుతూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను విమర్శించారు. తన సినిమాల్లోని హింసపై గతంలోనూ విమర్శలు ఎదుర్కొన్న వంగా, ఈసారి మాత్రం నిజజీవిత ఘటనను తన సినిమాతో లింక్ చేయడంపై ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా సినీ పరిశ్రమలోని కొందరిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ మరింత కాంట్రవర్సీగా మారాయి.
ఇక 'యానిమల్' సినిమాలో రణబీర్ కపూర్ తుపాకీతో స్కూల్లోకి వెళ్లే సన్నివేశం ఉంది. రాప్తాడు ఘటన తర్వాత కొందరు ఆ సీన్‌ను ప్రస్తావించారు. అయితే ఒక దారుణమైన నేరం జరిగినప్పుడు ముందుగా బాధితులు, వారి కుటుంబాల గురించి ఆలోచించాలని వంగా అన్నారు. అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పారు. అదంతా వదిలేసి సినిమాను సులభంగా బలిపశువును చేయడం కరెక్ట్ కాదన్నారు. కొందరికి బాధితులపై సానుభూతి కంటే తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడమే ముఖ్యంగా మారిందంటూ మండిపడ్డారు.
ముఖ్యంగా ఇండస్ట్రీలోని కొందరు నటీనటులు, దర్శకులు, నిర్మాతలను వంగా గట్టిగానే టార్గెట్ చేశారు. అవకాశాలు లేక నిరాశలో ఉన్నవాళ్లు ఇతరుల పనిని విమర్శించే అవకాశం రాగానే సామాజిక సంస్కర్తలుగా మారిపోతున్నారని అన్నారు. ఒకరి సినిమాపై తమకున్న కోపాన్ని బయటపెట్టడానికి ఇంతటి విషాదాన్ని ఉపయోగించుకోవడం దారుణమని విమర్శించారు.
నిజానికి 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాల విషయంలో వంగా మొదటి నుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హీరోల ప్రవర్తన, హింసాత్మక సన్నివేశాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వాటికి వంగా కూడా గతంలో తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. కానీ ఈసారి వ్యవహారం వేరు. సినిమాల్లో చూపించిన సన్నివేశాలను విమర్శించడం కాకుండా, బయట జరిగిన ఓ నేరానికి ఆయన చిత్రాన్ని కారణంగా చూపించే ప్రయత్నం జరగడమే ఈ వివాదానికి దారితీసింది.
మరోవైపు వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. 'యానిమల్' తర్వాత వంగా చేస్తున్న సినిమా కావడంతో ఇందులో యాక్షన్, వయొలెన్స్ ఎలా ఉంటాయనే ఆసక్తి కూడా ఉంది. గత సినిమాల విషయంలో వచ్చిన విమర్శల నేపథ్యంలో 'స్పిరిట్'లో ఆయన ఎలాంటి కథను చూపించబోతున్నారనేది చూడాలి.
