'వారణాసి' 1000 కోట్లు కాదు అంతకుమించి.. రాజమౌళిపై సందీప్ వంగా రెస్పెక్ట్!
భారతీయ చిత్రసీమలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సాధించిన విజయాలు... ఆయన స్థాయి ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
By: Sivaji Kontham | 25 Aug 2026 11:04 PM ISTభారతీయ చిత్రసీమలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సాధించిన విజయాలు... ఆయన స్థాయి ఎంతటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దర్శకధీరుడిని ఆదర్శంగా తీసుకుంటూనే.. బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న మరో సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాజమౌళి తెరకెక్కిస్తున్న `వారణాసి` సినిమాపై.. అలాగే తన తదుపరి భారీ చిత్రం `స్పిరిట్` విడుదల వ్యవధిపై సందీప్ వంగా చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రాజమౌళిపై ఆయన చూపించిన గౌరవ భావానికి సినీ ప్రియులు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.
సందీప్ రెడ్డి వంగా - ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న `స్పిరిట్` సినిమా విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే (మార్చి నుండి ఏప్రిల్ సమయంలో) ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న`వారణాసి` చిత్రం కూడా విడుదల కాబోతోందనే విషయాన్ని తాజా మీడియా సమావేశంలో విలేఖరి ప్రస్తావించారు. ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కంటే ఎక్కువ వసూళ్లు సాధించే సామర్థ్యం (బిగ్ పాకెట్) ఉన్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లేనని పరిశ్రమ భావిస్తోంది. ఈ క్రమంలో రెండు పెద్ద సినిమాల మధ్య కేవలం నెల లేదా 37 రోజుల వ్యవధి మాత్రమే ఉండటం బాక్సాఫీస్ కలెక్షన్లకు సరిపోతుందా? అని ప్రశ్నించారు.
విలేఖరి అడిగిన ఈ ప్రశ్నకు సందీప్ వంగా స్పందిస్తూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ``37 రోజుల సమయం (గ్యాప్) అనేది బాక్సాఫీస్ రన్‌కు చాలా ఎక్కువ సమయం...రెండు పెద్ద సినిమాల మధ్య ఈ 37 రోజుల వ్యవధి సరిపోతుంది. రెండు సినిమాలు ఖచ్చితంగా బాగా ఆడుతాయి! అని ఎంతో ధీమా వ్యక్తం చేశారు. థియేట్రికల్ రన్‌కు ఈ వ్యవధి ఏమాత్రం ఆటంకం కాదని... ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారని సందీప్ వంగా స్పష్టం చేశారు.
అంతేకాకుండా, `వారణాసి` చిత్రం 1000 కోట్ల వసూళ్లను దాటి అంతకుమించి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకాన్ని సందీప్ వెల్లడించారు. ఒకవేళ `స్పిరిట్`.. `వారణాసి` సినిమాల మధ్య ఈ 37 రోజుల గ్యాప్ సరిపోదు అని భావిస్తే.. రాజమౌళి సినిమాకు పూర్తి స్థాయిలో బాక్సాఫీస్ స్పేస్ ఇవ్వడానికి తమ సినిమా విడుదలను మరింత జరపడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాజమౌళిపై తనకు ఉన్న అపారమైన గౌరవాన్ని ఇండియా ట్రెండింగ్ డైరెక్టర్ సందీప్ వంగా ఈ విధంగా చాటుకున్నారు.
సందీప్ రెడ్డి వంగా చూపించిన ఈ సంస్కారం... సీనియర్ దర్శకుడిపై ఉన్న రెస్పెక్ట్ చూసి సినీ పరిశ్రమతో పాటు అభిమానులు సైతం ఫిదా అవుతున్నారు. బిజినెస్ లో పోటీ.. బాక్సాఫీస్ యుద్ధాలు ఉండే ఈ రోజుల్లో ఒకరి సినిమాకు మరొకరు గౌరవం ఇస్తూ.. పరిశ్రమ హితాన్ని కోరే సందీప్ వంగా ఆలోచనా ధోరణిని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద `స్పిరిట్`, `వారణాసి` రెండు చిత్రాలు కూడా సంచలన విజయాలు సాధించాలని ప్రేక్షకులు ఆకాంక్షిస్తున్నారు. సందీప్ వంగా స్వయంగా నిర్మించిన `రోమాంచకం` ట్రైలర్ ఈవెంట్ లో క్యూ అండ్ ఏ సెషన్ లో ఈ ఆసక్తికర విషయాలను ముచ్చటించారు.
