ఇంట్రెస్టింగ్ సందీప్ వంగా కళ్లు విక్రమ్ వైపా?
ప్రస్తుతం భారతీయ చిత్రసీమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: Srikanth Kontham | 7 Sept 2026 10:00 AM ISTప్రస్తుతం భారతీయ చిత్రసీమలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. `అర్జున్ రెడ్డి`, `కబీర్ సింగ్`, `యానిమల్` వంటి సంచలన విజయాల తర్వాత బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్ హీరోలందరూ సందీప్ తో సినిమాలు చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అందరూ సందీప్ వంగా కాల్‌షీట్ల కోసం వేచి చూస్తుంటే? ఆయన చూపు మాత్రం తమిళ విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ వైపు మళ్లిందనే వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న `స్పిరిట్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ పవర్ ఫుల్ కాప్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్నంటు తున్నాయి. ఈ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్నా? సందీప్ తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించి విలక్షణ ఆలోచనలతో ముందుకు సాగుతున్నారని.. అందులో భాగమే విక్రమ్‌తో సినిమా ఆలోచన అని తెలుస్తోంది.
విక్రమ్ నటన, పాత్రల కోసం పడే కష్టం, మేకోవర్ విషయంలో చూపించే డెడికేషన్ పట్ల సందీప్ వంగాకు ఎంతో గౌరవం ఉందని ఆయన సన్నిహితులు ఎప్పుడూ చెబుతుంటారు. కథలో ఇంటెన్సిటీని, గ్రే షేడ్స్ ఉన్న రోల్స్‌ను విక్రమ్‌లాంటి నటుడు స్క్రీన్ పైకి తెస్తే ఆ మేజిక్ వేరే లెవెల్‌లో ఉంటుందని సందీప్ భావిస్తున్నారట. గతంలో `అర్జున్ రెడ్డి` తమిళ రీమేక్ (ఆదిత్య వర్మ) ద్వారా విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్‌తో కూడా సందీప్ టీమ్‌కు మంచి అనుబంధం ఏర్పడింది.
హీరో క్యారెక్టరైజేషన్‌ను ఇంటెన్స్‌గా, రా అండ్ రస్టిక్ కోణంలో డిజైన్ చేయడం సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకత. `సేతు`, `అపరిచితుడు`, `పితామగన్` వంటి చిత్రాలతో నటనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పిన విక్రమ్‌కు అలాంటి పవర్‌ఫుల్ రోల్స్ కొత్తేమీ కాదు. ఎలాంటి పాత్రకైనా వన్నె తేగల గ్రేట్ యాక్టర్ అతడు. ఈ నేపథ్యంలో సందీప్ -విక్మ్ చేతులు కలిపితే అది సంచలనమే అవుతుంది. ఇద్దరి మేకింగ్ అండ్ యాక్టింగ్ స్టైల్స్ సింక్ అయితే వెండితెరపై మరో ఐకానిక్ క్యారెక్టర్ ఆవిష్కృతమవ్వడం ఖాయం.
అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడే పట్టాలెక్కదు. ప్రస్తుతం `స్పిరిట్` షూటింగ్‌ను వేగవంతంగా పూర్తి చేయడంలో సందీప్ నిమగ్నమై ఉన్నారు. అటుపై రణ్‌బీర్ కపూర్‌తో `యానిమల్ పార్క్` కూడా చేయాల్సి ఉంది. ఈ రెండు పూర్తి చేయడానికే సందీప్ చాలా సమయం తీసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ప్రాజెక్ట్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టగలరు. మోస్ట్ క్రేజీ కాంబినేషన్ నిజంగానే కార్యరూపం దాల్చితే అది సౌత్ సినిమాలోనే కాదు పాన్-ఇండియా వ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతుంది.
