ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే నాకు రోమాంచకం!
భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా `రోమాంచకం` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందడి చేశారు.
By: Sivaji Kontham | 25 Aug 2026 11:03 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ సృష్టించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజాగా `రోమాంచకం` సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సందడి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆయనను యాంకర్ ఒక ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీకు ఎదురైన రోమాంచకం ఫీలింగ్ గురించి చెప్పండి అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి ఆయన స్పందిస్తూ #ప్రభాస్ అన్నతో సినిమా చేయడమే నాకు నిజమైన #రోమాంచకం ఫీలింగ్! అని ఎంతో ఉత్సాహంగా వ్యాఖ్యానించారు. దేశంలోనే తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ ప్రభాస్‌తో పనిచేయడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తోందని ఆయన వెల్లడించారు.
గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఉన్న `స్పిరిట్` చిత్రాన్ని ప్రభాస్‌తో తెరకెక్కిస్తున్న తరుణంలో సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాలు సహా అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. విభిన్నమైన యాక్షన్ ట్రెండ్‌ను సృష్టించే సందీప్.. పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ప్రభాస్ కాంబినేషన్‌లో సినిమా రాబోతుండటంతో ఈ చిత్రంపై ఉన్న క్రేజ్ ఇప్పటికే మరో స్థాయికి చేరుకోగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వంగా వ్యక్తం చేసిన నమ్మకం అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇదే క్రమంలో తన సమర్పణలో రూపుదిద్దుకున్న`రోమాంచకం` సినిమా గురించి కూడా సందీప్ పలు విశేషాలను షేర్ చేసారు. ఈ సినిమా కథ- స్క్రిప్ట్ విన్నప్పుడు తనకు అందులో ఉన్న ఫన్ ఎలిమెంట్ కు ఎంతో నవ్వు వచ్చిందని.. అంతటి చక్కటి కామెడీని స్వయంగా రాయడం తన వల్ల కాదనిపించిందని తెలిపారు. ఆ కథలోని వినోదం నచ్చడం వల్లే ఈ చిత్రాన్ని స్వయంగా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వచ్చానని పేర్కొన్నారు.
అలాగే ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాకు ట్రైలర్ కట్ చేయడం ఎంత సవాలుతో కూడుకున్న విషయమో సందీప్ వివరించారు. సినిమా అంతా ఒకే ఫ్లోలో నాన్‌స్టాప్ నవ్వులతో సాగిపోతుందని.. అందువల్ల ఎక్కడ కట్ చేసి ట్రైలర్ సిద్ధం చేయాలో అర్థం కానంతగా కథనం కుదిరిందని సంతోషం వ్యక్తం చేశారు. సాధారణంగా తమ `భద్రకాళి పిక్చర్స్` బ్యానర్‌లో సీరియస్ ఇంటెన్స్ సినిమాలు వస్తుంటాయని.. కానీ మొదటిసారిగా కుటుంబ సమేతంగా చూడదగ్గ యుఏ సర్టిఫికేట్‌తో ఒక పూర్తి ఫన్ ఎంటర్‌టైనర్‌ను అందిస్తున్నామని చెప్పారు.
చివరగా.. `రోమాంచకం` సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రభాస్ అందించిన సహకారాన్ని సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. తమ టీమ్ ఏదీ అడగకుండానే ప్రభాస్ అన్న స్వయంగా ముందుకు వచ్చి పాటలు, కంటెంట్ చూసి మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలియజేశారు. సందీప్ మార్క్ ప్రమోషన్స్ - ప్రభాస్ అందించిన సపోర్ట్‌తో `రోమాంచకం` చిత్రంపై ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగాయి. ట్రైలర్ ఈవెంట్ లో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా సహా చిత్రబృందం పాల్గొంది.
