Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్' పుట్టుక‌కు 'పుష్ప' కార‌ణం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన సంచలన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

By:  Sivaji Kontham   |   26 July 2026 8:00 PM IST
యానిమ‌ల్ పుట్టుక‌కు పుష్ప కార‌ణం!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన సంచలన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ `యానిమల్` రూపకల్పన.. పుష్ప- కేజీఎఫ్ చిత్రాల ప్రభావం.. మహేష్ బాబుతో ప్రాజెక్ట్ మిస్ కావడం.. హిందీ చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం గురించి ఆయన ముక్తసరిగా స్పందించారు. ఈ వివరాలు ప్రస్తుతం టాలీవుడ్ -బాలీవుడ్ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి.

పాన్-ఇండియా సినిమా ట్రెండ్ గురించి మాట్లాడూతూ.. కరోనా మహమ్మారి తదనంతర కాలంలో సినిమాలు విడుదలయ్యే శైలి పూర్తిగా మారిపోయిందని సందీప్ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా ఏ భాషలో తీశామనే దానికంటే... అందులోని కంటెంట్‌లో యూనివ‌ర్శ‌ల్ ఎమోషన్స్ ఉంటే అది సరిహద్దులను దాటి ఆదరణ పొందుతుందనడానికి కేజీఎఫ్, పుష్ప చిత్రాల విజయాలే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పారు. ఈ సినిమాల అపార విజయాలు తన ఆలోచనలను ప్రభావితం చేశాయని.. బాలీవుడ్‌లో తాను చేయబోయే సినిమా కాన్వాస్‌ను.. పరిధిని విస్తరించడానికి ఇవి ఎంతగానో దోహదపడ్డాయని ఆయన అంగీకరించారు.

ఇక తన ఆల్ టైమ్ హిట్ `యానిమల్` సినిమా పుట్టుక గురించి చెబుతూ.. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్‌తో పనిచేసే అవకాశం రావడం వల్లే ఈ కథను హిందీలో నేరుగా తెరకెక్కించానని తెలిపారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే సున్నితమైన, తీవ్రమైన భావోద్వేగ బంధం చుట్టూ తిరిగే ఈ కథ ఏ భాషకైనా సరిపోతుందని స్పష్టం చేశారు. రణ్‌బీర్‌కు లైన్ చెప్పగానే బాగా నచ్చడం.. ఆయన ఆ పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించడంతోనే `యానిమల్` పట్టాలెక్కిందని సందీప్ వంగా వివరించారు.

మరోవైపు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో సినిమా మిస్ అవ్వడంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. `అర్జున్ రెడ్డి` తర్వాత మహేష్ బాబుకు ఒక కథాంశం చెప్పగా ఆయనకు నచ్చిందని... అయితే మహేష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల చాలా సమయం పడుతుందని భావించానని తెలిపారు. అప్ప‌ట్లో సమయాన్ని వృథా చేయకుండా ముంబై నుంచి వచ్చిన ఆఫర్లతో `అర్జున్ రెడ్డి` రీమేక్‌గా `కబీర్ సింగ్` చేయడానికి అంగీకరించానని.. ఒక హిట్ సినిమాను వేరే భాషలో రీమేక్ చేయడం చాలా బాధ్యతతో కూడుకున్న పని అని ఆయన గుర్తు చేసుకున్నారు.

చివరగా తన కథల ఎంపిక ... సన్నివేశాల రూపకల్పన గురించి మాట్లాడుతూ.. నిజ జీవితంలో తను గమనించిన సంఘటనలు, వ్యక్తుల ప్రవర్తనలు .. వారిలోని ఆవేశాల నుంచే స్ఫూర్తి పొందుతానని చెప్పారు. అయితే `యానిమల్` పాత్రకు తన వ్యక్తిగత జీవితానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సమాజంలోని రకరకాల మనుషుల ఎమోషన్స్‌ను గమనించడమే ఒక బలమైన కథను రాయడానికి తనకు సహాయపడుతుందని సందీప్ రెడ్డి వంగా ముగించారు. అలాగే త‌న త‌ల్లిదండ్రులు త‌న‌కు ఎప్పుడూ అండ‌గా ఉన్నార‌ని, త‌న తండ్రితో యానిమ‌ల్ మూవీ త‌ర‌హా ఘ‌ర్ష‌ణ‌లు ఏవీ లేవ‌ని కూడా వెల్ల‌డించారు.