వంగా స్కెచ్.. మరో స్టార్ కు లాంగ్ వెయిటింగ్ తప్పదా!
'యానిమల్' బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు పాన్ ఇండియా స్థాయిలో ఎలా మార్మోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
By: M Prashanth | 15 Oct 2026 8:00 AM IST'యానిమల్' బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పేరు పాన్ ఇండియా స్థాయిలో ఎలా మార్మోగిపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన నెక్స్ట్ టార్గెట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో చేస్తున్న 'స్పిరిట్'. రస్టిక్ పోలీస్ ఆఫీసర్ గా డార్లింగ్ ను ఎలా చూపిస్తాడో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ భారీ చిత్రం కోసం వంగా లాక్ చేసిన 'మార్చి 5' డేట్ ఇప్పుడు ఒక కొత్త డైలమాను క్రియేట్ చేస్తోంది.
అసలు చిక్కంతా ఎక్కడొచ్చిందంటే.. స్పిరిట్ టార్గెట్ చేసిన మార్చి 5వ తేదీనే బాలీవుడ్ నుంచి 'ఖోస్లా కా ఘోస్లా 2' కూడా థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలను నిర్మిస్తున్నది టీ సిరీస్ సంస్థే కావడం ఇక్కడ అసలైన ట్విస్ట్. ఒకే బ్యానర్ నుంచి రెండు సినిమాలు ఒకేరోజు రావడం కష్టం కాబట్టి, వీటిలో ఏదో ఒకటి కచ్చితంగా వెనక్కి తగ్గుతుందనే డిస్కషన్ ట్రేడ్ లో మొదలైంది.
అయితే ఈ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ కంటే ఎక్కువగా టెన్షన్ పడుతున్నది బాలీవుడ్ ఆడియన్సే. ఎందుకంటే 'స్పిరిట్' వర్క్ ఎంత త్వరగా పూర్తయితే, వంగా తర్వాతి ప్రాజెక్ట్ 'యానిమల్ పార్క్' అంత తొందరగా పట్టాలెక్కుతుంది. మొదటి భాగం క్లైమాక్స్ లో రణబీర్ కు ఇచ్చిన వైల్డ్ నెగెటివ్ షేడ్స్ లీడ్ చూశాక, సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని నార్త్ జనాలు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు స్పిరిట్ డేట్ అటు ఇటు అయితే, దాని ప్రభావం నేరుగా యానిమల్ పార్క్ మీదే పడుతుంది. ఇక్కడ ఒక ప్రాక్టికల్ విషయం ఏంటంటే.. సందీప్ వంగా ట్రాక్ రికార్డ్ చూస్తే ఏడాదికో సినిమా చుట్టేసే రకం కాదు. 'అర్జున్ రెడ్డి' తర్వాత 'కబీర్ సింగ్' కు రెండేళ్లు, ఆ తర్వాత 'యానిమల్' కు మరో నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. తన కథ పక్కాగా వచ్చేంతవరకు ఆయన కాంప్రమైజ్ అవ్వడు.
ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ వంగా కెరీర్ లోనే అతిపెద్ద యాక్షన్ మూవీ. అలాంటప్పుడు దాన్ని హడావుడిగా ఫినిష్ చేసి, వెంటనే రణబీర్ తో సినిమా స్టార్ట్ చేస్తాడనుకోవడం అత్యాశే. దానికి తోడు సీక్వెల్ లో రణబీర్ కపూర్ చేయాల్సిన యాక్షన్ ఎపిసోడ్స్, కాల్షీట్లు అన్నీ వంగా డేట్స్ తో పక్కాగా సింక్ అవ్వాలి. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులను ప్యారలల్ గా హ్యాండిల్ చేసే ఉద్దేశం మేకర్స్ కు కూడా లేదు.
ఈ ఈక్వేషన్స్, టైమ్ గ్యాప్స్ అన్నీ లెక్కలేసుకుంటే.. 'యానిమల్ పార్క్' థియేటర్లలోకి రావడానికి 2028 లేదా 2029 వరకు ఆగాల్సిందే అన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది. స్పిరిట్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందనే పాయింట్ మీదే సీక్వెల్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. మొత్తానికి మార్చి 5 డేట్ కన్ఫ్యూజన్ తో మొదలైన ఈ చైన్ రియాక్షన్.. రణబీర్ ఫ్యాన్స్ సహనానికి గట్టి పరీక్షే పెడుతోంది.
