Begin typing your search above and press return to search.

ఐతే కొడుకును విజయ్ పట్టించుకుంటున్నట్లే

సాధారణంగా పెద్ద హీరోల కొడుకులు హీరోలే అవుతుంటారు. వాళ్లు హీరోలని చిన్నతనంలోనే అభిమానులు ఫిక్సయిపోతారు.

By:  Garuda Media   |   2 July 2026 9:36 PM IST
ఐతే కొడుకును విజయ్ పట్టించుకుంటున్నట్లే
X

సాధారణంగా పెద్ద హీరోల కొడుకులు హీరోలే అవుతుంటారు. వాళ్లు హీరోలని చిన్నతనంలోనే అభిమానులు ఫిక్సయిపోతారు. తమిళంలో నంబర్ వన్ హీరో స్థాయికి ఎదిగిన విజయ్ కూడా తన కొడుకు జేసన్ విజయ్‌ను హీరోగా చేస్తాడని గతంలో అభిమానులు భావించేవారు. కానీ అనూహ్యంగా అతను దర్శకుడిగా మారాడు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్‌తో అతను రూపొందించిన ‘సిగ్మా’ త్వరలో విడుదల కాబోతోంది.

ఐతే ఈ సినిమా మొదలయ్యే సమయానికి విజయ్.. తన కుటుంబంతో లేడు. భార్య సంగీతకు దూరమయ్యాడు. పిల్లలు కూడా తనతో కలిసి లేరని వార్తలు వచ్చాయి. విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఎప్పుడూ భార్యాపిల్లలు తనతో కలిసి కనిపించలేదు. కొడుకు జేసన్ కూడా సొంతంగా ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు కనిపించాడు. అతనెక్కడా తండ్రి పేరు వాడలేదు. విజయ్ కూడా కొడుకు గురించి మాట్లాడలేదు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి రావడం, లేదంటే మేకింగ్‌ను పరిశీలించడం లాంటివి చేయలేదు.

కానీ పైకి కనిపించకపోయినా దర్శకుడిగా కొడుకు సినిమాలో విజయ్ ఇన్వాల్వ్‌మెంట్ ఉందని వెల్లడైంది. దీని గురించి సందీప్ కిషన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. జేసన్‌ తనకు కథ చెప్పేముందు విజయ్‌ని తాను, లోకేష్ కనకరాజ్ కలిసి విజయ్‌ని మీట్ అయినట్లు సందీప్ తెలిపాడు. జేసన్‌తో తాను చేసే సినిమా గురించి ఆయనతో చర్చ జరిగినట్లు తెలిపాడు. తన కొడుక్కి నువ్వంటే చాలా ఇష్టం అని విజయ్ ఆ సందర్భంగా తనకు చెప్పినట్లు సందీప్ వెల్లడించాడు.

ఐతే ఆయన మాట వరసకు అంటున్నాడని అనుకున్నానని.. కానీ తర్వాత జేసన్ తన దగ్గరికి వచ్చి, ఆ సినిమాలో, ఈ సన్నివేశంలో మీరు ఇలా చేశారు అలా చేశారు అంటూ తమిళంతో పాటు తెలుగులోనూ తాను నటించిన చిత్రాల్లోని సీన్ల గురించి కూడా చెప్పడంతో తాను షాకైనట్లు వెల్లడించాడు. జేసన్ తనకు తగ్గ కథతో పక్కాగా స్క్రిప్టు రెడీ చేసుకుని ఫుల్ క్లారిటీతో సినిమా చేశాడని.. తన టీంతో పని చేశాక జెన్జీ ఆలోచనలేంటో అర్థమయ్యాయని.. తన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సందీప్ చెప్పాడు. ఈ సినిమా తర్వాత జేసన్ తనకు నిజంగా ఒక బ్రదర్‌గా మారిపోయాడని అతనన్నాడు.