ఏడాదిన్నర బ్రేక్.. ఇప్పుడు ఏడు సినిమాలతో బ్యూటీ బిజీ
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా ముఖ్య పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.
By: Ramesh Palla | 12 Sept 2025 12:11 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా ముఖ్య పాత్రలో నటించడం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సంయుక్త మీనన్. తెలుగులో ఈ అమ్మడికి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు లభించింది. నటిగా ఆ సినిమా సంయుక్త కి మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈమె నందమూరి కళ్యాణ్ రామ్‌తో కలిసి చేసిన బింబిసార సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ అమ్మడు ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటూ వచ్చింది. తెలుగులో ఈమె చివరగా 2023లో డెవిల్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత తెలుగుతో పాటు, ఇతర భాషల్లోనూ ఈమె పెద్దగా సినిమాలు చేయలేదు.
దిల్ రాజు లవ్ మీ మూవీలో సంయుక్త మీనన్
సంయుక్త మీనన్ కు కారణం ఏంటి అనేది తెలియదు కానీ, దాదాపుగా ఏడాదిన్నర గ్యాప్ వచ్చింది. గత ఏడాదిలో ఈమె నటించిన లవ్ మీ మూవీ మాత్రమే వచ్చింది. అది కూడా గెస్ట్ రోల్ కావడం విశేషం. దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన లవ్ మీ సినిమాలో సంయుక్త అతిథి పాత్రలో కనిపించడంతో పెద్దగా నోటెడ్ కూడా కాలేదు. ఆమె సినిమాల జాబితాలో లవ్ మీ మూవీ ఉంది అనే విషయం చాలా మందికి తెలియనే తెలియదు. చివరగా ఈమె తెలుగు మూవీ డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా సంయుక్త మీనన్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సంయుక్త లుక్ పరంగానూ భలే ఉందే అనిపించుకుంది. అందుకే ఆ సినిమా సంయుక్త మీనన్ కెరీర్ లో స్పెషల్ మూవీ అంటారు. ఆ సినిమా విడుదల తర్వాత చాలా ఆఫర్లు వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆమె నో చెబుతూ వచ్చింది. ఎట్టకేలకు గత ఏడాది ద్వితీయార్థం నుంచి వరుస సినిమాలకు కమిట్ అవుతూ వచ్చింది.
బాలకృష్ణ అఖండ 2 సినిమాలో హీరోయిన్‌గా..
గత ఏడాదిన్నర కాలంగా ప్రేక్షకుల ముందుకు రాని ఈ అమ్మడు రాబోయే ఏడాది కాలంలో దాదాపు అర డజనుకు పైగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చేతిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో పెద్ద సినిమాలు, మీడియం సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేదు. కానీ సినిమాలో అత్యంత కీలక పాత్రకు గాను ఆమెను తీసుకున్నారు అనే వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అఖండ 2 తో పాటు తెలుగులో స్వయంభు సినిమాలో నిఖిల్ కు జోడీగా నటించింది. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి సమాచారం అందుతోంది.
శర్వానంద్ మూవీ నారి నారి నడుమ మురారి సినిమాలో...
శర్వానంద్ కు జోడీగా నారి నారి నడుమ మురారి సినిమా సైతం రాబోతుంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరో వైపు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న విజయ్ సేతుపతి సినిమాలోనూ ఈ అమ్మడు ముఖ్య పాత్రలో నటిస్తోంది. కమర్షియల్ సినిమాలు, పాత్రలు మాత్రమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న క్యారెక్టర్ లను సైతం సంయుక్త కమిట్ అవుతున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తప్పకుండా నటిగా మరిన్ని మంచి సినిమాలు ఈమె చేస్తుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తెలుగులో నాలుగు సినిమాలు చేయడంతో పాటు, హిందీలో ఒకటి, తమిళ్‌లో ఒకటి, మలయాళంలో ఒక సినిమాను చేస్తుంది. తెలుగులో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు హిట్ అయితే రాబోయే రోజుల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకుని ఇప్పుడు ఒక్కసారిగా బిజీ అయిన సంయుక్త మీనన్ రాబోయే రోజుల్లో బ్రేక్ రాకుండా చూసుకోవాలని అభిమానులు కోరుతున్నారు.
