Begin typing your search above and press return to search.

సంపూ.. ఈ బిర్యానీ క్లిక్కయితే..

సంపూర్ణేష్ బాబు పేరు వినగానే ఇప్పటికీ హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట లాంటి సినిమాలే ముందుగా గుర్తొస్తాయి.

By:  M Prashanth   |   16 Sept 2026 1:00 PM IST
సంపూ.. ఈ బిర్యానీ క్లిక్కయితే..
X

సంపూర్ణేష్ బాబు పేరు వినగానే ఇప్పటికీ హృదయ కాలేయం, సింగం 123, కొబ్బరి మట్ట లాంటి సినిమాలే ముందుగా గుర్తొస్తాయి. స్పూఫ్ కామెడీతో అతనికి ఒక డిఫరెంట్ ఇమేజ్ వచ్చింది. మొదట్లో అదే కొత్తగా అనిపించి సినిమాలకు మంచి క్రేజ్ కూడా తెచ్చింది. కానీ తర్వాత అదే తరహా సినిమాలు కొనసాగడంతో సంపూను మరో రకమైన పాత్రలో ఊహించే అవకాశం దర్శకులకు కూడా పెద్దగా రాలేదు.

హీరోగానే చేయాలనే పట్టుదలతో మాత్రం సంపూ ఉండలేదు. కరెంట్ తీగలో చిన్న పాత్ర చేశారు. అల్లరి నరేష్ బందిపోటులోనూ కనిపించారు. జ్యోతిలక్ష్మి, రాజా ది గ్రేట్, దేవదాస్ లాంటి సినిమాల్లో కూడా చిన్న పాత్రలు, స్పెషల్ పాత్రలు చేశారు. అయితే వాటిలో ఏదీ కెరీర్‌ను మరో లెవెల్ కు తీసుకెళ్లేంత పెద్ద క్యారెక్టర్ కాలేదు. మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో సంపూకి రెగ్యులర్‌గా పాత్రలు రావడం కూడా జరగలేదు.

మార్టిన్ లూథర్ కింగ్ మాత్రం కొంచెం వేరే ప్రయత్నం. అందులో కామెడీ ఇమేజ్‌ను తగ్గించి రెగ్యులర్ పాత్రలో కనిపించారు. కొన్ని రివ్యూల్లో కూడా సంపూ నటన గురించి మంచి కామెంట్స్ వచ్చాయి. అప్పటివరకు కనిపించిన ఓవర్ ది టాప్ స్టైల్‌కు భిన్నంగా సహజంగా చేశారని పేర్కొన్నారు. కానీ ఆ సినిమా తర్వాత కూడా అలాంటి పాత్రలు ఎక్కువగా వచ్చినట్లు కనిపించలేదు.

ఇప్పుడు ది ప్యారడైజ్‌లో బిర్యానీ పాత్ర ఆ గ్యాప్‌ను మార్చే అవకాశం తీసుకొచ్చింది. ఇందులో సంపూ నానికి ఫ్రెండ్‌గా సినిమా మొత్తం కనిపిస్తారని చెప్పారు. ఇది చాలా సీరియస్ క్యారెక్టర్ అని, ఇలాంటి పాత్ర తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయలేదని కూడా వెల్లడించారు. ఈ పాత్ర కోసం బరువు తగ్గడంతో పాటు జుట్టు, గడ్డం కూడా పెంచారు. సినిమా పూర్తయ్యే వరకు మరో ప్రాజెక్ట్ ఒప్పుకోలేదని చెప్పారు.

సంపూను జస్ట్ పేరడీ కామెడీకి మాత్రమే తీసుకోవాలా? లేక కథలో బలమైన సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా నిలబడగలరా? అనే సందేహం చాలా కాలంగా ఉంది. బిర్యానీ పాత్రలో కామెడీ కంటే సీరియస్ షేడ్ ఎక్కువగా ఉంటే, దర్శకులు ఆయనను చూసే విధానం కూడా మారే అవకాశం ఉంటుంది. హీరో పాత్రల కంటే ఇలాంటి క్యారెక్టర్లు కెరీర్ కు ప్లస్ అయ్యే చాన్స్ ఉంది.

ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24న థియేటర్లలోకి వస్తోంది. శ్రీకాంత్ ఓదెల ఈ పాత్ర కోసం స్పెషల్ గా సంపూను ఎంచుకున్నారు. సాయి రాజేష్ సలహా మేరకు ఆ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చాలా కాలం తరువాత పెద్ద సినిమా రావడంతో సంపూర్ణేష్ బాబు ఇక కొత్తగా మరతడాని అనిపిస్తోంది. ఇక సినిమా కంటెంట్ ఆ పాత్రను ఎంతవరకు ఎలివేట్ చేస్తుందో చూడాలి.