'పుష్ప'తో సునీల్‌లా 'ప్యారడైజ్'తో సంపూ అలా!
సరిగ్గా అలాంటి తరుణంలోనే `దసరా` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నుంచి సంపూకి ఒక ఊహించని.. అత్యంత కీలకమైన ఆఫర్ వచ్చింది.
By: Sivaji Kontham | 15 Sept 2026 9:17 PM ISTటాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు ఇప్పటివరకు ఎక్కువగా కామెడీ, ప్యారడీ పాత్రలతోనే ప్రేక్షకులను అలరించారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన జోనర్‌కు పరిమితం కాకుండా..ఒక నటుడిగా తనలోని కోణాలను మార్చుకోవాలని అతడు ఎంతో కాలంగా వేచి చూస్తున్నాడు. ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటున్నారు. సరిగ్గా అలాంటి తరుణంలోనే `దసరా` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నుంచి సంపూకి ఒక ఊహించని.. అత్యంత కీలకమైన ఆఫర్ వచ్చింది. కెరీర్ ప్రారంభం నుంచి కామెడీ ఇమేజ్‌తో గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబుకు.. ఈ సినిమాతో ఒక బలమైన సీరియస్ రోల్ దక్కడం నిజంగానే అతని సినీ ప్రయాణంలో బిగ్గెస్ట్ పాత్ బ్రేకింగ్ ఆఫర్‌గా భావించవచ్చు.
న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన `ది ప్యారడైజ్` ఓపెనింగుల గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబు ఒక సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆయన నాని పాత్రకు బెస్ట్ ఫ్రెండ్‌గా.. సినిమా ప్రయాణం అంతటా నిలిచే ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషించారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుందని.. ఇప్పటివరకు తాను చేసిన పాత్రలన్నింటికంటే ఇది పూర్తిగా భిన్నమైన సీరియస్ రోల్ అని సంపూ స్వయంగా వెల్లడించారు.
ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సంపూర్ణేష్ బాబు నటుడిగా శారీరకంగా- మానసికంగా ఎంతో కష్టపడ్డారు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా బరువు తగ్గడంతో పాటు.. జుట్టు, గడ్డం పెంచి తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు వేరే ఏ ఇతర ప్రాజెక్ట్‌లను కూడా అంగీకరించకూడదని నిర్ణయించుకుని మరీ పూర్తి అంకితభావంతో పనిచేశారు. మూడు సంవత్సరాల క్రితమే తనకు ఇలాంటి పాత్ర వచ్చి ఉంటే తన కెరీర్‌లో కొన్ని పొరపాట్లు జరిగేవి కాదని ఆవేదన వ్యక్తం చేసారంటే.. ఈ పాత్ర అతడికి ఎంతటి సంతృప్తినిచ్చిందో అర్థం చేసుకోవచ్చు. సాయి రాజేష్ అందించిన సపోర్ట్ తో ఈ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టిన సంపూ తన కెరీర్‌లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.
`ది ప్యారడైజ్` చిత్రంలో సంపూర్ణేష్ బాబు పాత్ర ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్యారడైజ్ బిర్యానీ ఎంత అద్భుతంగా ఉంటుందో.. తన క్యారెక్టర్ అంతకంటే అద్భుతంగా ఉంటుందని.. ఈ సినిమాలో ప్రతి సీన్‌కు, ప్రతి పాత్రకు అత్యంత ప్రాధాన్యత ఉందని తెలిపారు. మోహన్ బాబుతో కలిసి నటించాలనే తన చిరకాల కోరిక కూడా ఈ సినిమాతో నెరవేరడం మరింత ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఒక నటుడిగా కేవలం నవ్వులు పంచడమే కాకుండా.. తీవ్రమైన భావోద్వేగాలు.. భారీ యాక్షన్ ఉన్న పాత్రలతోనూ మెప్పించగలనని నిరూపించుకునేందుకు సంపూర్ణేష్ బాబు ఈ చిత్రంతో సిద్ధమయ్యారు.
ఓవరాల్ గా సంపూర్ణేష్ బాబు కెరీర్‌లో `ది ప్యారడైజ్` ఒక సువర్ణావకాశం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కామెడీ ఇమేజ్ ముద్రను చెరిపేసుకుంటూ.. ఒక నటుడిగా తన పరిధిని విస్తరించుకోవడానికి అతడు చేసిన ఈ సాహసం ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబడుతుందో చూడాలి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వ ప్రతిభ, నానితో ఉన్న కాంబినేషన్ సీన్స్ సంపూ కెరీర్‌కు కచ్చితంగా కొత్త దిశను నిర్దేశిస్తాయని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే పుష్ప చిత్రంలో సీరియస్ పాత్రలో నటించిన సునీల్ కి మంచి పేరొచ్చింది. ఇప్పుడు అలాంటి పేరు సంపూ కొట్టేస్తాడా లేదా? అనేది చూడాలి.
