Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ఎప్పటికీ ఆ ప్రేమ దొరకదు: సమీరా రెడ్డి

బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు ఎక్కువ గౌరవం, పారితోషికం, గుర్తింపు లభించాయని నటి సమీరా రెడ్డి తెలిపారు. 18 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ దక్షిణాది ప్రేక్షకులు ఇప్పటికీ అదే ప్రేమ చూపిస్తున్నారని చెప్పారు. తాను ఎప్పటికీ దక్షిణాది నటినేనని, బాలీవుడ్‌లో అలాంటి ప్రేమ లభించలేదని ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   20 Nov 2026 10:54 PM IST
బాలీవుడ్ లో ఎప్పటికీ ఆ ప్రేమ దొరకదు: సమీరా రెడ్డి
X

నీడనిచ్చిన ఇంటిని, అన్నం పెట్టిన చెయ్యిని ఎప్పుడూ విడవకూడదు అంటారు.. అయితే ఈ మధ్యకాలంలో ప్రత్యేకించి కొంతమంది సెలబ్రిటీలు తమకు ఒక గుర్తింపును కల్పించిన ఇండస్ట్రీ పైనే విమర్శలు గుప్పిస్తూ కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఇటీవల రాధిక ఆప్టే తన కెరీర్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండే ప్రారంభించింది. ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది కూడా తెలుగు ఇండస్ట్రీ నుండే.. కానీ బాలీవుడ్కు వెళ్లిపోయి అక్కడ వరుస అవకాశాలు అందుకుంటున్న ఈమె ఇప్పుడు టాలీవుడ్ పై , టాలీవుడ్ సంస్కృతిపై చేసిన కామెంట్లు పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తున్నాయి.

ఇలాంటి సమయంలో పాయల్ రాజ్ పుత్ తో పాటు మరికొంతమంది సెలబ్రిటీలు రాధిక ఆప్టే వ్యాఖ్యలపై మండిపడ్డారు. నీడనిచ్చిన ఇంటిని కూల్చకూడదు అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ జాబితాలోకి సమీరారెడ్డి కూడా వచ్చి చేరారు. అయితే రాధిక ఆప్టే ప్రస్తావనను ఆమె తీసుకురాలేదు కానీ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు, తనపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయిన సమీరా రెడ్డి.. టాలీవుడ్ పై ప్రశంసలు కురిపిస్తూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో లాగా బాలీవుడ్ లో ఆ ప్రేమ ఎప్పటికీ దొరకదు అంటూ ఆమె చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం , బెంగాలీ, బాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమీరారెడ్డి.. తొలిసారి తెలుగులో నరసింహుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత జై చిరంజీవ సినిమాతో మరోసారి ఆకట్టుకున్న ఈమె.. ఇక చివరిగా అశోక్ సినిమా చేసి మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. అయితే కృష్ణం వందే జగద్గురుం సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది సమీరారెడ్డి. తమిళ్, హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. ఇండస్ట్రీకి ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పలు విషయాలపై స్పందిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్లో తన అనుభవంతో పోలిస్తే దక్షిణాదిలో తన అనుభవం ఎంతో గొప్పది అంటూ తెలిపింది. ఈ మేరకు సమీరా రెడ్డి మాట్లాడుతూ.." బాలీవుడ్ లో నేను ఎన్నో సినిమాలలో నటించాను. కానీ అక్కడ అనుభవంతో పోల్చుకుంటే దక్షిణాదిలో నా అనుభవం చాలా గొప్పది. ముఖ్యంగా బాలీవుడ్ తో పోలిస్తే దక్షిణాదిలో నాకు లభించిన గౌరవం, పారితోషకం, గుర్తింపు, కళాత్మక విలువ అన్నీ కూడా చాలా ఉన్నతమైనవి. 18 ఏళ్ల తర్వాత కూడా నేను ఇప్పటికీ దక్షిణాది అభిమానుల నుండి ప్రేమ, గౌరవం పొందుతూనే ఉన్నాను. అందుకే నేను ఎప్పటికీ చెప్పే మాట.. నేను దక్షిణాది నటినే అని. ముఖ్యంగా అక్కడ లభించే ప్రేమ, నాకు బాలీవుడ్ లో దొరకడం లేదు" అంటూ సమీరా రెడ్డి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.