హీరోయిన్ల ఆత్మ విశ్వాసంపై దెబ్బ కొట్టిన దర్శకులు!
తెల్లగా ఉన్నవారే అందమైనవారని వారే తెరపై హీరోయిన్లుగా రాణించగలరనే అశాస్త్రీయమైన నమ్మకం ఇండస్ట్రీలో ఒకప్పుడు బలంగా ఉండేది.
By: Srikanth Kontham | 19 July 2026 12:00 AM ISTతెల్లగా ఉన్నవారే అందమైనవారని వారే తెరపై హీరోయిన్లుగా రాణించగలరనే అశాస్త్రీయమైన నమ్మకం ఇండస్ట్రీలో ఒకప్పుడు బలంగా ఉండేది. నటి సమీరా రెడ్డి కెరీర్ ఆరంభ రోజులను గుర్తుచేసుకుంటూ అప్పటి చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టడం నేటి తరం నటీమణుల్లో ఆసక్తికరమైన చర్చాంశంగా మారింది.
సమీరారెడ్డి మొదటి చిత్రంలో సోహైల్ ఖాన్‌తో కలిసి నటించినప్పుడు తన సహజమైన చర్మ రంగును దాచి మేకప్ ద్వారా రెండు మూడు షేడ్స్ తెల్లగా చూపించే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఇది కేవలం ఆమెకు మాత్రమే జరిగిన సంఘటన కాదు. అప్పట్లో చాలా మంది నటీమణులు ఇలాంటి ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు.
తెరపై పర్ఫెక్ట్ గా కనిపించాలనే ఒత్తిడిలో నటీమణుల అసలు సౌందర్యాన్ని తుడిచిపెట్టడం ఆనాటి ఫ్యాషన్ ట్రెండ్‌గా నడిచేది. ఈ రకమైన వివక్ష వల్ల ఎంతో మంది ప్రతిభావంతులైన కళాకారులు తమ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఒక నటి తన నటనతో కంటే? తన చర్మం రంగుతోనే గుర్తించబడాలనే నిబంధన, సినిమా రంగం యొక్క పరిణతిని ప్రశ్నిస్తోంది. నిజానికి ఒక పాత్రను పోషించడంలో ఆ నటి హావభావాలు, నైపుణ్యం ముఖ్యం కావాలే తప్ప రంగు ఏంటనేది అప్రస్తుతం.
అయితే కాలం మారుతోంది. నేడు పరిశ్రమలో సౌందర్య ప్రమాణాలు మారుతున్నాయి. ఇప్పుడు వైవిధ్యానికి ప్రాధాన్యత పెరిగింది. సహజమైన రూపాలను, చర్మపు రంగులను తెరపై చూపించే ధైర్యం చేస్తున్న దర్శకులు ,నటీమణులు పెరగడం శుభపరిణామం. గతాన్ని గుర్తుచేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పాత ఆలోచనలకు తావు లేకుండా చూడటానికి ఇదొక హెచ్చరికలా పని చేస్తుంది. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా పరిణతి చెందారు.
కేవలం అందం కోసం కాకుండా కథ , నటనకు ప్రాముఖ్య నిస్తున్నారు. విభిన్న రూపాలు కలిగిన కళాకారులను ఆదరిస్తున్నారు. ఈ మార్పు పరిశ్రమలో నిర్ణయాధికారుల ఆలోచనా దృక్పథాన్ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం రంగును మాత్రమే ప్రాతిపదికగా తీసుకునే పాత పద్ధతులను పూర్తిగా వదిలించుకోవాలి. అందం అనేది చర్మం రంగులో లేదు. అది వ్యక్తిత్వంలో .. నైపుణ్యంలో ఉందని గుర్తించినప్పుడే కళా రంగం మరింత ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. సమీరా రెడ్డి వంటి వారు గతాన్ని ధైర్యంగా పంచుకోవడం వల్ల కొత్త తరం నటీమణులు తమ సహజత్వాన్ని గౌరవించుకోవడానికి ప్రేరణ పొందుతారు.
ఇది ఒక సినీ నటి ఆవేదన మాత్రమే కాదు. సమాజంలో పేరుకుపోయిన అసమానతలకు వ్యతిరేకంగా వినిపిస్తున్న గొంతుకగాను భావించాల్సిన అవసరం అంతే ఉంది. పరిశ్రమలో పెరుగుతోన్న పోటీ నడుమ ఎన్నో అంశాలను ప్రామాణికంగా తీసుకుని మేకర్స్ ముందుకెళ్తుంటారు. అందులో రంగు అనే అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. కానీ దీని గురించి ఓపెన్ గా మాట్లడే ధైర్యం చేయరు. ఆ భావనని పరిశ్రమ నుంచి తొలగించాల్సిన బాధ్యత మాత్రం అందరిపై ఉంది.
