Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా కలలు.. రిలీజ్‌ల్లో ఆలస్యాలు.. యేటిగట్టు కూడా అదే బాటలో?

ఒకప్పుడు సినీ నిర్మానంలో ఆలస్యమంటే ప్రేక్షకుల్లో ప్రతికూల భావన ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   22 Jun 2026 3:41 PM IST
పాన్ ఇండియా కలలు.. రిలీజ్‌ల్లో ఆలస్యాలు.. యేటిగట్టు కూడా అదే బాటలో?
X

ఒకప్పుడు సినీ నిర్మానంలో ఆలస్యమంటే ప్రేక్షకుల్లో ప్రతికూల భావన ఉండేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మార్కెట్ విస్తరించిన తర్వాత ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సినిమాలను కేవలం ఒక భాషలోని ప్రేక్షకుల కోసం కాకుండా దేశవ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందే స్థాయిలో రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రొడ‌క్ష‌న్ టైమ్ పెరగడం, రిలీజ్ డేట్స్ వాయిదా పడటం ఇప్పుడు చాలా మామూలైపోయింది.

టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన పలు భారీ సినిమాల‌ను పరిశీలిస్తే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తుంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాలను పూర్తి చేయడం కంటే, ఫైన‌ల్ రిజ‌ల్ట్ మెరుగ్గా రావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, వరల్డ్ బిల్డింగ్ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో పోస్ట్ ప్రొడక్షన్ దశ కూడా నెలల తరబడి కొనసాగుతోంది. ఫలితంగా మొద‌ట్లో అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్లు తరచూ మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న సంబరాల యేటిగట్టు చుట్టూ నెలకొన్న చర్చ కూడా ఆసక్తికరంగా మారింది. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తాయి. కానీ తాజా పరిణామాలు చూస్తుంటే మేక‌ర్స్ తొందరపడి సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో లేర‌ని అర్థమవుతోంది.

రీసెంట్ గా సినిమా గురించి స్పందించిన తేజ్ కూడా అదే సంకేతాలిచ్చారు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచులు గతంతో పోలిస్తే చాలా మారిపోయాయని, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కంటెంట్‌ను చూస్తున్న ఆడియ‌న్స్ ను ఇంప్రెస్ చేయాలంటే మరింత క్వాలిటీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం ఒక కథతో లేదా స్టార్ ఇమేజ్‌తో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే రోజులు పోయాయని, ప్రతి అంశంలోనూ మెరుగైన అనుభూతి అందించాల్సిన అవసరం పెరిగిందని తేజ్ అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇదే కారణంగా ఎన్నో పెద్ద సినిమాలు ఇప్పుడు నిర్మాణ దశలో చాలా ఎక్కువ టైమ్ తీసుకుంటున్నాయి. గతంలో రిలీజ్ డేట్ ను అందుకోవడం మెయిన్ టార్గెట్‌గా ఉండేది. ఇప్పుడు మాత్రం కంటెంట్ ప్రమాణాలను అందుకోవడమే ప్రాధాన్యంగా మారింది. నిర్మాతలు కూడా భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో మధ్యస్థ స్థాయి ఫలితాలతో సరిపెట్టుకోవడానికి రెడీగా లేరు. తేజ్ సంబరాల యేటిగట్టు విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆలస్యంపై ఫ్యాన్స్ లో ఆందోళన ఉన్నప్పటికీ, చిత్ర యూనిట్ ఫోక‌స్ మాత్రం పూర్తి స్థాయి నాణ్యతపై ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా యుగంలో వేగం కంటే పరిపూర్ణతకే ప్రాధాన్యం పెరుగుతోంది. సంబరాల యేటిగట్టు ఆ మారుతున్న ధోరణికి మరో ఉదాహరణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.