బంగారం తర్వాత సామ్ 'ట్రలాలా' ప్లాన్ ఏంటి?
ఆ బ్యానర్ నుంచి ఇకపై ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? కొత్త దర్శకులకు అవకాశాలిస్తారా? లేక మా ఇంటి బంగారం సీక్వెల్ పైనే దృష్టి పెడతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
By: M Prashanth | 30 Jun 2026 11:46 AM ISTఒక సినిమా విజయం సాధిస్తే తర్వాత హీరో లేదా డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్టుపై ఆసక్తి పెరగడం సహజం. కానీ మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు అందరి దృష్టి సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పై పడింది. ఆ బ్యానర్ నుంచి ఇకపై ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి? కొత్త దర్శకులకు అవకాశాలిస్తారా? లేక మా ఇంటి బంగారం సీక్వెల్ పైనే దృష్టి పెడతారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
సమంత ప్రముఖ నిర్మాతలు రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వురులతో కలిసి ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ను స్టార్ట్ చేశారు. కొత్త తరహా కథలు ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో ఆ నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే ఆ బ్యానర్ తనదైన గుర్తింపు తెచ్చుకోవడం విశేషం. ఆ సంస్థ నుంచి వచ్చిన తొలి చిత్రం శుభం. 2025లో విడుదలైన సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమాలో సమంత క్యామియో రోల్ లో కనిపించారు. నిర్మాతగా మాత్రమే వ్యవహరించి కొత్త టాలెంట్ ను ప్రోత్సహించారు. ఆ తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం మాత్రం ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ కు పెద్ద విజయాన్ని అందించింది. సమంత లీడ్ రోల్ లో నటించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన ఆ చిత్రం జూన్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
బీవీ నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. ట్రెడిషనల్ ఫ్యామిలీలో జీవించే ఓ గృహిణి తన గతం నుంచి వచ్చిన ప్రమాదం నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకుందనే కథతో రూపొందినఆ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకెళ్తోంది. విడుదలైన పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.78.71 కోట్లకు పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఆ విజయంతో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఆ సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాత రాజ్ నిడిమోరు మరో కీలక ప్రకటన చేశారు. మా ఇంటి బంగారం మూవీకి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పారు. అయితే రెండో భాగం వెంటనే రాదని, దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్లు సమాచారం.
అయితే సీక్వెల్ కు ఇంకా సమయం ఉండటంతో ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ నెక్స్ట్ ప్లాన్ పై ఆసక్తి నెలకొంది. సమంత, రాజ్ నిడిమోరు కలిసి పలువురు యువ దర్శకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశముందట. వినూత్నమైన కథలకు ప్రాధాన్యం ఇవ్వడం, కొత్త టాలెంట్ ప్రోత్సహించడం, భిన్నమైన కథాంశాలతో సినిమాలను నిర్మించడం లక్ష్యంగా ట్రలాలా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మరి ఫ్యూచర్ లో ఆ బ్యానర్ నుంచి ఎలాంటి ప్రకటనలు వస్తాయో వేచి చూడాలి.
