సామ్ స్టన్నింగ్ లుక్.. మొదటి ఛాన్స్ గురించి చెబుతూ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ తన స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.
By: M Prashanth | 8 May 2026 5:09 PM ISTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎప్పుడూ తన స్టైల్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. కేవలం వెండితెరపైనే కాకుండా, ఫ్యాషన్ ప్రపంచంలో కూడా ఆమె తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. లేటెస్ట్ గా ‘ద నోడ్’ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం సమంత చేసిన ఫోటోషూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ఆమె ధరించిన అవుట్‌ఫిట్, ఆమె మేకోవర్ చాలా డిఫరెంట్ గా ఉండటమే కాకుండా, సమంతలోని సరికొత్త ఎనర్జీని చూపిస్తోంది.
కేవలం గ్లామర్ మాత్రమే కాకుండా ఒక ప్రొఫెషనల్ మోడల్ తరహాలో ఆమె ఇచ్చిన పోజులు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ ఫోటోషూట్‌తో పాటు తన కెరీర్ మొదలైన తొలినాళ్ల గురించి సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చెన్నైలో ముగ్గురు పిల్లల్లో అందరికంటే చిన్నదైన సమంతకు అసలు నటనలోకి రావాలనే ఆలోచనే లేదట. కాలేజీ తర్వాత వచ్చిన ఒక చిన్న గ్యాప్‌లో సరదాగా మోడలింగ్ వైపు అడుగులు వేసి, అలా ఒక సినిమా ఆడిషన్‌కు వెళ్లి అనుకోకుండా హీరోయిన్ అయిపోయినట్లు ఆమె వెల్లడించింది.
"ఒకవేళ ఛాన్స్ వస్తే ఒక ఏడాది పాటు సినిమాలు చేసి, మళ్ళీ చదువుకోవడానికి వెళ్లిపోవాలని అనుకున్నాను" అని సమంత చెప్పడం చూస్తుంటే, ఆమె జర్నీ ఎంత అన్ ఎక్స్పెక్టెడ్ గా సాగిందో అర్థమవుతోంది. ఈ ఫోటోషూట్‌లో సమంత ధరించిన వైట్ కలర్ డ్రెస్ ఆమె హెయిర్ స్టైల్ చాలా క్లాసీగా ఉన్నాయి. ఏ మాత్రం అతిగా అనిపించకుండా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఆమె ఈ లుక్‌ను క్యారీ చేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఇలాంటి ప్రయోగాలు చేయడం సమంతకు కొత్తేమీ కాదు.
గతంలో కూడా ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ఆమె అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఇక ఈ మ్యాగజైన్ షూట్‌లో ఆమె చూపుతున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే, నటిగా మాత్రమే కాకుండా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా ఆమె తనను తాను ఎంతగా మలుచుకుందో అర్ధమవుతుంది. తన టీచర్లు తాను నటిని అవ్వడం చూసి అప్పట్లో కొంత నిరాశ చెందారని, బహుశా ఇప్పటికీ వారు అలాగే అనుకుంటుండవచ్చని సమంత నవ్వుతూ చెప్పుకొచ్చింది.
అయితే తన జీవితంలో ఎదురైన ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో ఈ ప్రొఫెషన్ తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని ఆమె అభిప్రాయపడింది. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బ్యూటీ, వెల్‌నెస్, ఫ్యాషన్ స్పోర్ట్స్ వంటి రంగాల్లో కూడా ఆమె తన మార్క్ చూపిస్తోంది. ఈ డిఫరెంట్ ప్రయాణమే తనను నిరంతరం ఉత్సాహంగా ఉంచుతుందని ఆమె వెల్లడించింది. ఇక సమంత లేటెస్ట్ ఫోటోషూట్ ఆమె అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రలు చేస్తూనే, ఇలాంటి గ్లామరస్ షూట్స్ తో కూడా ఆమె తన క్రేజ్ ఏంటో నిరూపించుకుంటోంది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘మా ఇంటి బంగారం’ సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది.
