Begin typing your search above and press return to search.

శ్రీ కల్పం పద్ధతిలో సమంత సీమంతం వేడుకలు.. దీని ప్రత్యేకత పై శిల్పారెడ్డి ఆసక్తికర పోస్ట్!

పైగా ఈ సీమంతం వేడుకలకు సంబంధించి ఫోటోలను ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి షేర్ చేయడమే కాకుండా ఇది ఒక ఆధ్యాత్మిక సేవ అంటూ చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచింప చేస్తోంది.

By:  Madhu Reddy   |   15 Sept 2026 6:17 PM IST
శ్రీ కల్పం పద్ధతిలో సమంత సీమంతం వేడుకలు.. దీని ప్రత్యేకత పై శిల్పారెడ్డి ఆసక్తికర పోస్ట్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సమంత.. ఒకవైపు హీరోయిన్ గా, మరొకవైపు నిర్మాతగా దూసుకుపోతూనే.. ఇటు వ్యక్తిగతంగా మరింత బిజీగా మారిపోయింది. ఇకపోతే డిసెంబర్ నెలలో డెలివరీకి సిద్ధంగా ఉన్న సమంత కు ఆమె సన్నిహితులు కుటుంబ సభ్యులు ఇటీవల ఘనంగా సీమంతం వేడుకలు జరిపించారు. సాధారణంగా సీమంతం వేడుకలు అంటే ఒక ఫంక్షన్ హాల్ లేదా ఇంట్లో అనుకూలమైన ప్రదేశాలలో జరుపుతారు. కానీ సమంత సీమంతపు వేడుకలు రాజమాతంగి పీఠంలో జరగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పైగా ఈ సీమంతం వేడుకలకు సంబంధించి ఫోటోలను ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి షేర్ చేయడమే కాకుండా ఇది ఒక ఆధ్యాత్మిక సేవ అంటూ చేసిన పోస్ట్ అందర్నీ ఆలోచింప చేస్తోంది.




శ్రీకల్పం పద్ధతిలో సమంత సీమంతపు వేడుకలు..

గర్భం దాల్చిన సమంతాకు.. వినూత్న పద్ధతిలో మంగళ స్నానాలు చేయించి పసుపు, కుంకుమలతో అలంకరించి హారతులతో ఒక దేవీ మూర్తిని పూజించినట్టుగా సీమంతం వేడుకలను సెలబ్రేట్ చేశారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్న సమంత ఈసారి కూడా ఆధ్యాత్మిక విశిష్టతకు పెద్దపీట వేశారు. శ్రీవిద్య ఉపాసకుడి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజలో శ్రీ చక్ర యంత్రం మధ్యలో సమంతాను కూర్చోబెట్టి మరీ ప్రత్యేక మంత్రోచ్ఛారణలు చేశారు.

దీని వెనుక అసలు ఆధ్యాత్మికత ఏంటి?

ఈ పూజలతో తల్లి గర్భంలోని శిశువుకు దైవిక రక్షణ కలగాలనే సంకల్పంతో ఖడ్గమాల స్తోత్రం పారాయణం, పవిత్ర జలాలతో శుద్ధి , ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించినట్లు సమాచారం. తల్లి , బిడ్డ చుట్టూ ఆధ్యాత్మిక రక్షణ వలయం ఏర్పడాలనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని అనుసరించారు. శ్రీ విద్యా సంప్రదాయంలో పాతుకుపోయిన సంప్రదాయ కళా ఆవరణ (శ్రీకల్పం) ఆచారాన్ని నిర్వహించి, సమంతా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో గర్భిణీనీ దేవి స్వరూపంగా భావించే ఈ ఆచారం తనను ఎంతో కదిలించిందని ,తన బిడ్డ కోసం ఇలాంటి పవిత్ర అనుభూతిని పొందడం జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం అని సమంత తెలిపింది. అయితే ఈ విషయంపై ఆమె స్నేహితురాలు శిల్పారెడ్డి ఒక ఆకట్టుకునే పోస్టు పంచుకున్నారు.




ఆసక్తికర పోస్ట్ పంచుకున్న శిల్పారెడ్డి..

"ఏ బంధం లోనైనా ఇద్దరు వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నప్పుడు వారిలో ఒకరి ద్వారా మరొకరికి మార్గదర్శనం లభిస్తుంది. కాలపరీక్షతో బంధాలు బలపడతాయి. దైవ కృపతో మరింత గాఢమవుతాయి. మనకోసం మన సాంప్రదాయంలో పాతుకుపోయిన రాజమాతంగి పీఠంలో జరిగిన ఈ వేడుకలు ఒక ఆధ్యాత్మిక సేవలా అనిపించాయి. ఈ పవిత్రమైన ఆచారం అమ్మవారి యొక్క దివ్య శక్తులను ఆవాహన చేస్తుంది. మంత్రాలు, పవిత్ర జలాల ద్వారా మనలోని చక్రాలు శుద్ధి చేయబడి, మనల్ని శక్తివంతం చేస్తాయి. తద్వారా మనలో మరింత శక్తివంతమైన చైతన్యం ప్రవహిస్తుంది. ఈ పూజ జరిగిన వారిని సాక్షాత్తు అమ్మవారిగా గౌరవిస్తారు.




ఈ వేడుక గురించి ఏమీ తెలియని వారు కూడా అమ్మవారి శక్తికి ఆకర్షితులవుతారు. కేవలం ఆ తల్లి మాత్రమే ప్రభావితం కాలేదు .. దాని అనుగ్రహం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని తాకింది . నాకు సాక్షాత్తు ఆ దేవతకే నా సేవను సమర్పించినట్లు అనిపించింది. ఆమె నా వద్దకు నేరుగా వచ్చినట్లు అనిపించింది. ఇది మన సంస్కృతికి కొత్త ఏమీ కాదు.. వరలక్ష్మి వ్రతం సమయంలో మనం ఎలా అయితే మన ఇంటికి వచ్చే స్త్రీలను లక్ష్మీదేవిగా భావించి , కుంకుమ, పాదాలకు పసుపు, పువ్వులు, చందనం వస్త్రాలతో స్వాగతిస్తామో .. ఇందులో కూడా అలాగే చేస్తాము. కానీ మనం నిష్కపటంగా, శరణాగతి తో పాల్గొన్నప్పుడు మాత్రమే వాటి సారాన్ని అనుభూతి చెందగలం.




బహుశా మనం బయట అసాధారణమైనదేమీ చేయనవసరం లేదు. కేవలం సరళమైన ఆధ్యాత్మిక సాధన ద్వారా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ. మన ఆలోచనలను శుద్ధి చేసుకుంటూ.. మన కర్మలను మెరుగుపరుచుకుంటూ.. సరైన సంకల్పాలను కలిగి ఉండి, అంకితభావంతో ముందుకు సాగాలి" అంటూ మన సంస్కృతి పట్ల తన గౌరవాన్ని, సమంత సీమంతపు వేడుకల వెనుక ఉన్న ఆధ్యాత్మిక సేవ గురించి ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.