సమంత కెరీర్ గ్రాఫ్..గ్యాప్!
అయితే వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు సమంత వృత్తిపరమైన వేగాన్ని ప్రభావితం చేసాయి అన్నది కాదనలేని నిజం.
By: Srikanth Kontham | 17 April 2026 2:00 PM ISTఏ మాయ చేసావే అంటూ అడుగుపెట్టిన సమంత అనతి కాలంలోనే అగ్ర హీరోయిన్‌గా ఎదిగారు. కెరీర్ ఆరంభంలో అమ్మడి ప్రయాణం ఒక ప్రభంజనంలా సాగింది. మహేష్ , పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోలందరి సరసన నటించి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస విజయాలు సాధిస్తూ సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికలలో ఒకరిగా సత్తా చాటారు. ఆ సమయంలో ఆమె కెరీర్ గ్రాఫ్ నిరంతరం ఎదుగుతూనే ఉంది. అయితే వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలు సమంత వృత్తిపరమైన వేగాన్ని ప్రభావితం చేసాయి అన్నది కాదనలేని నిజం.
వివాహం తర్వాత కూడా ఆమె`రంగస్థలం`, మజిలీ, ఓ బేబీ వంటి చిత్రాలతో నటనలోని వైవిధ్యాన్ని నిరూపించు కున్నారు. కానీ వైవాహిక జీవితంలో విడిపోవడం , ఆ తర్వాతి కాలంలో ఎదురైన ఆరోగ్య సమస్యలు ఆమెను సినిమాలకు కొంతకాలం దూరం చేశాయి. మయోసైటిస్ వ్యాధి వల్ల శారీరకంగా, మానసిక సిద్ధంగా బలపడటానికి ఆమె కావాలనే సినిమాలకు సుదీర్ఘ విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తర్వాత సమంత కేవలం వెండితెరకే పరిమితం కాకుండా డిజిటల్ మాధ్యమంపై దృష్టి సారించారు.
ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్న అమ్మడు అటుపై తన కెరీర్ పంథాను మార్చుకున్నారు. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథా బలమున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలను ఎంచుకోవడం మొదలుపెట్టారు. యశోద, శాకుంతలం వంటి ప్రయత్నాలు ఆ కోవలోకి చెందినవే అయినా అవి ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. గత మూడేళ్ల కాలంలో సమంత కెరీర్ గ్రాఫ్‌లో స్పష్టమైన గ్యాప్ కనిపిస్తోంది. ఆమె తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ ప్రారంభించి 'మా ఇంటి బంగారం' వంటి సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది.
ప్రస్తుతం సమంత ఎంపిక చేసిన ప్రాజెక్టులకే మొగ్గు చూపుతున్నారు. సమంత తన వ్యక్తిగత జీవితానికి , వృత్తికి మధ్య సమతుల్యత సాధించే క్రమంలోనే ఈ స్థాయిలో గ్యాప్ తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితం మళ్లీ స్థిరపడినట్లు కనిపిస్తున్నా? సినీ కెరీర్ విషయంలో మాత్రం ఆమె ఇంకా పాత వైభవం కోసం వేచి చూడాల్సి వస్తోంది. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే స్థాయి నుండి ఇప్పుడు ఒక్క సినిమా విడుదల కోసం అభిమానులు ఏళ్ల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం సమంత సెకండ్ ఇన్నింగ్స్‌లో క్వాంటిటీ కంటే క్వాలిటీ కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె నిర్ణయాలు చెబుతున్నాయి. సామా ఆరంభంలో కమర్షియల్ స్టార్‌గా వెలిగిపోయారు. కానీ నేడు ఒక పరిణతి చెందిన నటిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ గ్యాప్ తర్వాత ఆమె చేసే సినిమాలు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడతాయా ? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. కెరీర్ సెకండ్ హాఫ్‌లో ఆమె తీసుకోబోయే నిర్ణయాలే భవిష్యత్తులో ఆమె స్థానాన్ని డిసైడ్ చేస్తాయన్నది కాదనలేని నిజం.
