ఫ్రెగ్నెన్సీ గ్లో.. సమంత జీవితంలో హ్యాపీడేస్
ప్రస్తుతం సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు జీవితాల్లో ఎంతో సంతోషకరమైన సమయం నడుస్తోంది.
By: Sivaji Kontham | 2 Aug 2026 1:42 AM ISTప్రస్తుతం సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు జీవితాల్లో ఎంతో సంతోషకరమైన సమయం నడుస్తోంది. వారు తమ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో ఒక అద్భుతమైన దశను ఆస్వాధిస్తున్నారు. ఓ వైపు సమంత నటించి నిర్మించిన `మా ఇంటి బంగారం` చిత్రం సాధించిన విజయంతో రాజ్- సమంత జంట ఆనందంలో మునిగితేలుతుంటే.. మరోవైపు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నామన్న వార్త వారి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రెగ్నెన్సీ గ్లోతో సమంత తన జీవితంలోనే అత్యుత్తమమైన రోజులను గడుపుతున్నారు.
వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఈ జంట సోషల్ మీడియాలో తమ సరదా సమయాన్ని అభిమానులతో పంచుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల రాజ్ నిడిమోరు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. అందులో రాజ్, సమంత ఇద్దరూ ఒకే రంగు (మెరూన్) దుస్తులు ధరించి కారులో కూర్చుని కనిపించారు. సమంత కెమెరా వైపు క్యూట్‌గా లుక్ ఇస్తుంటే.. ఆ వెనుక కూర్చున్న రాజ్ కూడా అదే ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ కనిపించారు. ``సామ్ బీయింగ్ సామ్`` అని రాజ్ పెట్టిన క్యాప్షన్ వారి మధ్య ఉన్న అనుబంధాన్ని, సరదా మూవ్‌మెంట్‌ను ప్రతిబింబిస్తోంది.
డిసెంబర్ 2025లో రాజ్ నిడిమోరు, సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత జూన్ 2026లో తాము మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నామనే శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. నాటి నుండి సమంత తన ప్రెగ్నెన్సీ ప్రయాణాన్ని ఎంతో ఆనందంగా ఆస్వాధిస్తున్నారు. తల్లి కాబోతున్నందుకు ఎంతగానో ఉత్సాహపడుతూ.. దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఈ సంతోషకరమైన తరుణం తన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది అని భావిస్తున్నారు.
పింక్‌విల్లా ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ.. తల్లి కావాలనేది తన చాలా కాలపు కల అని వెల్లడించారు. ఇది నాకు పూర్తిగా కొత్త , ఉత్సాహకరమైన అనుభవం. చాలా కాలంగా ఈ క్షణం కోసం వేచి చూస్తున్నాను. ఎల్లప్పుడూ తల్లి కావాలని కోరుకున్నాను కాబట్టి ఈ ప్రయాణానికి నా పూర్తి శ్రమను, ప్రేమానురాగాలను అందిస్తాను. ఇప్పుడు నాలో ఒక కొత్త రకమైన శక్తీ, స్పష్టమైన లక్ష్యం ఏర్పడినట్లు అనిపిస్తోంది. ఈ ప్రయాణం విషయంలో ఎంతో కృతజ్ఞతతో ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను! అని సమంత తెలిపారు.
రాజ్ నిడిమోరు, సమంతల కాంబినేషన్ కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా ఎన్నో విజయవంతమైన ప్రాజెక్ట్‌లను అందించింది. `మా ఇంటి బంగారం` కంటే ముందే వీరిద్దరూ కలిసి పలు ప్రాజెక్ట్‌లలో పనిచేశారు. పాపులర్ సిరీస్ `ది ఫ్యామిలీ మ్యాన్` తో ప్రారంభమైన వీరి ప్రయాణం.. ఆ తర్వాత `సిటాడెల్: హనీ బన్నీ` .. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ `రక్త బ్రహ్మాండ్` వరకు విజయవంతంగా కొనసాగింది.
