Begin typing your search above and press return to search.

రాజ్ నిడిమోరు.. సామ్ ను అంతలా మార్చారా?

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పర్సనల్ లైఫ్, వివాహ బంధం, కొత్త జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

By:  M Prashanth   |   23 Feb 2026 9:05 PM IST
రాజ్ నిడిమోరు.. సామ్ ను అంతలా మార్చారా?
X

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన పర్సనల్ లైఫ్, వివాహ బంధం, కొత్త జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దర్శకుడు రాజ్ నిడిమోరుతో తన రిలేషన్ జీవితాన్ని పూర్తిగా మార్చిందంటూ ఆమె ఎమోషనల్ గా చెప్పారు. ఓ ఆంగ్ల మ్యాగజైన్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు.

విడాకుల తర్వాత మళ్లీ ఎవరినైనా నమ్మడం, వారిపై ఆధారపడటం సాధ్యం కాదని అనుకున్నానని సమంత చెప్పారు. "నా హృదయంలో ఇంకెవరికి చోటు ఉండదనుకున్నాను. ప్రేమ, స్నేహం అంగీకరించేంత బలం కూడా నాలో లేదనిపించింది. కానీ రాజ్ నా జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా మారిపోయింది" అని సమంత తెలిపారు. రాజ్ పరిచయం తనకు కొత్త ఉత్సాహం ఇచ్చిందని, మళ్లీ జీవితం మీద నమ్మకం పెరిగిందని చెప్పారు.

రోజూ సన్ రైజ్ ను ఆస్వాదించడం, ధ్యానం చేయడం, ప్రశాంతంగా జీవించడం వంటి అలవాట్లు తమ ఇద్దరినీ దగ్గర చేశాయని సమంత పేర్కొన్నారు. "మేమిద్దరం కలిసి పనిచేస్తాం, కలిసి వ్యాయామం చేస్తాం, కలిసి ప్రయాణిస్తాం. నిజంగా చెప్పాలంటే మేం చికాకు కలిగించే జోడీ" అంటూ నవ్వుతూ చెప్పారు. రాజ్ తన పక్కన ఉన్నంత కాలం నటిగా ఇంకా మెరుగవుతానని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

సమంత, రాజ్‌ ల పరిచయం వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్-2 సమయంలో మొదలైంది. ఆ తర్వాత సిటాడెల్: హనీ బన్నీ ప్రాజెక్ట్‌ లో కలిసి పనిచేసే టైమ్ లో స్నేహం ప్రేమగా మారింది. గత ఏడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. ఆ పెళ్లి ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

అంతేకాకుండా, అనారోగ్య సమస్యలైన మయోసైటిస్‌ తో పోరాటం కూడా తనను మానసికంగా కుంగదీసిందని సమంత గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో స్నేహితులు పంపిన ఓ వాయిస్ నోట్ తనకు ఎంతో ధైర్యం ఇచ్చిందని చెప్పారు. "ఇప్పుడే నిజంగా ఊపిరి పీలుస్తున్నావు" అన్న మాటలు తనను కదిలించాయని తెలిపారు. ప్రస్తుతం సామ్ కామెంట్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం చిత్రంతో బిజీగా ఉన్నారు. ఆ సినిమాకు బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో చీర కట్టుకుని యాక్షన్ సన్నివేశాలు చేయడం తనకు కొత్త అనుభవమని చెప్పారు. కేవలం ఐదు గంటల్లో బస్ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేశామని, బడ్జెట్ నియంత్రణతో వేగంగా షూటింగ్ సాగుతోందన్నారు. అయితే మా ఇంటి బంగారం చిత్రం మే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.