Begin typing your search above and press return to search.

స్టార్ నుంచి సర్వైవర్‌గా.. సర్వైవర్ నుంచి సూపర్ విన్నర్‌గా!

సినీ ప్రపంచంలో స్టార్‌డమ్ సాధించడం ఒక స‌క్సెస్ అయితే, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోని కఠిన పరీక్షలను ఎదుర్కొని మళ్లీ అదే స్థాయిలో నిలబడటం మరో గొప్ప విజయం.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 July 2026 3:22 PM IST
స్టార్ నుంచి సర్వైవర్‌గా.. సర్వైవర్ నుంచి సూపర్ విన్నర్‌గా!
X

సినీ ప్రపంచంలో స్టార్‌డమ్ సాధించడం ఒక స‌క్సెస్ అయితే, ప‌ర్స‌న‌ల్ లైఫ్ లోని కఠిన పరీక్షలను ఎదుర్కొని మళ్లీ అదే స్థాయిలో నిలబడటం మరో గొప్ప విజయం. అలాంటి అరుదైన ప్రయాణాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్ల‌లో సమంత ఒకరు. కెరీర్‌లో అద్భుత స‌క్సెస్‌ల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ గా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ప్రతి సారి మరింత బలంగా తిరిగి నిలబడుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వ‌స్తున్నారు స‌మంత‌. చెన్నైలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన సమంత చిన్నప్పటి నుంచే కష్టపడి ఎదగాలనే తపనతో ముందుకు సాగారు. చదువుతో పాటూ ఆర్థిక అవసరాల కోసం మోడలింగ్ చేస్తూ తన టార్గెట్ ను రీచ్ అయేందుకు శ్రమించారు. ఒక సాధార‌ణ ఫ్యామిలీకి చెందిన యువతి నుంచి సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో అగ్రస్థానానికి చేరుకోవడం వెనుక ఆమె పట్టుదలే ప్రధాన కారణమని చెప్పొచ్చు.

2010లో రిలీజైన ఏ మాయ చేసావే సినిమా ఆమె కెరీర్‌కు కీలక మలుపుగా నిలిచింది. మొద‌టి సినిమాతోనే నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస స‌క్సెస్‌ల‌తో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. కమర్షియల్ సినిమాలే కాకుండా యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న క్యారెక్ట‌ర్ల‌ను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు.

కెరీర్ అత్యున్నత దశలో ఉన్న టైమ్ లోనే సమంత నటిగా మరో అరుదైన ఘనతను సాధించారు. ఒకే ఏడాదిలో తెలుగు, తమిళ భాషల్లో ఉత్తమ నటి విభాగంలో అవార్డులు అందుకోవడం ద్వారా తన టాలెంట్ కు మరోసారి నిదర్శనంగా నిలిచారు. ఆ తర్వాత వెబ్ సిరీస్‌ల ద్వారా కూడా స‌మంత తన పరిధిని విస్తరించారు. ముఖ్యంగా ది ఫ్యామిలీ మాన్2 లో చేసిన పాత్రకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. దీంతో రీజ‌న‌ల్ స్టార్ నుంచి నేష‌న‌ల్ లెవెల్ స్టార్ గా ఆమె గుర్తింపు మరింత బలపడింది.

అలాగ‌ని స‌మంత లైఫ్ జ‌ర్నీ ఎప్పుడూ స‌క్సెస్‌ల‌తోనే నిండిపోలేదు. అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్ బారిన పడినట్లు సమంత అనౌన్స్ చేసిన‌ప్పుడు ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ట్రీట్‌మెంట్, హెల్త్ ఇష్యూస్, సినిమా నుంచి బ్రేక్ తీసుకోవ‌డం ఛాలెంజెస్ ను వాటిని ధైర్యంగా స్వీకరించి మళ్లీ షూటింగ్‌లకు తిరిగి రావడం ఆమె ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో ఎదురైన విడాకుల అంశం కూడా ఆమెకు మరో పెద్ద పరీక్షగా మారింది. ఆ సమయంలో ఎన్నో ఊహాగానాలు, విమర్శలు ఎదురైనా వాటిపై పెద్దగా స్పందించకుండా తన దృష్టిని పూర్తిగా కెరీర్, ఆరోగ్యంపైనే కేంద్రీకరించారు. అప్ప‌టివ‌ర‌కు త‌న‌కు అన్ని విష‌యాల్లో ఎంక‌రేజ్‌మెంట్ ను అందించే ఫ్రెండ్స్ కూడా విడాకుల త‌ర్వాత త‌న‌ను ఐటెం సాంగ్ చేయొద్ద‌ని చెప్పార‌ని, కానీ న‌టిగా త‌నకు ప్ర‌తీదీ ట్రై చేయాల‌నిపిస్తుంద‌ని, అందుకే పుష్ప‌లోని ఐటెం సాంగ్ ను చేసిన‌ట్టు చెప్పారు స‌మంత‌. అదే నిర్ణయం ఆమెకు కొత్త అవకాశాలను తీసుకొచ్చింది. నిర్మాతగా అడుగుపెట్టడం, కొత్త కథలను ఎంపిక చేసుకోవడం ద్వారా మరో కొత్త దిశలో ప్రయాణం ప్రారంభించారు.

ఇక రీసెంట్ గా రిలీజైన మా ఇంటి బంగారం స‌క్సెస్ తో సమంత మరోసారి తన మార్కెట్‌ను చాటుకున్నారని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప‌ర్స‌న‌ల్ లైఫ్ లో కూడా స‌మంత త‌ల్లి కాబోతూ కొత్త అధ్యాయం ప్రారంభింనున్న నేప‌థ్యంలో, ఆమె లైఫ్ మరో ఆశాజనక దశలోకి అడుగుపెడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమంత కథ కేవలం ఓ సినీ నటిగా సాధించిన స‌క్సెస్ స్టోరీ మాత్రమే కాదు, కష్టాలను అవకాశాలుగా మార్చుకుంటూ, ప్రతి ఎదురుదెబ్బను ముందుకు సాగే శక్తిగా మలుచుకున్న మహిళ కథ. స‌క్సెస్‌ అందుకోవడం కంటే, దాన్ని కోల్పోకుండా నిలబెట్టుకోవడం ఎంత కష్టమో ఆమె జ‌ర్నీ తెలియ‌చేస్తుంది. అందుకే సమంతను కేవ‌లం స్టార్ హీరోయిన్‌గానే కాకుండా, ఎన్నో సవాళ్లను జయించిన స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా గుర్తిస్తున్నారు.