భర్తతో సమంత రంగుల పండుగ
ఈ వేడుకల్లో కేవలం నటీనటులే కాకుండా.. చిత్ర దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కూడా పాలుపంచుకోవడం విశేషం.
By: Sivaji Kontham | 5 March 2026 12:07 AM ISTసమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరీర్‌లో సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా తాను నటిస్తున్న తాజా చిత్రం `మా ఇంటి బంగారం` సెట్స్‌లో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. ఈ రంగుల పండుగ సందర్భంగా సమంత తన చిత్ర బృందంతో కలిసి మునుపెన్నడూ లేనంత ఆనందంగా గడుపుతున్న వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో సమంత ఉత్సాహం చూస్తుంటే.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
హోలీ వేడుకల వీడియోలో సమంత ఒక చిన్నపిల్లలా మారిపోయి సెట్స్‌పై రచ్చ చేసింది. చేతిలో పిచ్కారీ పట్టుకుని తన లక్ష్యాన్ని గురిచూసి మరీ నీళ్ల వర్షం కురిపించింది. దీనికి ప్రతిగా సహనటులు కూడా వాటర్ బెలూన్లతో దాడి చేయడంతో షూటింగ్ స్పాట్ అంతా ఒక రంగుల యుద్ధ క్షేత్రంలా మారిపోయింది. `డిష్కియాన్... హ్యాపీ హోలీ బంగారాలు` అంటూ సమంత తన అభిమానులకు వెరైటీగా శుభాకాంక్షలు తెలపడం నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఈ వేడుకల్లో కేవలం నటీనటులే కాకుండా.. చిత్ర దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కూడా పాలుపంచుకోవడం విశేషం. సమంత -నందిని రెడ్డిల మధ్య ఉన్న స్నేహం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సెట్స్‌పై ఉన్న ఈ సరదా వాతావరణం సినిమా అవుట్‌పుట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. హోలీ రంగులతో తడిసి ముద్దయిన సమంత ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇక సినిమా విషయానికి వస్తే..`మా ఇంటి బంగారం` చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ వేసవిలో థియేటర్లలో కలుద్దాం బంగారాలు అంటూ సమంత ఈ విడుదల తేదీని ధృవీకరించింది. ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా.. మనుషుల మధ్య ఉండే సంబంధాలను సున్నితంగా ఆవిష్కరించే కథాంశంతో తెరకెక్కుతోంది. జనవరిలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.
ఈ చిత్రంలో సమంత పోషిస్తున్న పాత్ర చాలా శక్తివంతమైనది. బలహీనత నుండి ధైర్యాన్ని పుంజుకునే ఒక మహిళ పోరాటమే ఈ సినిమా. ఎమోషన్స్ - ఫ్యామిలీ డ్రామాతో పాటు కొంచెం ఎనర్జీతో సాగే ఈ కథ ప్రేక్షకులకు తప్పకుండా కనెక్ట్ అవుతుందని సామ్ ధీమా వ్యక్తం చేసింది.
