కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత రెస్పాన్స్ ఏంటంటే?
ఇప్పటికే హీరో నాగార్జున ఆమె వ్యాఖ్యలపై స్పందించగా.. తాజాగా నటి సమంత కూడా రెస్పాండ్ అయ్యారు.
By: Tupaki Desk | 2 Oct 2024 3:53 PM GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల అంశంపై ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ పై అనేక ఆరోపణలు చేస్తూ.. సమంత, నాగచైతన్య విడిపోవడానికి కారణం ఆయనేనని ఆరోపించారు. దీంతో కొండా సురేఖ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. ఇప్పటికే హీరో నాగార్జున ఆమె వ్యాఖ్యలపై స్పందించగా.. తాజాగా నటి సమంత కూడా రెస్పాండ్ అయ్యారు.
సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు సామ్. విడాకులు తన వ్యక్తిగత విషయమని ఆమె తెలిపారు. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థిస్తున్నట్లు చెప్పారు. మహిళగా ఉండడానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యంతో పాటు బలం కావాలని వ్యాఖ్యానించారు. కొండా సురేఖ గారు.. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. దయచేసి చిన్న చూపు చూడకండని సమంత కోరారు.
మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని.. మీరు గ్రహించారని ఆశిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు ఎవరైనా బాధ్యతగా, గౌరవంగా ఉండాలని తాను వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన విడాకులు పరస్పర అంగీకారం, సామరస్యపూర్వకంగా జరిగాయని వెల్లడించారు. ఆ విషయంలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. దయచేసి తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచగలరని సమంత అన్నారు.
తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానని సామ్ తెలిపారు. అలాగే ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతకుముందు నాగార్జున.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు నెట్టింట పోస్ట్ పెట్టారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాల్సిందిగా కోరారు. తక్షణమే మీ(కొండా సురేఖ) వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నట్లు నాగార్జున తెలిపారు.
ఇంతకీ కొండా సురేఖ ఏమన్నారంటే?
కొండా సురేఖ.. బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కేటీఆర్ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా ఆయనే(కేటీఆర్)నని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు సమంత రెస్పాండ్ అయ్యి పోస్ట్ పెట్టారు.