Begin typing your search above and press return to search.

హీరోయిన్ల డీ-గ్లామర్ పాత్రల ట్రెండ్!

ఈ ట్రెండ్‌కు బలమైన పునాది వేసిన చిత్రాల్లో `రంగస్థలం` ఒకటి. అప్పటి వరకు గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన సమంత, పల్లెటూరి యువతి రామలక్ష్మిగా డీ-గ్లామర్ లుక్‌లో మైమరిపించారు.

By:  Srikanth Kontham   |   10 Oct 2026 9:00 PM IST
హీరోయిన్ల డీ-గ్లామర్ పాత్రల ట్రెండ్!
X

ఒకప్పుడు హీరోయిన్ అంటే పాటలకు, గ్లామర్ హంగులకు మాత్రమే పరిమితం అనే భావన ఉండేది. కానీ కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారింది. దానికి తగ్గట్టుగానే వెండితెరపై కథానాయికల పాత్రల చిత్రీకరణలోనూ విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రొటీన్ గ్లామర్ మెరుపుల కంటే మట్టి వాసన ఉండే సహజమైన, రా అండ్ రస్టిక్ డీ-గ్లామర్ పాత్రలు చేసినప్పుడే హీరోయిన్ల కెరీర్ ఊహించని మలుపు తిరుగుతోందని సౌత్ సినీ పరిశ్రమ బలంగా నమ్ముతోంది. బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలన్నా? నటిగా శాశ్వత గుర్తింపు దక్కాలన్నా డీ-గ్లామర్ ఫార్ములానే ప్రధాన సూత్రంగా మారింది.

ఈ ట్రెండ్‌కు బలమైన పునాది వేసిన చిత్రాల్లో `రంగస్థలం` ఒకటి. అప్పటి వరకు గ్లామరస్ రోల్స్ చేస్తూ వచ్చిన సమంత, పల్లెటూరి యువతి రామలక్ష్మిగా డీ-గ్లామర్ లుక్‌లో మైమరిపించారు. ఆ సినిమా సాధించిన విజయం సమంత కెరీర్‌ను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లడమే కాకుండా హీరోయిన్లకు మేకప్ కంటే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే రక్షణ కవచమని నిరూపించింది. అలాగే `పుష్ప` చిత్రంలో శ్రీవల్లిగా చిత్తూరు యాసతో, పక్కా డీ-గ్లామర్ అవతారంలో మెప్పించిన రష్మిక మందన్న ఆ ఒక్క పాత్రతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొంది నేడు టాలీవుడ్, బాలీవుడ్‌లలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అవతరించారు.

ఇదే బాటలో సమకాలీన కథానాయికలు కూడా గ్లామర్ ఇమేజ్‌ను పక్కన పెట్టి రస్టిక్ పాత్రలను వైపు మొగ్గు చూపుతున్నారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న `భోగి` సినిమాలో అనుపమ పరమేశ్వరన్ `సులోచన` అనే పల్లెటూరి అమ్మాయిగా మేకప్ లేకుండా క‌నిపించ‌నుంది. ఇదే చిత్రంలో డింపుల్ హయాతి కూడా డీ-గ్లామర్ పాత్రలోనే ప్రేక్షకులను అలరించబోతున్నారు. మేకప్ షేడ్స్ కంటే సహజత్వానికే ప్రేక్షకులు జై కొడుతున్నారని గ్రహించిన భామలు కంఫర్ట్ జోన్ దాటి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కొస్తున్నారు.

జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ సైతం రొటీన్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటోంది. `రౌడీ జనార్ధన్` చిత్రంలో ఇంటెన్స్ అండ్ డీ-గ్లామర్ లుక్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అలాగే ఐశ్వర్య లక్ష్మి `సంబరాల ఏటిగట్టు` సినిమాలో పక్కా నాటు లుక్‌లో క‌నిపించ‌నుంది. రష్మిక మరోసారి `మైసా`, `రణబాలి` వంటి చిత్రాల కోసం పూర్తిగా డీ-గ్లామర్ అవతారంలోకి మారుతోంది. ఆ ర‌కంగా నటనకు ఉన్న అవకాశాలను పిండుకుంటున్నారు. కథలో డ్రామాను, భావోద్వేగాలను పండించడంలో ఇలాంటి రా అండ్ రస్టిక్ పాత్రలు ఎంతగానో దోహదపడుతున్నాయి.

దర్శక నిర్మాతలు కూడా కమర్షియల్ హంగుల కంటే కథలోని సహజత్వానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. గ్లామర్ ప్రదర్శన వల్ల వచ్చే క్రేజ్ తాత్కాలికమేనని.. కానీ నటనకు స్కోప్ ఉండే డీ-గ్లామర్ పాత్రలు ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోతాయని నటీమణులు గ్రహిస్తున్నారు. మట్టి కథలలోని తీవ్రత, పాత్రలోని వైవిధ్యం నటిలోని అసలు ప్రతిభను బయటకు తీసి వారికి అవార్డులతో పాటు ఇండస్ట్రీలో సుదీర్ఘమైన కెరీర్‌ను అందిస్తున్నాయి.

అంతిమంగా తాత్కాలికమైన గ్లామర్ మెరుపుల కంటే శాశ్వతంగా గా నిలిచిపోయే మట్టి కథలే హీరోయిన్ల కెరీర్‌కు అసలైన మైలేజ్ ఇస్తున్నాయి. ఒకప్పుడు డీ-గ్లామర్ పాత్రలంటే భయపడే పరిస్థితి నుంచి ఆ పాత్రల కోసమే పోటీ పడే స్థాయికి ట్రెండ్ మారింది. నటనకు ప్రాధాన్యమిచ్చే ఆరోగ్యకరమైన పరిణామం చిత్ర పరిశ్రమకు, అలాగే వైవిధ్యమైన సినిమాలను కోరుకునే ప్రేక్షకులకు శుభపరిణామం.