Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: యాక్ష‌న్ క్వీన్‌లు తాట తీస్తారు జాగ్ర‌త్త‌!

ప్రస్తుతం దక్షిణాదిలో యాక్షన్, లేడీ ఓరియంటెడ్ పాత్రలతో మెరుస్తున్న టాప్ హీరోయిన్ల వివ‌రాల్లోకి వెళితే..

By:  Sivaji Kontham   |   3 May 2026 2:00 PM IST
ట్రెండీ టాక్‌: యాక్ష‌న్ క్వీన్‌లు తాట తీస్తారు జాగ్ర‌త్త‌!
X

ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. యాక్షన్, సస్పెన్స్, సోషల్ డ్రామా ఏదైనా సరే.. మేము సైతం అంటూ అగ్ర కథానాయికలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తూ.. రిస్కీ స్టంట్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు. బాలీవుడ్‌లో క‌త్రిన‌, దీపిక, ఆలియా, కృతి లాంటి భామ‌లు యాక్ష‌న్ స్టార్లు గా అదర‌గొడుతున్నారు. ప్రస్తుతం దక్షిణాదిలో యాక్షన్, లేడీ ఓరియంటెడ్ పాత్రలతో మెరుస్తున్న టాప్ హీరోయిన్ల వివ‌రాల్లోకి వెళితే..

కాజల్ అగర్వాల్ - `ది ఇండియా స్టోరీ`

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తన కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ఈ భామ‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `ది ఇండియా స్టోరీ`. డీకే చేతన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో-నేషనల్ డ్రామాలో కాజల్ ఒక ధైర్యవంతురాలైన న్యాయవాది పాత్రలో కనిపిస్తారు. సాగులో పురుగు మందుల వినియోగం, ర‌సాయ‌నాల‌ దుర్వినియోగం వెనుక ఉన్న కుంభకోణాలను వెలికితీసే పాత్రలో కాజ్ నటించారు. ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది.

సమంత - మా ఇంటి బంగారం

లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సమంత తాజాగా`మా ఇంటి బంగారం` అనే ఫ్యామిలీ యాక్షన్ డ్రామాతో వస్తున్నారు. బీవీ నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత పాత్ర సరికొత్తగా ఉండబోతోంది. ప్రత్యేకించి ఇందులో సామ్ చేసిన హై-ఇంపాక్ట్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలవనున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. స‌మంత‌- నందిని రెడ్డి కాంబినేష‌న్ లో గ‌తంలో ఓ బేబి లాంటి లేడీ ఓరియెంటెడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తెర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే.

రష్మిక మందన్నా: రెయిన్‌బో-మైసా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం రెండు విభిన్నమైన లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

రెయిన్‌బో అనే రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ తో పాటు మైసా అనే చిత్రంలో న‌టిస్తున్నారు. రెయిన్ బో చిత్రంలో రష్మిక ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో కనిపిస్తారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా `మైసా` కోసం రష్మిక బ్యాంకాక్‌లో ప్రత్యేకంగా హ్యాండ్-టు-హ్యాండ్ ఫైట్స్, హై స్పీడ్ యాక్షన్ టెక్నిక్స్ నేర్చుకున్నారు. ఇందులో గిరిజన యోధురాలిగా కనిపించబోతున్నారు. ఒక యాక్షన్ సీన్ కోసం ఆమె ఏకంగా 80 అడుగుల ఎత్తు నుంచి జంప్ చేయడం విశేషం.

కీర్తీ సురేష్ - `సత్యవాన్ సావిత్రి`

మహానటి కీర్తీ సురేష్ ప్రస్తుతం కోర్ట్ రూమ్ థ్రిల్లర్`సత్యవాన్ సావిత్రి`లో నటిస్తున్నారు. ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమె ఒక పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో కనిపిస్తున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా అర్థమవుతోంది. అమాయకత్వంతో పాటు గట్టి పోరాటం చేసే మనస్తత్వం ఉన్న మహిళగా కీర్తీ ఈ సినిమాలో మెప్పించనున్నారు.

సంయుక్త - `ది బ్లాక్ గోల్డ్`

వరుస హిట్లతో `గోల్డెన్ లెగ్`గా పేరు తెచ్చుకున్న సంయుక్త.. తన తొలి లేడీ ఓరియంటెడ్ సినిమా `ది బ్లాక్ గోల్డ్` తో రాబోతున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారు. అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలోనే ఐదు భాషల్లో విడుదల కానుంది.

సాయి పల్లవి - ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్

విలక్షణ నటి సాయి పల్లవి లెజెండరీ సింగర్ ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ ఈ ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది. ఒకవేళ ఇది ఖరారైతే, సాయి పల్లవి కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోతుంది. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ స‌ర‌స‌న సాయిప‌ల్ల‌వి ఏక్ దిన్ అనే చిత్రంలో న‌టించింది. ఆ సినిమాలో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

కామాక్షి భాస్కర్ల - అగధ

నిర్మాత - దర్శకుడు ఎం.ఎస్. రాజు తెరకెక్కించిన `అగధ` చిత్రంలో కామాక్షి భాస్కర్ల `మహాదేవి` అనే ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 45 నిమిషాల వి.ఎఫ్.ఎక్స్ తో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.