మోస్ట్ పాపులర్ హీరో డార్లింగ్, హీరోయిన్ సామ్
భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌కు కొత్త ప్రమాణాలను నిర్ధారించే రీతిలో ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన తాజా లిస్ట్ చర్చనీయాంశంగా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 21 April 2026 10:23 PM ISTభారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్‌కు కొత్త ప్రమాణాలను నిర్ధారించే రీతిలో ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసిన తాజా లిస్ట్ చర్చనీయాంశంగా మారింది. మార్చి నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ ఇండియన్ ఫిల్మ్ స్టార్స్ ర్యాంకింగ్స్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అగ్రస్థానాన్ని దక్కించుకోవడం విశేషంగా నిలిచింది. అతని తర్వాతి స్థానాల్లో అల్లు అర్జున్, విజయ్, షారుఖ్ ఖాన్, మహేష్ బాబు వరుసగా నిలిచారు. ఈ లిస్ట్ సోషల్ మీడియా ట్రెండ్స్, ఆడియన్స్ ఎంగేజ్‌మెంట్, పాపులారిటీ ఇండెక్స్.. పలు ప్రమాణాల ఆధారంగా రూపొందించబడటం గమనార్హం. ముఖ్యంగా టాలీవుడ్ హీరోలు ఈ లిస్టులో ఆధిపత్యం ప్రదర్శించడం ఇండస్ట్రీ ప్రభావాన్ని మరోసారి రుజువు చేస్తోంది.
ఇక హీరోయిన్ల విభాగంలో సమంత రూత్ ప్రభు తొలి స్థానాన్ని దక్కించుకోవడం ఆమె కొనసాగుతున్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలిచింది. ఆమె తర్వాత ఆలియా భట్, రష్మిక మందన్నా, దీపికా పదుకొణె, కాజల్ అగర్వాల్ స్థానాలను సంపాదించుకున్నారు. సౌత్ హీరోయిన్లు కూడా ఈ జాబితాలో గట్టి ప్రాధాన్యం సంపాదించడం విశేషం. ముఖ్యంగా సాయి పల్లవి, నయనతార, త్రిష కృష్ణన్ లాంటి హీరోయిన్లు తమ స్థిరమైన ఫ్యాన్ బేస్‌తో టాప్ 10లో నిలిచారు.
ఈ ర్యాంకింగ్స్‌ను పరిశీలిస్తే ప్రాంతీయ సరిహద్దులు ఇకపై పెద్దగా ప్రభావం చూపడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. పాన్ ఇండియా కాన్సెప్ట్ బలపడడంతో భాషకు అతీతంగా స్టార్‌లకు అభిమాన వర్గం విస్తరిస్తోంది. రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ లాంటి టాలీవుడ్ హీరోలు నార్త్ ఇండియన్ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకోవడం దీనికి ఉదాహరణ. అదే సమయంలో సల్మాన్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్ లాంటి బాలీవుడ్ స్టార్‌లు కూడా తమ స్థిర స్థానం కొనసాగించడం గమనించదగిన అంశం.
మొత్తంగా చూస్తే, ఈ నెల ర్యాంకింగ్స్‌లో టాలీవుడ్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్నేళ్లుగా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు, భారీ స్థాయి నిర్మాణాలు, గ్లోబల్ రీచ్ వంటి అంశాలు తెలుగు సినీ పరిశ్రమను దేశవ్యాప్తంగా ముందంజలో నిలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్, సమంత లాంటి స్టార్లు నంబర్ వన్ స్థానాల్లో నిలవడం కేవలం వ్యక్తిగత విజయమే కాకుండా టాలీవుడ్ ఎదుగుదలకు ప్రతీకగా నిలుస్తోంది. ముందున్న నెలల్లో ఈ ర్యాంకింగ్స్‌లో మార్పులు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
