సామ్ సినిమాకు మరోసారి కష్టాలు?
చాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది.
By: Sravani Lakshmi Srungarapu | 25 May 2026 10:29 AM ISTచాలా కాలం తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి కనిపిస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి ఈ సినిమాను డైరెక్టర్ నందినీ రెడ్డి తన కెరీర్‌లోనే డిఫరెంట్ జానర్‌గా ప్లాన్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు దాని రిలీజ్ డేట్ చుట్టూనే ఎక్కువ చర్చ నడుస్తోంది. మొదట మే 14న రిలీజ్ చేయాలని భావించిన ఈ సినిమాను పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ కారణంగా జూన్ 19కి మార్చారు. మధ్యలో జూన్ 4 ఆప్షన్ కూడా పరిశీలించినా, అదే డేట్‌ను పెద్ది లాక్ చేసుకోవడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్ సినిమా జూన్ 19 రిలీజ్‌కు రెడీ అవుతోందన్న వార్త కోలీవుడ్ ట్రేడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన రాకపోయినా, సెన్సార్ ప్రక్రియ పూర్తయి రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. ఇదే ఇప్పుడు మా ఇంటి బంగారం టీమ్‌లో టెన్షన్ ను పెంచుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, తమిళనాడులో మాత్రం విజయ్ సినిమా వస్తే థియేటర్ల పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. ముఖ్యంగా రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్ చేస్తున్న చివరి సినిమా అనే ఎమోషనల్ ట్యాగ్ ఈ సినిమాకు భారీ హైప్ తీసుకొచ్చింది. అలాంటి సమయంలో అదే రోజున సమంత సినిమా రిలీజ్ చేయడం రిస్క్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు థియేటర్ల విషయంలో ఎప్పటినుంచో ఉన్న సమస్య మరోసారి చర్చకు వస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు మల్టీప్లెక్సులు, సింగిల్ స్క్రీన్స్ పెద్ద సంఖ్యలో కేటాయించే పరిస్థితుల్లో, లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు సరిపడా షోలు దొరకడం కష్టమవుతోంది. సమంతకు స్టార్ ఇమేజ్ ఉన్నప్పటికీ, విజయ్ లాంటి భారీ మార్కెట్ ఉన్న హీరో సినిమా ఎదురైతే స్క్రీన్ కౌంట్‌పై ప్రభావం తప్పదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తమిళం, మలయాళం వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయాలనుకుంటే పరిస్థితి ఇంకా క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కేరళలో కూడా విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా థియేటర్ల ప్రాధాన్యం జన నాయగన్ మూవీకే వెళ్లొచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే జూన్ నెల రిలీజ్ క్యాలెండర్ గందరగోళంగా మారింది. పెద్ది, లెనిన్, జన నాయగన్, మా ఇంటి బంగారం లాంటి క్రేజీ ప్రాజెక్టులు తక్కువ గ్యాప్‌లో రావడంతో డిస్ట్రిబ్యూటర్లు కూడా లెక్కలు మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మా ఇంటి బంగారం మరోసారి వాయిదా పడుతుందా అన్న సందేహాలు ఇండస్ట్రీలో మొదలయ్యాయి. అయితే మూవీ టీమ్ మాత్రం ప్రస్తుతం ట్రైలర్‌పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ట్రైలర్ స్ట్రాంగ్ గా క్లిక్ అయితే రిలీజ్ డేట్‌పై ధైర్యంగా ముందుకెళ్లొచ్చన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.
అయితే సమంతకు ఇది మామూలు సినిమా కాదు. ఇటు పర్సనల్‌గానూ, అటు కెరీర్ పరంగానూ మా ఇంటి బంగారం సామ్‌కు కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది. గ్యాప్ తర్వాత వస్తున్న కంబ్యాక్ మూవీ కావడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో భారీ స్టార్ సినిమాల మధ్య నిలబడాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. దీంతో ఇప్పుడు మా ఇంటి బంగారం భవిష్యత్ పూర్తిగా కంటెంట్, ట్రైలర్ బజ్, అలాగే థియేటర్ల సమీకరణలపైనే ఆధారపడినట్టు కనిపిస్తోంది.
