బాక్సాఫీస్ టెన్షన్ లేకుండా సమంత ప్లాన్!
ఇలాంటి పరిస్థితుల్లో సమంత నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహం అమలైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
By: Sravani Lakshmi Srungarapu | 16 Jun 2026 12:15 PM ISTప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే కేవలం మంచి కంటెంట్ సరిపోదు. బడ్జెట్, బిజినెస్ డీల్స్, థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కుల విక్రయాలు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా ఇటీవల స్టార్ హీరోల సినిమాలు భారీ మొత్తాలకు అమ్ముడవుతున్న నేపథ్యంలో, పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ చేరుకోవడం నిర్మాతలకు పెద్ద సవాల్‌గా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సమంత నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా విషయంలో మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యూహం అమలైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ లెక్కలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ సినిమా నాన్- థియేట్రికల్ రైట్స్ ను మేకర్స్ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని చాలా రీజనబుల్ రేట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ వంటి హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే సినిమా నిర్మాణ వ్యయంలో గణనీయమైన భాగం రికవరీ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. కొందరైతే సమంత పెట్టిన పెట్టుబడి దాదాపు పూర్తిగా తిరిగి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న ప్రధాన ఆలోచన రిస్క్‌ను తగ్గించడం. సాధారణంగా భారీ రేట్లకు రైట్స్ అమ్మినప్పుడు ఆ మొత్తాలను తిరిగి రాబట్టేందుకు సినిమా బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. కానీ మా ఇంటి బంగారం విషయంలో మాత్రం థియేట్రికల్ బిజినెస్‌ను కూడా అందుబాటు స్థాయిలో ఉంచినట్లు సమాచారం. దీంతో సినిమా రిలీజ్ తర్వాత మంచి టాక్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు తక్కువ సమయంలోనే లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక సెన్సార్ టాక్ కూడా టీమ్ కు మరింత ధైర్యాన్ని ఇస్తోందని తెలుస్తోంది. సినిమా చూసిన కొందరు సభ్యులు కథ, ఎమోషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలపై సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కంటెంట్ ఈ సినిమాలో బలంగా ఉందనే టాక్ వినిపిస్తోంది. హీరోయిన్ గా ఇప్పటికే ఎన్నో విజయాలు అందుకున్న సమంత, నిర్మాతగా మాత్రం తొలి అడుగుల నుంచే వ్యాపారపరంగా పరిపక్వత చూపిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రశంసలు వినిపిస్తున్నాయి. తన తొలి నిర్మాణ సినిమా శుభం విషయంలో కూడా సమంత ఇలానే తెలివిగా వ్యవహరించి మంచి లాభాలను అందుకున్నారు. భారీ అంచనాల కంటే స్థిరమైన రికవరీకి ప్రాధాన్యం ఇచ్చిన ఆమె డెసిషన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ టాక్ నిజమై ఆడియన్స్ నుంచి నుంచి కూడా అదే రేంజ్ లో రెస్పాన్స్ వస్తే, మా ఇంటి బంగారం సినిమా టైటిల్‌కు తగ్గట్టే నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యాలకు నిజమైన బంగారంగా మారే అవకాశం కనిపిస్తోంది.
